#Ind vs Eng: టీమిండియాదే సిరీస్‌.. రసవత్తర మ్యాచ్‌లో ఆ ఇద్దరు ‘హీరోల’ వల్లే! | Ind Vs Eng 4th Test: Gill, Jurel Heroics India Won By 5 Wickets To Clinch Series | Sakshi
Sakshi News home page

#Ind vs Eng 4th Test: రసవత్తర మ్యాచ్‌లో కుర్రాళ్లు అదరగొట్టారు.. టీమిండియాదే సిరీస్‌

Published Mon, Feb 26 2024 1:38 PM | Last Updated on Mon, Feb 26 2024 2:36 PM

Ind Vs Eng 4th Test: Gill, Jurel Heroics India Won By 5 Wickets To Clinch Series - Sakshi

India vs England, 4th Test- India Beat England By 5 Wickets: రసవత్తరంగా సాగిన రాంచి టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది.

గిల్‌, జురెల్‌ హీరోచిత ఇన్నింగ్స్‌
వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అద్భుత అజేయ అర్ధ శతకం(52)తో మెరవగా.. ధ్రువ్‌ జురెల్‌(39 నాటౌట్‌) మరో విలువైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయాలకు చేర్చాడు. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది భారత్‌.

కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు భారత్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ తొలి టెస్టులో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఆ మరుసటి మ్యాచ్‌లోనే తిరిగి పుంజుకున్న టీమిండియా.. వరుసగా విజయాలు సాధించింది.

విశాఖపట్నం తర్వాత రాజ్‌కోట్‌.. తాజాగా రాంచి టెస్టులో గెలుపొంది ఇంగ్లండ్‌పై ఆధిపత్యాన్ని చాటుకుంది. దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, మిడిలార్డర్‌లో కీలక ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ లేకున్నా యువ ఆటగాళ్లతోనే సిరీస్‌ గెలిచి సత్తా చాటింది రోహిత్‌ సేన. 

రాంచి టెస్టు రసవత్తరంగా సాగిందిలా..
రాంచి వేదికగా శుక్రవారం ఇంగ్లండ్‌తో మొదలైన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్‌ చేసింది. తొలిరోజు ఆట ఆరంభంలో అరంగేట్ర పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ వరుసగా వికెట్లు పడగొట్టడంతో మొదటి సెషన్‌లో పైచేయి సాధించింది. 

ఆ తర్వాత స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా తలా ఓ చెయ్యి వేయగా.. 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను జో రూట్‌ అజేయ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్‌ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగుల చేసి పైచేయి సాధించింది.

జురెల్‌ ‘జువెల్‌’ ఇన్నింగ్స్‌
రెండో రోజు ఆటలో భాగంగా ఇంకో 51 పరుగులు జతచేసి.. 353 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 2 పరుగులకే అవుట్‌ కాగా.. రజత్‌ పాటిదార్‌ (17), రవీంద్ర జడేజా(12), సర్ఫరాజ్‌ ఖాన్‌(14) విఫలమయ్యారు. 

వన్‌డౌన్‌బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌(38) ఫర్వాలేదనపించాడు. అయితే, మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 73 పరుగులతో జట్టును ఆదుకోగా.. మూడో రోజు ఆటలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ అదరగొట్టాడు. వికెట్లు పడుతున్నా కుల్దీప్‌ యాదవ్‌(28) సహకారంతో పట్టుదలగా నిలబడి 90 పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఆదివారం నాటి ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులు పూర్తి చేయగలిగింది.

అశూ దెబ్బకు ఇంగ్లండ్‌ కుదేలు
ఇక అదే రోజు రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. 145 పరుగులకే ఆలౌట్‌ చేశారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ ఏకంగా 5, కుల్దీప్‌ యాదవ్‌ 4 వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.

అయితే, నాలుగో రోజు ఆరంభంలోనే సీన్‌ రివర్స్‌ అయింది. ఇంగ్లండ్‌ పేసర్‌ యశస్వి జైస్వాల్‌(37)ను పెవిలియన్‌కు పంపగా.. స్పిన్నర్‌ టామ్‌ హార్లే రోహిత్‌ శర్మ(55)ను అవుట్‌ చేశాడు.

బషీర్‌ భయపెట్టాడు.. గిల్‌, జురెల్‌ పూర్తి చేశారు
ఇక రోహిత్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన రజత్‌ పాటిదార్‌ను యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ డకౌట్‌ చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు. అతడి స్థానంలో వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌నూ డకౌట్‌గా వెనక్కి పంపాడు.

ఇలా షోయబ్‌ బషీర్‌ స్పిన్‌ మాయాజాలంలో చిక్కుకున్న టీమిండియాను వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ కలిసి గట్టెక్కించారు. ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి టీమిండియాను గెలిపించారు. క్లిష్ట పరిస్థితుల్లో గిల్‌ అర్ధ శతకం(52), జురెల్‌ 39 పరుగులతో అజేయంగా నిలిచి హీరోలయ్యారు. 

టీమిండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ నాలుగో టెస్టు స్కోర్లు
ఇంగ్లండ్‌ - 353 & 145
ఇండియా- 307 & 192/5
ఫలితం- ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ధ్రువ్‌ జురెల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement