PC: Disney+Hotstar
Rassie van der Dussen Dismissal: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు రసే వాన్ డెర్ డసెన్ అవుటైన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. బంతి బౌన్స్ అయిన తర్వాత కీపర్ చేతుల్లో పడిందని, అతడిని తిరిగి మైదానంలోకి పిలిపిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వాండరర్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో 45వ ఓవర్‌లో లార్డ్ శార్దూల్ సంధించిన రెండో బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు డసెన్. కానీ చివరి నిమిషంలో ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అయితే, అప్పటికే బంతిని బ్యాట్ తాకడం ఆ తర్వాత వికెట్ కీపర్ రిషభ్ పంత్ దానిని అందుకోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో అంపైర్ డసెన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో లంచ్ సమయానికి ముందు ప్రొటిస్ నాలుగో వికెట్ కోల్పోయింది.
అయితే, లంచ్ విరామ సమయంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్.. డసెన్ అవుటైన తీరుపై తమ జట్టు మేనేజర్ ఖొమొత్సొ మసుబెలెలెతో కలిసి అంపైర్లతో చర్చించినట్లు. సమాచారం. రీప్లేలో భాగంగా ఫ్రంట్ కెమెరాను గమనించగా పంత్ చేతుల్లో పడటానికి ముందు బంతి నేలను తాకినట్లు కనిపించింది. సైడ్ యాంగిల్‌లో మాత్రం క్యాచ్ పట్టినట్లు కనబడింది. దీంతో తాము అనవసరంగా బలైపోయామని ఎల్గర్ వాపోయినట్లు సమాచారం.
ఈ విషయం గురించి కామెంటేటర్ మార్క్ నికోలస్ మాట్లాడుతూ... ‘‘ఒక యాంగిల్‌లో ఒకలా.. మరో యాంగిల్‌లో ఇంకోలా కనిపిస్తుంది. కాబట్టి అవుట్ కాలేదు అనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఒకవేళ ఇందుకు కచ్చితమైన ఆధారాలు ఉంటే... ఫీల్డింగ్ కెప్టెన్‌కు సదరు బ్యాటర్‌ను వెనక్కి పిలిపించమని సూచించేవారు’’ అని పేర్కొన్నాడు. ఇక ఇందుకు స్పందించిన టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్.. ఇలాంటి అస్పష్టమైన దృశ్యాల ఆధారంగా తుది నిర్ణయానికి రాలేమని, బంతి నేలను తాకిందా లేదా అనేది పంత్‌కు తెలిసి ఉంటుందని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment