IND VS NZ 3rd T20: ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగనున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో దాదాపు ఒకే జట్టుతో (చహల్ మినహాయించి) బరిలోకి దిగిన భారత్.. మూడో టీ20 కోసం మూడు మార్పులు చేయనుందని సమాచారం. రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లతో పాటు బౌలింగ్ విభాగంలో మరో కీలక మార్పు చేయాలన్నది జట్టు యాజమాన్యం యోచనగా తెలుస్తోంది.
శుభ్‌మన్, ఇషాన్‌ల స్థానాల్లో పృథ్వీ షా, వికెట్‌కీపర్ జితేశ్ శర్మ.. అలాగే చహల్ లేదా కుల్దీప్ స్థానాల్లో ముకేశ్ కుమార్‌కు అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం తొలుత బ్యాటింగ్‌కు, ఆతర్వాత పేసర్లకు సహకరించే అస్కారం ఉండటంతో స్పిన్నర్ స్థానంలో అదనపు పేసర్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం.
ముకేశ్ కుమార్‌కు ఈ సిరీస్‌లో ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో మూడో టీ20లో తప్పక ఆడించాలన్నది కోచ్ ద్రవిడ్ ఆలోచనగా తెలుస్తోంది. అలాగే గిల్, ఇషాన్‌లు వరుసగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోని నేపథ్యంలో పృథ్వీ షా, వికెట్‌కీపర్ జితేశ్ శర్మలకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నది టీమ్ ప్లాన్‌గా తెలుస్తోంది. మరోవైపు, సిరీస్ డిసైడర్ మ్యాచ్ కావడంతో మేనేజ్‌మెంట్ పెద్దగా ప్రయోగాలు చేసేందుకు మొగ్గు చూపకపోవచ్చన్న టాక్ కూడా నడుస్తోంది. ఏదిఏమైనప్పటికీ తుది జట్టులో ఎవరెవరు ఉంటారో తేలాలంటే మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచి (తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, రెండో మ్యాచ్‌లో భారత్ గెలిచాయి) సిరీస్‌లో సమవుజ్జీలుగా ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను రోహిత్ సేన 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. వన్డేల్లో డబుల్ సెంచరీ, ఓ సెంచరీతో హిట్ అయిన శుభ్‌మన్ గిల్.. టీ20 సిరీస్‌లో మాత్రం ఫట్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment