వెనక్కి వెళ్తావా? లేదా?: పంత్‌ను ‘హెచ్చరించిన’ సర్ఫరాజ్‌! | Ind vs NZ 1st Test Day 4: Sarfaraz Khan Jumps To Send Back Pant, Rohit Stunned | Sakshi
Sakshi News home page

వెనక్కి వెళ్తావా? లేదా?: పంత్‌ను ‘హెచ్చరించిన’ సర్ఫరాజ్‌! రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌

Published Sat, Oct 19 2024 3:27 PM | Last Updated on Sat, Oct 19 2024 3:47 PM

Ind vs NZ 1st Test Day 4: Sarfaraz Khan Jumps To Send Back Pant, Rohit Stunned

టీమిండియా- న్యూజిలాండ్‌ తొలి టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ను ‘వెనక్కి పంపేందుకు’ సెంచరీ సర్ఫరాజ్‌ ఖాన్‌ వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది. అసలు సంగతి ఏమిటంటే!?

బెంగళూరు వేదికగా భారత్‌- కివీస్‌ జట్ల మధ్య గురువారం(రెండో రోజు) మొదటి టెస్టు మొదలైన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన..తమ తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది. కేవలం 46 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. తద్వారా స్వదేశంలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.

అయితే, టీమిండియా బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై న్యూజిలాండ్‌ ఆటగాళ్లు మాత్రం మెరుగ్గా ఆడారు. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే 91, రచిన్‌ రవీంద్ర 134, టిమ్‌ సౌథీ 65 పరుగులతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో కివీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసి.. భారత్‌ కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

రోహిత్‌, విరాట్‌ హాఫ్‌ సెంచరీలు.. 
ఈ నేపథ్యంలో పరువు కాపాడుకోవాలంటే టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తప్పక రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(52), విరాట్‌ కోహ్లి(70) అర్ధ శతకాలతో బలమైన పునాది వేశారు. అయితే, సర్ఫరాజ్‌ ఖాన్‌ రాకతో టీమిండియా స్కోరు బోర్డు మరింత వేగంగా పరుగులు పెట్టింది. కేవలం 42 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. శనివారం నాటి ఆటలో శతకం సాధించాడు.

పంత్‌, సర్ఫరాజ్‌ దూకుడు
అయితే, కోహ్లి అవుటైన తర్వాత సర్ఫరాజ్‌కు రిషభ్‌ పంత్‌ జతకాగా.. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ కివీస్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచారు.  ఈ క్రమంలో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 56వ ఓవర్‌ వేసిన మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో తొలి బంతికి సర్ఫరాజ్‌ ఖాన్‌ షాట్‌ ఆడి.. సింగిల్‌ తీసుకున్నాడు. అయితే, పంత్‌ రెండో పరుగు కోసం పరిగెత్తుకు రాగా.. ప్రమాదాన్ని పసిగట్టిన సర్ఫరాజ్‌ నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌ నుంచి కాస్త ముందుకు వచ్చి గట్టిగా అరిచాడు.

 వెనక్కి వెళ్తావా? లేదా?
 పంత్‌ను ఎలాగైనా వెనక్కి పంపించడం సహా ఫీల్డర్ల ఏకాగ్రత చెదిరేలా గెంతులు వేస్తూ పంత్‌కు సైగలు చేశాడు. దీంతో పంత్‌ క్రీజులోకి వెళ్లగా.. అప్పటికే ఫీల్డర్‌  త్రో చేసిన బంతిని కివీస్‌ వికెట్‌ కీపర్‌ టామ్‌ బ్లండెల్‌ వికెట్ల వైపునకు విసిరాడు. అయితే, అంతకంటే ముందే పంత్‌ క్రీజులోకి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది.

రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌
ఇదిలా ఉంటే.. పంత్‌ను వెనక్కి పంపేందుకు సర్ఫరాజ్‌ చిన్న పిల్లాడిలా జంప్‌ చేసిన విధానం.. భారత శిబిరంలో నవ్వులు పూయించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు రవిచంద్రన్‌ అశ్విన్‌, విరాట్‌ కోహ్లి తదితరులు పంత్‌ సమయానికి చేరుకుంటాడో లేదోనని ఆందోళన పడుతూనే.. నవ్వులు ఆపుకోలేకపోయారు. 

 

ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా సర్ఫరాజ్‌ 150, పంత్‌ 99 పరుగులు చేసి అవుటయ్యారు. టీ బ్రేక్‌ సమయానికి 90.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసి.. 82 పరుగుల ఆధిక్యంలో ఉంది.

చదవండి: IND vs NZ: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement