Wasim Jaffer rates Shubman Gill's performances: వెస్టిండీస్‌తో సిరీస్‌లో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఘనంగా తన ఆగమనాన్ని చాటగా.. టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ సైతం తన మార్కు చూపించాడు. డొమినికాలో తొలి టెస్టులో యశస్వి 171 పరుగులతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
యశస్వి అలా.. ఇషాన్ ఇలా
ఇక ట్రినిడాడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ తుపాన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 34 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు.
గిల్ మాత్రం విఫలం
వీరిద్దరు ఇలా తమకు వచ్చిన మొదటి అవకాశాలను ఇలా సద్వినియోగం చేసుకుంటే.. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా రెగ్యులర్ ఓపెనర్ అయిన శుబ్‌మన్ గిల్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఏరికోరి మూడో స్థానంలో వచ్చిన అతడు రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు.
మొదటి మ్యాచ్‌లో 6 పరుగులకే పెవిలియన్ చేరిన గిల్.. రెండో మ్యాచ్‌లో వరుసగా 10, 29(నాటౌట్) పరుగులు సాధించాడు. దీంతో అనవసరంగా మూడో స్థానంలో వచ్చి పిచ్చి ప్రయోగంతో మూల్యం చెల్లించుకున్నాడంటూ శుబ్‌మన్ గిల్‌పై విమర్శలు వస్తున్నాయి.
1-5.. ఎక్కడైనా ఆడగలడు
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. గిల్‌కు అండగా నిలిచాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో 1-5 వరకు ఏ స్థానంలో అయినా ఆడగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు. ‘‘గిల్ మంచి బ్యాటర్. తనలాంటి ప్లేయర్ ఓపెనర్‌గా రాణించగలడు. ఐదో స్థానం వరకు ఎక్కడైనా సరే బ్యాటింగ్ చేయగలడు.
అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో అతడు మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టే విండీస్‌లో తను వన్‌డౌన్‌లో రావడం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. ఒక్కోసారి 150 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసి వెంటనే బ్యాటింగ్ చేయాలంటే ఓపెనర్లకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
పదికి నాలుగు మార్కులు
కానీ నంబర్ 3లో ఆడే వారికి కాస్త కుదురుకునే సమయం దొరుకుతుంది’’ అని వసీం జాఫర్ జియో సినిమా షోలో తన అభిప్రాయం పంచుకున్నాడు. కానీ, గిల్‌కు విండీస్ టూర్‌లో మాత్రం పదికి నాలుగు మార్కులు మాత్రమే వేస్తానని చెప్పడం విశేషం. అయితే, ఇది ఆరంభమే కాబట్టి గిల్ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న జాఫర్.. అతడికి కాస్త సమయం ఇవ్వాలని పేర్కొన్నాడు.
చదవండి: క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
శివాలెత్తిన సికందర్ రజా.. ఫాస్టెప్ట్ హాఫ్ సెంచరీ.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో..!
Comments
Please login to add a commentAdd a comment