చాలా కాలంగా టీమిండియాను వేధిస్తున్న ఆల్‌రౌండర్ల కొరత శార్ధూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌ల రాకతో తీరినట్లేనని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరూ ఇరు(టెస్ట్, వన్డే) ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తూ జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే దిశగా సాగుతున్నారని పేర్కొన్నాడు. హార్ధిక్ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన వీరు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణిస్తున్నారని, ఇది టీమిండియాకు శుభసూచకమని తెలిపాడు. దక్షిణాఫ్రికాతో తొలి రెండు వన్డేల్లో శార్ధూల్(43 బంతుల్లో 50 నాటౌట్, 38 బంతుల్లో 40 నాటౌట్), ఆఖరి వన్డేలో చాహర్(34 బంతుల్లో 54) బ్యాట్‌తో రాణించిన తీరు సంతృప్తికరంగా ఉందని, మున్ముందు కూడా వీరు ఇలాగే రాణిస్తే హార్ధిక్ స్థానం గల్లంతయ్యే ప్రమాదముందని పరోక్షంగా హెచ్చరించాడు.
వీరిద్దరూ తమకు లభించిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ, లోయర్ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్లుగా మారుతున్నారని కితాబునిచ్చాడు. గతంలో భారత-ఏ జట్టు శ్రీలంక పర్యటనలో దీపక్ చాహర్ బ్యాట్‌తో చెలరేగిన విషయాన్ని ప్రస్తావించాడు. బౌలర్లుగా తమ కోటా ఓవర్లు పూర్తి చేస్తూ, లోయర్ ఆర్డర్‌లో వీలైనన్ని పరుగులు చేసే ఆటగాడిని ఏ జట్టైనా కోరుకుంటుందని, ఇలాంటి ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారని శార్ధూల్, చాహర్‌లకు పరోక్షంగా మద్దతు తెలిపాడు. ఆల్‌రౌండర్లు జట్టు జయాపజయాలు నిర్ధేశిస్తారనడంలో సందేహం లేదని, శార్ధూల్, చాహర్ లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు జట్టుకు మరింత సమతూకాన్ని తెస్తారని అభిప్రాయపడ్డాడు.
మున్ముందు ఈ ఇద్దరికి తగినన్ని అవకాశాలు కల్పించి, జట్టులో బ్యాటింగ్ డెప్త్ పెంచే దిశగా సాగుతామని పేర్కొన్నాడు. కాగా, వెన్నెముక గాయం కారణంగా హార్ధిక్ పాండ్యా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మధ్యలో అతను జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియాకు ఆల్‌రౌండర్ కోటాలో ఆటగాడు కరువయ్యాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండర్ కోటాలో జట్టులోకి వచ్చినప్పటికీ.. జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అతన్ని సరిగ్గా వాడుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
చదవండి: నిన్ను చూసి గర్వపడుతున్నా: చహర్ కాబోయే భార్య భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment