‘‘ప్రస్తుతం.. క్రికెట్ ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఆల్‌రౌండర్ తానేనని అతడికి తెలిసి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా అతడు రాణిస్తున్నాడు. బహుశా తన మైండ్‌సెట్ అలా మారిపోయి ఉంటుంది. గంటకు 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు.. కీలకమైన సమయంలో బ్యాట్‌తో రాణిస్తున్నాడు.. అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడిగా ఎదుగుతున్నాడు’’ - పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్.
హార్దిక్ పాండ్యా బంతితోనూ, బ్యాట్‌తోనూ అద్భుతం చేశాడు- టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్
ఆఖర్లో టీమిండియాపై ఒత్తిడి పెంచాలనుకున్నాం. కానీ హార్దిక్ అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు- పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం
పునరాగమనం తర్వాత అత్యద్భుతంగా రాణిస్తూ.. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఒత్తిడిని జయించి.. జట్టును గెలిపించాడు- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.
Asia Cup 2022 India Vs Pakistan- Hardik Pandya: ఆసియా కప్-2022లో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు దక్కిన ప్రశంసల్లో మచ్చుకు కొన్ని మాత్రమే ఇవి! కీలక పోరులో అదీ దాయాది జట్టుపై విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు హార్దిక్.
ఆల్‌రౌండ్ ప్రదర్శన..
పాకిస్తాన్‌ను కట్టడి చేయడంలో బౌలర్‌గా తన వంతు పాత్ర పోషించాడు. 4 ఓవర్ల పాటు బౌలింగ్ వేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. వికెట్లు పడుతున్నా భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(43 పరుగులు)ను అద్భుత బంతితో పెవిలియన్‌కు పంపించాడు.
అదే విధంగా.. ప్రమాదకరంగా పరిణమిస్తున్నాడునుకుంటున్న సమయంలో ఇఫ్తికర్ అహ్మద్(28)ను అవుట్ చేశాడు. ఖుష్‌దిల్‌ను కూడా కేవలం రెండు పరుగులకు పెవిలియన్‌కు పంపాడు. తద్వారా పాకిస్తాన్‌ను 147 పరుగులకు ఆలౌట్ చేయడంలో తన వంతు సహకారం అందించాడు.
ఇక లక్ష్య ఛేదనలో భారత్ తడబడుతున్న వేళ మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి టీమిండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు హార్దిక్. సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో 15 ఓవర్ ఆరంభంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. తనదైన స్టైల్లో ఫోర్ బాది ఆ ఓవర్‌ను ముగించాడు. ఆ తర్వాత వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా సింగిల్స్ తీశాడు.
బ్యాట్‌తోనే సమాధానం
ఇక జడేజా ఆఖరి ఓవర్ మొదటి బంతికి అవుటైన తర్వాత.. గెలుపు సమీకరణం 4 బంతుల్లో 6 పరుగులుగా ఉన్న వేళ సిక్సర్ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆల్‌రౌండ ప్రతిభతో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. గతేడాది ప్రపంచకప్-2021 సమయంలో వ్యక్తిగతంగా తనను విమర్శించిన వారికి ఈ మ్యాచ్‌తో దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు హార్దిక్ పాండ్యా!
గడ్డు పరిస్థితులు ఎదుర్కొని..
ఐపీఎల్-2021లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్ పాండ్యా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తన స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. ఆ సీజన్‌లో 11 ఇన్నింగ్స్‌లో అతడు సాధించిన మొత్తం పరుగులు 127. సెకండ్ ఫేజ్‌లో అయితే అసలు బౌలింగ్ చేయలేదు.
అయినప్పటికీ టీ20 ప్రపంచకప్-2021 ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న హార్దిక్ పాండ్యా.. మెగా ఈవెంట్‌లోనూ రాణించలేకపోయాడు. ఈ క్రమంలో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
అంతేకాదు తన కెరీర్ ఆరంభం నుంచి అండగా ఉన్న ముంబై ఫ్రాంఛైజీ సైతం ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు హార్దిక్‌ను వదిలేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి ఫిట్‌నెస్ సాధించడం కోసం జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు ఈ ‘ఆల్‌రౌండర్’.
రాత మార్చిన ఐపీఎల్-2022..
కెరీర్ చిక్కుల్లో పడిన వేళ కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ రూపంలో అదృష్టం హార్దిక్ తలుపుతట్టింది. తన ప్రతిభను నిరూపించుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. ఐపీఎల్-2022 నేపథ్యంలో హార్దిక్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది గుజరాత్ ఫ్రాంఛైజీ.
జాతీయ జట్టుకు దూరమై క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్న హార్దిక్ తిరిగి బౌలింగ్ చేస్తాడా లేదా అన్న అనుమానాల నడుమ ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు ఫిట్‌నెస్ టెస్టు ఎదుర్కొన్నాడు పాండ్యా. అందులో సఫలీకృతం కావడంతో అభిమానులతో పాటు గుజరాత్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.
పడిలేచిన కెరటంలా..
అప్పటి వరకు కెప్టెన్‌గా ఏమాత్రం అనుభవం లేని హార్దిక్ పాండ్యా.. అవలీలగా టైటాన్స్‌ను ముందుకు నడిపించాడు. సీజన్ ఆరంభానికి ముందు చెప్పినట్లుగానే ధోని స్టైల్లో కెప్టెన్సీ చేసి జట్టును విజేతగా నిలిపాడు. సారథిగా.. బ్యాటర్‌గా(15 ఇన్నింగ్స్‌లో 487 పరుగులు- అత్యధిక స్కోరు 87 నాటౌట్)... బౌలర్‌గా(10 ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు).. మూడు పాత్రలకు పరిపూర్ణ న్యాయం చేసి అరంగేట్ర సీజన్‌లోనే గుజరాత్‌ను టైటిల్ విజేతగా నిలిపాడు.
అదే వేదికపై..
ఆ తర్వాత హార్దిక్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. టీమిండియాలో పునరాగమనం.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు సారథిగా ఎంపికవడం.. క్లీన్‌స్వీప్ చేయడం.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరించి విజయం సాధించడం.. ఇప్పుడు ఇలా గతేడాది ఏ వేదికపై అయితే తనకు, తన జట్టుకు అవమానం జరిగిందో అదే వేదికపై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటం..
ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టుకు కాబోయే కెప్టెన్ అంటూ నీరాజనాలు అందుకోవడం.. ఇలా పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసి తానేంటో నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్యా.
ఇంకో 15 పరుగులు చేయాల్సి ఉన్నా..
మునుపటి కంటే రెట్టించిన ఉత్సాహంతో.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం హార్దిక్ మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. ‘‘పరిస్థితులకు తగ్గట్టుగా ప్రత్యర్థి బలాబలాలు అంచనా వేసి మన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలు సంధించాలి. బౌలింగ్‌లో షార్ట్ బంతులు నా బలం. బ్యాటర్లను తప్పుదోవ పట్టించి.. బంతిని అంచనా వేయలేని స్థితికి తీసుకురావాలి.
ఇక ఛేజింగ్ విషయానికొస్తే.. ఓ యువ బౌలర్.. ఓ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆడతారని తెలుసు. ఆఖరి ఓవర్లో మా విజయానికి 7 పరుగులు కావాలి. ఒకవేళ 15 పరుగులు చేయాల్సి ఉన్నా నేను ఇలాగే ఆడేవాడిని. నిజానికి 20వ ఓవర్లో నాకంటే కూడా ఆ బౌలర్ మీదనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని తెలుసు’’ అని హార్దిక్ పేర్కొన్నాడు.
ఆల్ ది బెస్ట్ హీరో..
గడ్డు పరిస్థితులను దాటుకుని కెరీర్‌ను తిరిగి ఉజ్వలంగా మలచుకుంటున్న హార్దిక్ పాండ్యా.. భవిష్యత్తులోనూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుదాం. పేసర్లు ప్రతాపం చూపినా.. విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఈ మ్యాచ్ హీరో ఎవరంటే మాత్రం మొగ్గు పాండ్యావైపే చూపాల్సి వస్తుంది మరి! కీలకమైన సమయంలో 17 బంతుల్లోనే 33 పరుగులు చేసి అజేయంగా నిలిచి సిక్సర్‌తో విజయం అందించిన హార్దిక్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే! ఏమంటారు?
చదవండి: Asia Cup Ind Vs Pak: ‘కేవలం లక్ వల్లే ఇండియా గెలిచింది’! అసలేం మాట్లాడుతున్నావు?
Comments
Please login to add a commentAdd a comment