టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదరగొడుతున్న ఈ కుర్ర బ్యాటర్.. ఇటీవల టెస్టుల్లో మాత్రం తేలిపోతున్నాడు. వెస్టిండీస్ పర్యటన సందర్భంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఎంట్రీ ఇచ్చి.. కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా పాతుకుపోగా.. గిల్ వన్‌డౌన్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే.
అయితే, ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్... మూడో స్థానంలో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలోనూ శుబ్‌మన్ గిల్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది.
తొలి టెస్టులో మొత్తంగా కేవలం 23 పరుగులు మాత్రమే చేసిన గిల్.. వైజాగ్‌లో జరుగుతున్న రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ హెడ్‌కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి గిల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
‘‘ఈ జట్టులో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా పుజారా నుంచి వారి స్థానానికి కచ్చితంగా ప్రమాదం పొంచి ఉంటుంది.
రంజీ ట్రోఫీలో అద్భుత ఫామ్‌తో సత్తా చాటుతున్న పుజారా ఎల్లప్పుడూ సెలక్టర్ల దృష్టిలోనే ఉంటాడన్న విషయం మర్చిపోవద్దు. టెస్టు మ్యాచ్ అంటేనే ఓపికగా ఆడాల్సి ఉంటుంది. సహనం లేకుంటే.. సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.
ఆండర్సన్ వంటి క్లాస్ బౌలర్ బౌలింగ్‌లో ఆడుతున్నపుడు చాలా చాలా జాగ్రత్తగా ఆడాలి’’ అంటూ గిల్ పేరెత్తకుండానే.. అతడికి పుజారా రూపంలో పోటీ ఉందంటూ రవిశాస్త్రి హెచ్చరికలు జారీ చేశాడు. కాగా వైజాగ్ టెస్టులో శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
ఇదిలా ఉంటే.. రాహుల్ ద్రవిడ్ తర్వాత టెస్టుల్లో మూడో స్థానంలో అదరగొట్టిన ఛతేశ్వర్ పుజారా ప్రస్తుతం రంజీ ట్రోఫీతో బిజీగా ఉన్నాడు. సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇటీవలే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇరవై వేల పరుగుల అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ద్విశతకంతోనూ చెలరేగి సత్తా చాటాడు. గత కొంతకాలంగా తనను పక్కన పెట్టిన సెలక్టర్ల దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా ఆటతో సత్తా చాటుతున్నాడు ఈ నయావాల్.
Comments
Please login to add a commentAdd a comment