జడేజా సూపర్‌ డెలివరీ.. కివీస్‌ బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్‌ | Ind vs NZ 3rd Test: Jadeja Dismisses Blundell For Duck With Absolute Ripper Video | Sakshi
Sakshi News home page

జడేజా సూపర్‌ డెలివరీ.. కివీస్‌ బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్‌

Published Fri, Nov 1 2024 5:10 PM | Last Updated on Fri, Nov 1 2024 5:58 PM

Ind vs NZ 3rd Test: Jadeja Dismisses Blundell For Duck With Absolute Ripper Video

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రవీంద్ర జడేజా నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో కలిపి ఆరు వికెట్లే తీసిన జడ్డూ.. మూడో టెస్టులో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముంబై మ్యాచ్‌లో కివీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ స్పిన్‌ బౌలర్‌.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు.

క్రీజులో పాతుకుపోయిన న్యూజిలాండ్‌ బ్యాటర్‌ విల్‌ యంగ్‌(71)ను అవుట్‌ చేసి భారత శిబిరంలో జోష్‌ నింపిన జడ్డూ.. టామ్‌ బ్లండెల్‌(0),  గ్లెన్‌ ఫిలిప్స్‌(17)ల వికెట్లు కూడా తానే దక్కించుకున్నాడు. అదే విధంగా టెయిలెండర్లు ఇష్‌ సోధి(7), మ్యాట్‌ హెన్రీ(0)లను అవుట్‌ చేసి ఐదు వికెట్ల హాల్‌ను పూర్తి చేసుకున్నాడు.

అయితే, వీరందరిలోకెల్లా బ్లండెల్‌ను జడేజా అవుట్‌ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. శుక్రవారం నాటి తొలిరోజు ఆటలో భాగంగా కివీస్‌ ఇన్నింగ్స్‌లో 45వ ఓవర్‌ను జడ్డూ వేశాడు. ఆ ఓవర్లో రెండో బంతికి విల్‌ యంగ్‌ను పెవిలియన్‌కు పంపిన ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌.. ఐదో బంతిని అద్భుత రీతిలో సంధించాడు.

ఆ సమయంలో క్రీజులో ఉన్న బ్లండెల్‌ జడేజా సూపర్‌ డెలివరీకి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో జడ్డూ వేసిన బంతిని బ్యాక్‌ఫుట్‌తో డిఫెన్స్‌ చేసేందుకు ప్రయత్నించి బ్లండెల్‌ విఫలమయ్యాడు. రెప్పపాటులో బంతి స్టంప్‌ను ఎగురగొట్టడంతో బిక్కముఖం వేశాడు. 

నిజానికి బ్లండెల్‌ స్థానంలో ఏ బ్యాటర్‌ ఉన్నా ఇలాగే జరిగేది.. జడ్డూ వేసిన బంతి అలాంటిది మరి! ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా కివీస్‌తో బెంగళూరు, పుణెలలో జరిగిన టెస్టుల్లో జడ్డూ మూడేసి వికెట్లు తీశాడు. 

ఇక ఈ రెండు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైన టీమిండియా సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ముంబైలో జరుగుతున్న తాజా టెస్టులో గెలిస్తేనే క్లీన్‌స్వీప్‌ పరాభవం నుంచి తప్పించుకోవడంతో పాటు.. రోహిత్‌ సేనకు డబ్ల్యూటీసీ ఫైనల్‌ లైన్‌ ఈజీగా క్లియర్‌ అవుతుంది.

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు కట్టడి చేసింది. తొలిరోజే న్యూజిలాండ్‌ను ఆలౌట్‌ చేసింది. భారత బౌలర్లలో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు జడేజాకు ఐదు, వాషింగ్టన్‌ సుందర్‌కు నాలుగు వికెట్లు దక్కగా.. పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే, బ్యాటింగ్‌ మొదలుపెట్టిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(18), యశస్వి జైస్వాల్‌(30) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరగా.. నాలుగో స్థానంలో వచ్చిన పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ డకౌట్‌ అయ్యాడు. ఇక విరాట్‌ కోహ్లి(4) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 19 ఓవర్లలో 86 పరుగులు చేసిన టీమిండియా.. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

చదవండి: IND A vs AUS A: సెంచరీకి చేరువైన సాయి సుదర్శన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement