బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండో టెస్టు నేపథ్యంలో క్రికెట్ ప్రేమికుల దృష్టి విరాట్ కోహ్లిపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ స్టార్ ప్లేయర్ బ్యాట్ ఝులిపిస్తాడా? లేదంటే మరోసారి నిరాశనే మిగులుస్తాడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లి భారత బౌలర్లను ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడన్న విషయం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది.
తొలి టెస్టులో పూర్తిగా విఫలం
సుమారు ఏడాదిన్నర విరామం తర్వాత.. బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి సొంతగడ్డపై టెస్టు బరిలో దిగాడు. అయితే, చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 6, 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లో అవుటైన ఈ ఢిల్లీ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ చేతికి చిక్కాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి కాబట్టి సరిపోయింది గానీ.. లేదంటే కోహ్లి వైఫల్యంపై విమర్శలు తారస్థాయికి చేరేవే! అయితే, ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం అంటూ ఈ రన్‌మెషీన్‌కు మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. రెండోటెస్టులో మునుపటి కోహ్లిని చూస్తామని జోస్యం చెబుతున్నారు.
15 బంతుల్లో నాలుగుసార్లు అవుట్!
ఈ నేపథ్యంలో నెట్స్‌లో కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడనే వార్తలు తెరమీదకు వచ్చాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అందించిన వివరాల ప్రకారం.. టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో 15 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నాలుగుసార్లు అవుటయ్యాడు. తను వేసిన నాలుగో బంతికే కోహ్లి వికెట్ల ముందు దొరికిపోవడంతో.. బుమ్రా.. ‘‘యూ ఆర్ ప్లంబ్(ఎల్బీడబ్ల్యూ)’’ అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఆ తర్వాత రెండో బంతికే ఆఫ్ స్టంప్ పక్క దిశగా వెళ్తున్న బంతిని టచ్ చేసి.. వికెట్ పారేసుకున్నాడు. మరో రెండుసార్లు కూడా బుమ్రా బౌలింగ్‌లో ఇలాగే బంతిని తప్పుగా అంచనా వేసిమూల్యం చెల్లించిన కోహ్లి.. ఆ తర్వాత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను ఎదుర్కొన్నాడు.
జడ్డూ బౌలింగ్‌లో తడబడ్డ కోహ్లి
ఈ ముగ్గురిలో ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ జడ్డూ బౌలింగ్‌లో తడబడ్డ కోహ్లి.. అక్షర్ బౌలింగ్‌లో మరింత తేలిపోయాడు. దీంతో.. కోహ్లి అసహనంగా నెట్స్‌ను వీడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్ వచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
కాగా రెండో టెస్టుకు వేదికైన కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. దీంతో బంగ్లా స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ వంటి వారిని కోహ్లి ఎలా ఎదుర్కోనున్నాడన్నది ఆసక్తికంరగా మారింది. భారత్- బంగ్లా మధ్య శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు మొదలుకానుంది.
చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment