‘‘ప్రతిరోజూ ఉదయమే నిద్రలేచి ప్రాక్టీసుకు వెళ్తావు. దేశం కోసం ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ నీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే తపనతో ఉంటావు. నిన్నటి మ్యాచ్‌లోనూ ఈ విషయాన్ని గమనించాను. క్లిష్ట పరిస్థితుల్లోనూ కఠిన శ్రమకు ఓర్చి.. అంకితభావంతో.. ఆట పట్ల నిబద్ధతతోనువ్వు ముందుకు సాగే విధానమే నిన్ను చాంపియన్‌గా నిలుపుతుంది. ఆటలో గెలుపోటములు సహజం.
అయితే, గెలిపించేందుకు నువ్వు చేసిన కృషి మాత్రం ఎల్లప్పుడూ దేశాన్ని గర్వపడేలా చేస్తుంది. నీ దేశం కోసం... జట్టు కోసం ఎంతటి కఠిన యుద్ధానికైనా సిద్ధమని చెప్పావు. పట్టుదలగా నిలబడ్డావు. నిన్ను చూసి గర్వపడుతున్నాను. జై హింద్’’ అంటూ టీమిండియా ఆటగాడు దీపక్ చహర్ కాబోయే భార్య జయా భరద్వాజ్ భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశారు. ఆట పట్ల దీపక్‌కు ఉన్న నిబద్ధతతను అక్షరాల రూపంలో పేర్చి అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు.
కాగా దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో దీపక్ చహర్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు 34 బంతుల్లో 54 పరుగులు సాధించి... టీమిండియా ఆఖరి వరకు పోరాటం సాగించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ 4 పరుగుల తేడాతో రాహుల్ సేన ఓటమి పాలు కావడంతో దీపక్ చహర్ అద్భుత ఇన్నింగ్స్ వృథాగా పోయింది. దీంతో అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడితో పాటే దక్షిణాఫ్రికాలో ఉన్న జయ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో కాబోయే భర్తను ప్రశంసిస్తూ ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నోట్ షేర్ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment