అతి సాధారణ జట్టైన విండీస్ చేతిలో టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో (టీ20లు) ఓటమిపాలైన నేపథ్యంలో కొందరు ఆటగాళ్లపై, ముఖ్యంగా వరల్డ్ క్లాస్ ప్లేయర్లుగా చెప్పుకునే నలుగురు బ్యాటర్లపై (ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్, సంజూ శాంసన్) భారత అభిమానులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. కనీసం వరల్డ్‌కప్‌కు కూడా క్వాలిఫై కాలేని జట్టు చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్.. రెండు మ్యాచ్‌ల్లో ఓటమికి కారణమైన ఆ నలుగురితో పాటు చెత్త వ్యూహాలు రచించిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సోషల్‌మీడియా వేదికగా వీరిని ఏకీ పారేస్తున్నారు.
ఇచ్చిన అవకాశాలు చాలు.. వెంటనే వాళ్లను జట్టు నుంచి తీసిపారేయండని ధ్వజమెత్తుతున్నారు. ఆ నలుగురు, హార్ధిక్ పాండ్యా కలిసి పటిష్టమైన భారత జట్టును సిరీస్ కోల్పోయే ప్రమాద స్థితికి తీసుకువచ్చారని తూర్పారబెడుతున్నారు. రోహిత్, కోహ్లి, పంత్, రాహుల్, శ్రేయస్ వస్తే కాని, టీమిండియా బ్యాటింగ్ మళ్లీ గాడిలో పడదని, ఇలాగే ప్రయోగాల పేరు చెప్పి ఉన సమయాన్ని వృధా చేసుకుంటే, త్వరలో జరుగనున్న ఆసియా కప్‌లో ఆ తర్వాత జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో భంగపాటు తప్పదని హెచ్చరిస్తున్నారు.
శాంసన్, సూర్యకుమార్‌లకు మరో అవకాశం ఇచ్చినా పర్వాలేదు కాని, టీ20ల్లో వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌లను మాత్రం వెంటనే తప్పించమని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విండీస్‌లో ఉన్న భారత శిబిరంలో వీరికి ప్రత్యామ్నాయం లేకపోతే, కనీసం బౌలర్లకైనా అవకాశాలు ఇవ్వండని సూచిస్తున్నారు. టీమిండియా సిరీస్ కోల్పోయినా పర్వాలేదు కాని, మూడో వన్డే నుంచి వాళ్లను పక్కకు కూర్చోపెట్టండని అంటున్నారు.
అంతర్జాతీయ టీ20ల్లో ఇషాన్, గిల్‌ల ట్రాక్ రికార్డు చూపించి మరీ వారిని ట్రోల్ చేస్తున్నారు. సొంత అభిమానులే ఇషాన్, గిల్‌లపై ఇంతలా రియాక్ట్ అవ్వడానికి కారణాలు లేకపోలేదు. ఐపీఎల్‌లో ఆడినట్లు దేశం తరఫున ఆడకపోవడం, ఏదో జాలీ ట్రిప్‌కు వెళ్లినట్లు ఫోటోలకు పోజులిస్తూ బీచ్‌ల్లో షికార్లు కొట్టడం, నిర్లక్ష్యంగా షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకోవడం, అన్నిటి కంటే ఎక్కువగా భారత్ సిరీస్ కోల్పోతుందేమోనన్న బాధ అభిమానులను ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యేలా చేసింది. కాగా, విండీస్‌తో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ప్రస్తుతం 0-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment