టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్‌గా అవతరించిన టీమిండియా ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ దుమ్ములేపింది. రోహిత్ శర్మ స్థానంలో పూర్తి స్థాయిలో భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు.
తొలుత శ్రీలంక పర్యటనలో సూర్య సేన టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. తర్వాత సొంతగడ్డపై పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో బంగ్లాదేశ్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది.
అదొక్కటి సానుకూలాంశం
అయితే, సౌతాఫ్రికా గడ్డపై రాణించడం టీమిండియాకు అంత తేలికేమీ కాదు. కానీ.. ప్రపంచకప్-2024 ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి తర్వాత ప్రొటిస్ జట్టు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం మనకు సానుకూలాంశం.
మెగా టోర్నీ తర్వాత వెస్టిండీస్ చేతిలో 0–3తో వైట్‌వాష్‌కు గురైన సౌతాఫ్రికా.. తర్వాత పసికూన ఐర్లాండ్‌తో సిరీస్‌ను 1–1తో ‘డ్రా’గా ముగించింది.
ఈ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో సూర్య సేన వస్తుంటే.. గత పరాభవాల నుంచి కోలుకుని స్వదేశంలో సత్తా చాటాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ రీఎంట్రీతో తమ రాత మారుతుందని ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో సఫారీలతో టీమిండియా సమరం ఈసారి మరింత రసవత్తరంగా మారనుంది.
ఒక్కో మ్యాచ్‌తో రూ. 73 కోట్లు!
నిజానికి.. భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా పర్యటన కోసం వెళ్లాల్సి ఉంది. తొలుత టీమిండియా షెడ్యూల్‌లో ఈ సిరీస్ లేనే లేదు. కానీ ఆదాయం కోసమే హడావిడిగా దీనిని ఏర్పాటు చేశారు. దక్షిణాఫ్రికా బోర్డును ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు టీ20 స్పెషలిస్ట్‌లతో భారత టీమ్‌ను ఎంపిక చేశారు.
టీమిండియాతో టీ20 సిరీస్‌లో ఒక్కో మ్యాచ్ ద్వారా దక్షిణాఫ్రికాకు 150 మిలియన్ ర్యాండ్‌ల (సుమారు రూ.73 కోట్లు) ఆదాయం రానుందని అంచనా. ఐపీఎల్ తరహాలో దక్షిణాఫ్రికా బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎస్‌ఏ20(SAT20) టోర్నీ ద్వారా వచ్చిన మొత్తం లాభం 54 మిలియన్ ర్యాండ్‌లతో (రూ. 26 కోట్లు) పోలిస్తే దీని విలువ ఏమిటో అర్థమవుతుంది!
ఇక ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు తమ సత్తాను నిరూపించుకునేందుకు కూడా సౌతాఫ్రికా ఆటగాళ్లకు ఈ సిరీస్ గొప్ప వేదిక కానుంది.
సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ 2024
👉మొదటి టీ20- నవంబరు 8(శుక్రవారం)- డర్బన్- రాత్రి గం.8:30లకు
👉రెండో టీ20- నవంబరు 10(ఆదివారం)- గ్వెబెర్హ- రాత్రి 7.30 నిమిషాలకు
👉మూడో టీ20- నవంబరు 13(బుధవారం)- సెంచూరియన్- రాత్రి గం.8:30లకు
👉నాలుగో టీ20- నవంబరు 15(శుక్రవారం)- జొహన్నస్‌బర్గ్- రాత్రి గం.8:30లకు
జట్లు
సౌతాఫ్రికా
రీజా హెండ్రిక్స్, రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోయెట్జీ, నకబయోమ్జీ పీటర్, ఒట్‌నీల్ బార్ట్మన్, డోనోవన్ ఫెరీరా, మిహ్లాలీ ఎంపోంగ్వానా, ప్యాట్రిక్ క్రుగర్.
భారత్
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, విజయ్ కుమార్ వైశాక్, అవేష్ ఖాన్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, యశ్ దయాళ్, రవి బిష్ణోయ్, రమణ్‌దీప్ సింగ్, జితేశ్ శర్మ.
ముఖాముఖి రికార్డులు
ఇప్పటి వరకు టీమిండియా- సౌతాఫ్రికా 27 టీ20 మ్యాచ్‌లలో తలపడగా.. భారత్ 15 మ్యాచ్‌లలో గెలుపొందగా.. సౌతాఫ్రికా పదకొండింట విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల ఫలితం తేలకుండా ముగిసిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment