సాక్షి, విశాఖపట్నం: టీమిండియా – ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌కు నగరంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఫిబ్రవరి 2- 6 వరకు నిర్వహించనున్న ఈ మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేసినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు.
ఇరు జట్ల ఆటగాళ్లు జనవరి 30న విశాఖపట్నానికి చేరుకుంటారని తెలిపారు. హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 3.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారని గోపినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆటగాళ్ల వెంట మ్యాచ్ అధికారులు, ఇతర సిబ్బంది రానున్నట్లు వెల్లడించారు.
పనులన్నీ పూర్తి చేయాలి
ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణలో భాగంగా స్థానిక స్టేడియంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఏసీఏ ట్రెజరర్ ఎ.వి.చలంతో కలిసి గోపినాథ్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. స్టేడియం లోపల, బయట చేపడుతున్న పనులను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ
అదే విధంగా... వాహనాల పార్కింగ్ వద్ద తగిన సిబ్బందిని నియమించి ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గోపీనాథ్‌రెడ్డి ఆదేశించారు. రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ ఇవ్వనున్న దృష్ట్యా వారి ఐడీ కార్డులను పరిశీలించి స్టేడియంలోకి పంపాలన్నారు.
ఇక విద్యార్థులతో పాటు.. రోజుకు 2,850 మంది చొప్పున.. 5 రోజులకు 14,250 మంది రాష్ట్రంలో ఉన్న క్లబ్ క్రీడా కారులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఉప్పల్ మ్యాచ్‌లో రోహిత్ సేన స్టోక్స్ బృందం చేతిలో 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టెస్టులో 0-1తో వెనుకబడింది.
Comments
Please login to add a commentAdd a comment