దీపక్ చహర్- శ్రేయస్ అయ్యర్ (PC: BCCI)
India’s updated ODI squad Vs SA 2023: సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ ట్రోఫీని ఆతిథ్య జట్టుతో పంచుకున్న టీమిండియా తదుపరి వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. జొహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం(డిసెంబరు 17) నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.
స్టార్ పేసర్ దీపక్ చహర్ ఈ సిరీస్‌కు దూరం కానున్నట్లు శనివారం వెల్లడించింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు సౌతాఫ్రికాకు వెళ్లడం లేదని తెలిపింది. అతడి స్థానాన్ని ఆకాశ్ దీప్‌తో భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది.
శ్రేయస్ అయ్యర్ దూరం
అదే విధంగా శ్రేయస్ అయ్యర్ సైతం ఆఖరి రెండు వన్డేలకు అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఈ మిడిలార్డర్ బ్యాటర్ రెండు, మూడో మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలిపింది.
కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ఈ వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ టీమిండియాను ముందుండి నడిపించనున్నాడు. మరోవైపు.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. సఫారీ గడ్డపై టీమిండియా ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌పై ప్రత్యేక దృష్టిసారించింది. అందుకే పలువురు స్టార్ బ్యాటర్లు, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు. ఆ సమయాన్ని టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు కేటాయించనున్నారు.
చహర్ స్థానంలో వస్తున్నాడు.. ఇంతకీ ఎవరీ ఆకాశ్ దీప్?
దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న 27 ఏళ్ల ఆల్‌రౌండర్ ఆకాశ్ దీప్. బెంగాల్ తరఫున 2019 నుంచి ఇప్పటి వరకు మూడు ఫార్మాట్ల(లిస్ట్-ఏ, ఫస్ట్‌క్లాస్, టీ20)లలో 80 మ్యాచ్‌లు ఆడాడు.
ఆయా ఫార్మాట్లలో కలిపి మొత్తంగా నూట డెబ్బైకి పైగా వికెట్లు తీయడంతో పాటు 500 పరుగులు సాధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న ఆకాశ్ దీప్.. ఏడు మ్యాచ్‌లలో కలిపి ఆరు వికెట్లు తీశాడు.
భారత వన్డే జట్టు:
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్.
చదవండి: రోహిత్‌కు బైబై.. ఇక టీమిండియా టీ20 కెప్టెన్‌గానూ హార్దిక్ పాండ్యా!?
Comments
Please login to add a commentAdd a comment