అహ్మదాబాద్: మోదీ స్టేడియంలో భారత్ పరుగుల మోత మోగించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (63 బంతుల్లో 126 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) తన బ్యాటింగ్ సునామీని చూపించాడు. దీంతో ఆఖరి టి20లో టీమిండియా 168 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి 2–1తో సిరీస్ గెలుచుకుంది. మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిపించాడు. అనంతరం న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీశాడు.
గిల్ విధ్వంసం
ఇషాన్ కిషన్ (1) రెండో ఓవర్లోనే నిష్క్రమించగా... గిల్, త్రిపాఠి కివీస్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగారు. రెండో వికెట్‌కు ఈ జోడీ మెరుపులతో 7 ఓవర్ల వ్యవధిలోనే భారత్ 80 పరుగులు చేసింది. తర్వాత సూర్యకుమార్ (13 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. కెపె్టన్ హార్దిక్ పాండ్యా క్రీజులోకి రాగా... 15 ఓవర్లలో భారత్ స్కోరు 156/3. శుబ్‌మన్ 44 బంతుల్లో 67 పరుగులతో ఉన్నాడు. గిల్ అప్పటిదాకా ఒక ఆట, 16వ ఓవర్ నుంచి మరో ఆట ఆడాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడిన గిల్... లిస్టర్, టిక్నర్, ఫెర్గూసన్ ఎలా ఎవరెదురైనా... బంతుల్ని అదేపనిగా బౌండరీ దాటించాడు.
పాండ్యా ఆడిన బంతుల్ని మినహాయిస్తే... గిల్ 16 బంతులను వరుసగా 0, 6, 6, 1, 6, 4, 0, 6, 1, 4, 6, 1, 4, 1, 4, 6లుగా ధనాదంచేశాడు. దీంతో 4 ఓవర్లలోనే భారత్ 72 పరుగులు చేసింది. ఇందులో 56 పరుగులు గిల్‌వే! ఈ క్రమంలో 54 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆఖరి ఓవర్లో పాండ్యా (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) అవుట్‌కాగా కేవలం 6 పరుగులే వచ్చాయి. భారత్ పేస్‌కు కివీస్ బ్యాటర్స్ వణికారు. మూడో ఓవర్లోనే కివీస్ 7 పరుగులకే 4 వికెట్లను కోల్పోవడంతో భారత్ విజయానికి బాటపడింది. మిచెల్, సాన్‌ట్నర్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బ్రేస్‌వెల్ 1; గిల్ (నాటౌట్) 126; త్రిపాఠి (సి) ఫెర్గూసన్ (బి) సోధి 44; సూర్యకుమార్ (సి) బ్రేస్‌వెల్ (బి) టిక్నర్ 24; పాండ్యా (సి) బ్రేస్‌వెల్ (బి) మిచెల్ 30; హుడా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 234.
వికెట్ల పతనం: 1–7, 2–87, 3–125, 4–228.
బౌలింగ్: లిస్టర్ 4–0–42–0, బ్రేస్‌వెల్ 1–0–8–1, ఫెర్గూసన్ 4–0–54–0, టిక్నర్ 3–0–50–1, ఇష్ సోధి 3–0–34–1, సాన్‌ట్నర్ 4–0–37–0, మిచెల్ 1–0–6–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (సి) సూర్య (బి) పాండ్యా 3; కాన్వే (సి) పాండ్యా (బి) అర్‡్షదీప్ 1; చాప్‌మన్ (సి) ఇషాన్ (బి) అర్‡్షదీప్ 0; ఫిలిప్స్ (సి) సూర్య (బి) పాండ్యా 2; మిచెల్ (సి) మావి (బి) ఉమ్రాన్ 35; బ్రేస్‌వెల్ (బి) ఉమ్రాన్ 8; సాన్‌ట్నర్ (సి) సూర్య (బి) మావి 13; ఇష్ సోధి (సి) త్రిపాఠి (బి) మావి 0; ఫెర్గూసన్ (సి) ఉమ్రాన్ (బి) పాండ్యా 0; టిక్నర్ (సి) ఇషాన్ (బి) పాండ్యా 1; లిస్టర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (12.1 ఓవర్లలో ఆలౌట్) 66. వికెట్ల
పతనం: 1–4, 2–4, 3–5, 4–7, 5–21, 6–53, 7–53, 8–54, 9–66, 10–66. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 4–0–16–4, అర్ష్‌దీప్ సింగ్ 3–0–16–2, ఉమ్రాన్ మాలిక్ 2.1–0–9–2, కుల్దీప్ యాదవ్ 1–0–12–0, శివమ్ 2–0–12–2.
►అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా శుబ్‌మన్ గిల్ (126 నాటౌట్) గుర్తింపు పొందాడు. కోహ్లి (122 నాటౌట్; అఫ్గానిస్తాన్‌పై 2022 లో) పేరిట ఉన్న రికార్డును గిల్ సవరించాడు.
►అంతర్జాతీయ టి20ల్లో పరుగుల తేడా పరంగా భారత్‌కిదే అతిపెద్ద విజయం. 2018లో ఐర్లాండ్‌పై 143 పరుగుల తేడా తో సాధించిన విజయం రెండో స్థానానికి వెళ్లింది.
►భారత్ తరఫున మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20లు) సెంచరీ సాధించిన ఐదో క్రికెటర్‌గా గిల్ నిలిచాడు. గతంలో రైనా, కేఎల్ రాహుల్, రోహిత్, కోహ్లి ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment