![IND VS SL 1st ODI: Mohammed Siraj Has Good Track Record Vs Sri Lanka, Particularly In Colombo](/styles/webp/s3/article_images/2024/08/2/aca.jpg.webp?itok=2kEMXIq9)
కొలొంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య ఇవాళ (ఆగస్ట్ 2) తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి స్టార్ ఆడనున్నప్పటికీ.. భారత క్రికెట్ అభిమానుల కళ్లు మాత్రం హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌పైనే ఉన్నాయి. ఎందుకంటే సిరాజ్‌కు శ్రీలంకపై ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడి పిచ్‌లపై సిరాజ్ చెలరేగిపోతాడు.
ముఖ్యంగా కొలంబోలో సిరాజ్‌కు పట్టపగ్గాలు ఉండవు. ఇక్కడ చివరిగా ఆడిన మ్యాచ్‌లో (ఆసియా కప్ 2023 ఫైనల్లో) మియా నిప్పులు చెరిగాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలి, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సిరాజ్ శ్రీలంకతో ఇప్పటిదాకా ఆడిన 6 వన్డేల్లో 7.7 సగటున, 3.5 ఎకానమీతో 19 వికెట్లు పడగొట్టాడు. ఇవాళ జరిగే మ్యాచ్‌లోనూ భారత అభిమానులు సిరాజ్ నుంచి మెరుపు ప్రదర్శనను ఆశిస్తున్నారు. సిరాజ్ కొలొంబోలో మరోసారి చెలరేగితే శ్రీలంకకు కష్టాలు తప్పవు.
ఇదిలా ఉంటే, లంకతో ఇవాల్టి మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. టీమిండియా.. తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి మాంచి జోష్‌లో ఉండగా.. లంకేయులు.. భారత్‌కు ఎలాగైనా ఓటమి రుచి చూపించాలని పట్టుదలగా ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రాకతో టీమిండియా మరింత పటిష్టంగా మారగా.. శ్రీలంకను గాయాల బెడద వేధిస్తుంది. ఆ జట్టు స్టార్ పేసర్లు పతిరణ, మధుషంక గాయాల కారణంగా సిరీస్ మొత్తానికే దూరమయ్యారు.
తొలి వన్డేకు భారత తుది జట్టు (అంచనా)..
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా
Comments
Please login to add a commentAdd a comment