వాళ్లిద్దరు అద్భుతం.. ఓటమికి ప్రధాన కారణం అదే: రోహిత్‌ శర్మ | IND Vs NZ 1st Test: Rohit Sharma Lauds Sarfraz And Pant For Showing Maturity, Check Out Scores Details | Sakshi
Sakshi News home page

Rohit Sharma: వాళ్లిద్దరు అద్భుతం.. ఓటమికి ప్రధాన కారణం అదే

Published Sun, Oct 20 2024 2:40 PM | Last Updated on Sun, Oct 20 2024 4:53 PM

Ind vs NZ 1st Test Rohit Sharma Lauds Sarfraz Pant Despite Comprehensive Loss

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఓటమికి బ్యాటింగ్‌ వైఫల్యమే కారణమని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 50 లోపు స్కోరుకే ఆలౌట్‌ కావడం తీవ్ర ప్రభావం చూపిందని.. అయినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో తమ జట్టు అద్భుతంగా పోరాడిందని పేర్కొన్నాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌, రిషభ్‌ పంత్‌ పరిణతితో కూడిన ఇన్నింగ్స్‌ ఆడారని కొనియాడిన రోహిత్‌.. వారిద్దరి వల్లే తాము మెరుగైన స్కోరు సాధించామని తెలిపాడు.

46 పరుగులకే ఆలౌట్‌
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో రోహిత్‌ సేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్‌ అయి సొంతగడ్డపై అత్యల్ప స్కోరు నమోదు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేయగలిగింది.

సర్ఫరాజ్‌, పంత్‌ అద్భుత ఇన్నింగ్స్‌
మిడిలార్డర్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌, రిషభ్‌ పంత్‌ అద్భుతంగా రాణించినందు వల్లే ఈ మేర స్కోరు సాధ్యమైంది. కెరీర్‌లో నాలుగో టెస్టు ఆడిన సర్ఫరాజ్‌ 150 పరుగులతో చెలరేగగా.. మోకాలి నొప్పి ఉన్నా పంత్‌ 99 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, జట్టును గెలిపించేందుకు వీరి పోరాటం సరిపోలేదు.

మోచ్యూర్‌గా ఆడారు
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘తొలి ఇన్నింగ్స్‌లో మరీ ఘోరంగా బ్యాటింగ్‌ చేశాం. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మేము పుంజుకున్నాం. ఆ ఇద్దరు(సర్ఫరాజ్‌, పంత్‌) భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సర్ఫరాజ్‌, పంత్ బ్యాటింగ్‌ చేస్తుంటే డ్రెస్సింగ్‌రూంలో ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

వాళ్లిద్దరు ఎంతో పరిణతి కనబరిచారు. మామూలుగా అయితే, రిషభ్‌ చాలా వరకు రిస్క్‌ తీసుకుంటాడు. కానీ ఈసారి మంచి బంతులు పడ్డప్పుడు డిఫెన్స్‌ చేసుకున్నాడు. కొన్నింటిని వదిలేశాడు. ఆచితూచి ఆడుతూనే అవసరమైనప్పుడు దూకుడు ప్రదర్శించాడు.

ఇక సర్ఫరాజ్‌ గురించి చెప్పాలంటే.. ఎంతో మెచ్యూరిటీతో బ్యాటింగ్‌ చేశాడు. తన కెరీర్‌లో ఇది నాలుగో టెస్టే అయినా.. ఓవైపు ఒత్తిడి ఉన్నా ఎక్కడా తడబడలేదు’’ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ బౌలర్లు అద్భుతంగా రాణించారన్న రోహిత్‌ శర్మ.. తాము మూకుమ్మడిగా విఫలం కావడం బాధించిందన్నాడు.

వరుసగా నాలుగు గెలిచాం
అయితే, గతంలో ఇంగ్లండ్‌ చేతిలో తొలి మ్యాచ్‌ ఓడిన తాము.. తర్వాత వరుసగా నాలుగు టెస్టులు గెలిచిన విషయాన్ని రోహిత్‌ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లోని సానుకూల అంశాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని.. జట్టులో ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటో తెలుసునని పేర్కొన్నాడు.

టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ తొలి టెస్టు(అక్టోబరు 16- 20)
👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
👉వర్షం వల్ల తొలిరోజు(బుధవారం) ఆట రద్దు.. రెండో రోజు పడిన టాస్‌
👉టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా

స్కోర్లు:
👉టీమిండియా తొలి ఇన్నింగ్స్‌- 46
👉న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌- 402

👉టీమిండియా రెండో ఇన్నింగ్స్‌- 462
👉న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌- 110/2
👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ గెలుపు
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రచిన్‌ రవీంద్ర(134, 39 నాటౌట్‌)

చదవండి: IND vs PAK: పాక్ బౌలర్ ఓవరాక్షన్‌.. ఇచ్చిపడేసిన అభిషేక్ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement