భారత్-ఐర్లాండ్ మధ్య ఇవాళ (ఆగస్ట్ 23) జరగాల్సిన నామమాత్రపు మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణమైంది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియానే విజయం సాధించిన విషయం తెలిసిందే. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో తొలి టీ20లో 2 పరుగుల తేడాతో నెగ్గిన భారత్.. రెండో టీ20లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది.
టాప్ స్కోరర్‌గా రుతురాజ్..
కాగా, ఈ సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (2 మ్యాచ్‌ల్లో 77 పరుగులు) టాప్ స్కోరర్‌గా ఉండగా, ఐరిష్ బ్యాటర్ ఆండ్రూ బల్బిర్నీ (2 మ్యాచ్‌ల్లో 76) సెకెండ్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో ఇద్దరు ఐర్లాండ్ బ్యాటర్లు, ఓ టీమిండియా బ్యాటర్ హాఫ్ సెంచరీలు చేశారు. ఐర్లాండ్ తరఫున ఆండ్రూ బల్బిర్నీ (72), బ్యారీ మెక్‌కర్తీ (51) అర్ధశతకం చేయగా.. టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ (58) మాత్రమే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు.
ఇక ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా టీమిండియా బౌలర్లు బుమ్రా, బిష్ణోయ్, ప్రసిద్ధ్ నిలిచారు. ఈ ముగ్గురు మ్యాచ్‌కు రెండు చొప్పున తలో 4 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్ యంగ్ 3 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment