కోహ్లి గోల్డెన్‌ డక్‌.. టీమిండియా కెప్టెన్‌గా చెత్త రికార్డు | IND Vs ENG: Virat Kohli Golden Duck In Anderson Bowling Worst Record | Sakshi
Sakshi News home page

IND VS ENG: కోహ్లి గోల్డెన్‌ డక్‌.. టీమిండియా కెప్టెన్‌గా చెత్త రికార్డు

Published Thu, Aug 5 2021 7:25 PM | Last Updated on Fri, Aug 6 2021 10:49 AM

IND Vs ENG: Virat Kohli Golden Duck In Anderson Bowling Worst Record  - Sakshi

నాటింగ్‌హమ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆడిన తొలి బంతికే ఔటయిన కోహ్లి గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. అండర్సన్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ కోహ్లి స్లిప్‌లో ఉన్న బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా కోహ్లి టెస్టుల్లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడం ఇది ఐదోసారి. ఈ ఐదింటిలో మూడుసార్లు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో కోహ్లి గోల్డెన్‌డక్‌గా వెనుదిరగడం విశేషం.

ఇందులో 2014లో లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో లియామ్‌ ప్లంకెట్‌ బౌలింగ్‌లో, 2018లో ఓవల్‌ వేదికగా జరిగిన టెస్టులో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో రెండుసార్లు గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. తాజాగా అండర్సన్‌ బౌలింగ్‌లో మరోసారి గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. కాగా గోల్డెన్‌ డక్‌ విషయంలో కోహ్లి మరోచెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా మూడుసార్లు గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన కోహ్లి తొలిస్థానంలో ఉ‍న్నాడు. లాలా అమర్‌నాథ్‌, కపిల్‌ దేవ్‌, సౌరవ్‌ గంగూలీలు  టెస్టు కెప్టెన్లుగా రెండేసీ సార్లు గోల్డెన్‌ డక్‌ అయ్యారు.

ఇక అండర్సన్‌ 12 టెస్టుల తర్వాత కోహ్లిని అవుట్‌ చేయడం మరో విశేషం. చివరగా 2014లో ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ టెస్టులో కోహ్లిని అండర్సన్‌ అవుట్‌ చేశాడు. మ్యాచ్‌ విషయానికి వస్తే తొలిరోజు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా రెండో రోజు ఆటలో తడబడుతుంది. లంచ్‌ విరామం వరకు వికెట్‌ నష్టానికి 97 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత్‌.. అనంతరం వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. వెలుతురు సరిగా లేని కారణంగా ప్రస్తుతం అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇప్పటివరకు టీమిండియా 46.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 57, పంత్‌ 7 పరుగులతో ఆడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement