Ind Vs Ire 2023: Team India Reached Ireland, Rinku Singh Post Goes Viral - Sakshi
Sakshi News home page

Ind Vs Ire: కలలు నిజమైన వేళ: వాళ్లు మెరిశారు..! ఇక అందరి దృష్టి అతడిపైనే..

Published Wed, Aug 16 2023 8:38 AM | Last Updated on Wed, Aug 16 2023 8:55 AM

Ind Vs Ire 2023 Team India Reached Ireland Rinku Singh Post Viral - Sakshi

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా (ఫైల్‌ ఫొటో)

డబ్లిన్‌: మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడేందుకు భారత జట్టు ఐర్లాండ్‌ చేరుకుంది. రాజధాని డబ్లిన్‌ శివారులోని మలహైడ్‌ మూడు టి20లకు వేదిక కానుంది. విండీస్‌తో టి20 సిరీస్‌ ఆడి ఈ సిరీస్‌కు కూడా ఎంపికైన ఆటగాళ్లు అక్కడినుంచి నేరుగా డబ్లిన్‌ ప్రయాణించారు.

అయితే ఈ సిరీస్‌ కోసమే జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిధ్‌ కృష్ణ, రుతురాజ్‌ గైక్వాడ్, వాషింగ్టన్‌ సుందర్, రింకూ సింగ్, శివమ్‌ దూబే నేరుగా భారత్‌నుంచి డబ్లిన్‌కు వెళ్లారు.

బుమ్రా ఫిట్‌నెస్‌ను పరీక్షించే క్రమంలో
ఈ నెల 18, 20, 23 తేదీల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. సిరీస్‌ ఫలితంకంటే అందరి దృష్టీ ప్రధానంగా బుమ్రాపైనే నిలిచింది. గాయాలనుంచి కోలుకొని దాదాపు సంవత్సరం కాలం తర్వాత అతను మళ్లీ మ్యాచ్‌ బరిలోకి దిగబోతున్నాడు.

కీలకమైన ఆసియా కప్, ప్రపంచ కప్‌కు అతని బౌలింగ్‌ ప్రాక్టీస్‌తో పాటు మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు ఇది కీలకం కానుంది. బుమ్రా చివరిసారిగా గత ఏడాది సెప్టెంబరు 25న హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో టి20 మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత టి20 వరల్డ్‌ కప్‌ సహా ఇతర సిరీస్‌లతో పాటు ఈ సీజన్‌ ఐపీఎల్‌కు కూడా అతను దూరమయ్యాడు.    

కలలు నిజమైన వేళ
ఇక ఐర్లాండ్‌తో సిరీస్‌ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ఆటగాడు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్టార్‌ రింకూ సింగ్‌ తొలిసారి టీమిండియాకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ‘‘కలలు నిజమైన వేళ.. టీమిండియా తరఫున నా తొలి పర్యటనకు అంతా సిద్ధం.. ఐర్లాండ్‌కు పయనం’’ అంటూ రింకూ ఉద్వేగపూరిత పోస్ట్‌ చేశాడు.

యశస్వి, తిలక్‌ అదరగొట్టారు.. మరి రింకూ?
కాగా ఇటీవల ముగిసిన వెస్టిండీస్‌ టూర్‌ సందర్భంగా ఐపీఎల్‌ స్టార్లు యశస్వి జైశ్వాల్‌(రాజస్తాన్‌ రాయల్స్‌), తిలక్‌ వర్మ(ముంబై ఇండియన్స్‌) తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శనతో ఈ ఇద్దరు లెఫ్టాండర్లు ఆకట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో రింకూ.. ఐర్లాండ్‌ పర్యటనలో ఏ మేరకు రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ఐపీఎల్‌-2023లో రింకూ 14 మ్యాచ్‌లు ఆడి 474 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. యశస్వి, తిలక్‌ వర్మ కూడా ఐరిష్‌ జట్టుతో టీ20లకు ఎంపికైన సంగతి తెలిసిందే.

ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: 
జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్‌), జితేష్ శర్మ (వికెట్‌కీపర్‌), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముకేష్ కుమార్, ఆవేష్ ఖాన్.

చదవండి: ఫుట్‌బాల్‌ దిగ్గజం హబీబ్‌ ఇకలేరు.. చిరస్మరణీయ క్షణాలు అవే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement