IND VS ENG 3rd Test Day 4: రాజ్‌కోట్‌ టెస్టులో భారత్‌ ఘన విజయం.. | IND vs ENG, 3rd Test Day 4 Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND VS ENG 3rd Test Day 4: రాజ్‌కోట్‌ టెస్టులో భారత్‌ ఘన విజయం..

Published Sun, Feb 18 2024 9:36 AM | Last Updated on Sun, Feb 18 2024 4:49 PM

IND VS ENG 3rd Test Day 4 Updates And Highlights - Sakshi

IND VS ENG 3rd Test Day 4 Updates And Highlights: 

రాజ్‌కోట్‌ టెస్టులో భారత్‌ ఘన విజయం.. 
రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ భారత బౌలర్ల దాటికి.. కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్‌ దూసుకెళ్లింది.  భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లీష్‌ జట్టు పతనాన్ని శాసించగా.. కుల్దీప్‌ యాదవ్‌ రెండు, అశ్విన్‌ ఒక్క వికెట్‌ సాధించారు.
ఒక్క వికెట్‌ దూరంలో..
రాజ్‌కోట్‌ టెస్టులో విజయానికి భారత్‌ కేవలం ఒక్క వికెట్‌ దూరంలో నిలిచింది. వరుస క్రమంలో ఇంగ్లండ్‌ రెండు వికెట్లను కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఫోక్స్‌ ఔట్‌ కాగా.. అశ్విన్‌ బౌలింగ్‌లో హార్ట్‌లీ పెవిలియన్‌కు చేరాడు.

ఓటమి దిశగా ఇంగ్లండ్‌..
ఇంగ్లండ్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. రెహాన్‌ అహ్మద్‌ రూపంలో ఇంగ్లండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 28 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 53/7

విజయం దిశగా భారత్‌..
రాజ్‌కోట్‌ టెస్టులో టీమిండియా విజయం వైపు అడుగులు వేస్తోంది.  557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. 50 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. భారత్‌ విజయానికి కేవలం 4 వికెట్ల దూరంలో నిలిచింది.

ఐదో వికెట్‌ డౌన్‌..
జో రూట్‌ రూపంలో ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రూట్‌.. జడేజా బౌలింగ్‌లో రూట్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. 22 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 50/5. క్రీజులో బెన్‌ స్టోక్స్‌, బెన్‌ ఫోక్స్‌ ఉన్నారు.

పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్‌..
557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జడేజా బౌలింగ్‌లో జానీ బెయిర్‌ స్టో.. నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్‌ విజయానికి ఇంకా 519 పరుగులు కావాలి.

మూడో వికెట్‌ డౌన్‌..
20 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ఓలీ పోప్‌.. జడేజా బౌలిం‍గ్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 24/3

రెండో వికెట్‌ డౌన్‌..
జాక్‌ క్రాలే రూపంలో ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన క్రాలే.. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌..
557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ బెన్‌ డకెట్‌(4) రనౌటయ్యాడు. క్రీజులోకి ఓలీ పోప్‌ వచ్చాడు.7 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 18/1

ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన భారత్‌
భారత్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను 430/4 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసింది. టీమిండియా.. ఇంగ్లండ్‌కు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్‌ 214, సర్ఫరాజ్‌ ఖాన్‌ 68 పరుగులతో అజేయంగా నిలిచారు. 

మరో డబుల్‌ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్‌
రెండో టెస్ట్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్‌.. మూడో టెస్ట్‌లో మరో డబుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ డబుల్‌ను యశస్వి 231 బంతుల్లో పూర్తి చేశాడు. ఇందులో 10 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా స్కోర్‌ 411/3గా ఉంది. లీడ్‌ 537 పరుగులుగా ఉంది.

మరో హాఫ్‌ సెంచరీ చేసిన సర్పరాజ్‌ ఖాన్‌
తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగుల వద్ద పొరపాటున రనౌటైన సర్ఫరాజ్‌ ఖాన్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మరో హాఫ్‌ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 66 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్‌.. 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 

మరో డబుల్‌ దిశగా దూసుకుపోతున్న యశస్వి
భారత యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ మరో డబుల్‌ సెంచరీ దిశగా దూసకుపోతున్నాడు. నిన్న రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగి ఇవాళ తిరిగి బరిలోకి దిగిన యశస్వి.. ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం యశస్వి 182 పరుగుల వద్ద ఉన్నాడు. అతనికి జతగా సర్ఫరాజ్‌ ఖాన్‌ (33) క్రీజ్‌లో ఉన్నాడు.  సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్‌ 359/4గా ఉంది. 

440 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
నాలుగో రోజు లంచ్‌ విరామం సమయానికి టీమిండియా ఆధిక్యం 440 పరగులుగా ఉంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (149), సర్ఫరాజ్‌ ఖాన్‌ (22) క్రీజ్‌లో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
258 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. రెహాన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి కుల్దీప్‌ యాదవ్‌ (27) ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్‌ (115), సర్ఫరాజ్‌ ఖాన్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

91 పరుగుల వద్ద ఔటైన శుభ్‌మన్‌ గిల్‌
శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీకి చేరువలో (91) రనౌటాయ్యడు. కుల్దీప్‌ తప్పిదం కారణంగా గిల్‌ ఔటయ్యాడు. నిన్న రిటైర్ట్‌ హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వి (107) క్రీజ్‌లోకి వచ్చాడు.

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ స్కోర్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 192/2గా ఉంది. శుభ్‌మన్‌ గిల్‌ (65), కుల్దీప్‌ యాదవ్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 322 పరుగుల లీడ్‌లో ఉంది.

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ అద్బుతమైన సెంచరీతో (107) ఆకట్టుకోగా.. రోహిత్‌ శర్మ (19), రజత్‌ పాటిదార్‌ (0) నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్‌ సెంచరీ అనంతరం రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జో రూట్‌, టామ్‌ హార్ట్లీ తలో వికెట్‌ పడగొట్టారు. 

స్కోర్‌ వివరాలు..
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 445 ఆలౌట్‌ (రోహిత్‌ 131, జడేజా 112)
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 319 ఆలౌట్‌ (బెన్‌ డకెట్‌ 153)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement