India vs England, 1st Test: టీమిండియాతో తొలి టెస్టులో విజయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ హర్షం వ్యక్తం చేశాడు. భారత గడ్డపై సాధించిన ఈ గెలుపు వందకు వంద శాతం ఎంతో గొప్పదని వ్యాఖ్యానించాడు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి సాధించిన పరిపూర్ణ విజయమని పేర్కొన్నాడు.
నాలుగో రోజే ముగిసిన టెస్టు
అదే విధంగా.. ఉపఖండంలో తొలిసారి కెప్టెన్ హోదాలో అడుగుపెట్టానని.. తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య జట్టును ఓడించడం సంతోషంగా ఉందన్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ టీమిండియాను 28 పరుగుల తేడాతో ఓడించింది. ఉప్పల్‌లో తొలి రెండు రోజులు వెనుకబడ్డ స్టోక్స్ బృందం.. అనూహ్యంగా పుంజుకుని నాలుగో రోజే ఖేల్ ఖతం చేసి విజయం అందుకుంది.
పరిపూర్ణ విజయం..
ఒలీ పోప్ అద్భుత శతకం(196), అరంగేట్ర స్పిన్నర్ టామ్ హార్లీ(మొత్తం తొమ్మిది వికెట్లు) కారణంగా ఊహించని రీతిలో టీమిండియాను ఓడించింది. ఈ నేపథ్యంలో స్టోక్స్ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మా జట్టు విజయాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఘన విజయం మరింత గొప్పగా అనిపిస్తోంది. ఇండియాలో కెప్టెన్‌గా నా తొలి ప్రయత్నంలోనే గెలుపు దక్కింది.
తొలి ఇన్నింగ్స్‌లో మేము పొరపడ్డ మాట వాస్తవం. అయితే, టీమిండియా స్పిన్నర్లు ఆడుతున్న తీరు.. రోహిత్ ఫీల్డింగ్ సెట్ చేస్తున్న విధానాన్ని గమనిస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. వాటిని మా వ్యూహాలకు అనుగుణంగా అమలు చేసి ఫలితం రాబట్టడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది’’ అని ఆనందం వ్యక్తం చేశాడు.
వాళ్లిద్దరు అత్యద్భుతం
అదే విధంగా తమ విజయంలో కీలక పాత్ర పోషించిన ఒలీ పోప్, టామ్ హార్లీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘భుజానికి సర్జరీ చేయించుకున్న తర్వాత ఒలీ పోప్ రీ ఎంట్రీలో ఇలా అదరగొట్టాడు. టామ్‌కు ఇదే అరంగేట్ర మ్యాచ్. అయినప్పటికీ తన మీద నమ్మకంతో వరుసగా ఓవర్లు వేయించాను. ప్రతికూల ఫలితం వచ్చినా పర్లేదని ముందే నిశ్చయించుకున్నా.
అయితే, అతడు నా నమ్మకాన్ని నిజం చేశాడు. ఉపఖండంలో అనేక టెస్టులు ఆడిన అనుభవం నాకు ఉంది. అయితే, ఓ ఇంగ్లిష్ బ్యాటర్ ఇక్కడ ఆడిన అత్యద్భుత ఇన్నింగ్స్ ఏదంటే.. ఒలీ పోప్ పేరు చెప్పొచ్చు.
నిజానికి ఒకవేళ మేము ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా నేను పెద్దగా బాధపడే వాడిని కాదు. వైఫల్యాలకు భయపడే వాడిని కానేకాను. ఆటగాళ్లను కావాల్సినంత ప్రోత్సాహం అందిస్తూ.. ఎల్లవేళలా వాళ్లకు మద్దతుగా నిలిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని నమ్ముతాను’’ అని బెన్ స్టోక్స్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.
చదవండి: IND Vs ENG: ఇంట్లోనే తలవంచారు... భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment