యువర్ అటెన్షన్ ప్లీజ్! అహ్మదాబాద్ వెళ్లవలసిన రోడ్డు, రైలు, ఆకాశ మార్గాలన్నీ కిక్కిరిసి ఉన్నాయి. ఇందులో ఏది ఎక్కినా చుక్కలు చూడటం ఖాయం. తినాలనుకుంటే రేట్లు చూసిన వెంటనే కడుపు నిండిపోయే ‘మెనూ’లున్నాయి. బస చేయాలంటే సాధారణ హోటళ్లలోనే వేల రూపాయలు, స్టార్ హోటళ్లలో రూ. లక్షలు... ఫైనల్ ఆట కంటే ముందే ‘హాట్ హాట్’ టాపిక్‌లయ్యాయి.
అహ్మదాబాద్: తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. కానీ యావత్ దేశం మాత్రం భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ టైటిల్ పోరాటాన్ని చూసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమైపోతోంది. ప్రయాణ టికెట్లు వేలకు వేలైనా ... తినుబండారాలు ఖరీదైనా... హోటల్ గదులు ఎన్ని వేల రూపాయలైనా సరే భారత అభిమానులు మాత్రం ‘తగ్గేదేలే’ అంటున్నారు.
లక్ష పైచిలుకు మంది ప్రత్యక్షంగా చూసే నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్ కోసం ఖర్చులు బారెడైనా... కళ్లు కాయలు కట్టుకొని మరీ చూసేందుకు ఎదురు చూస్తున్నారు.ఆ్రస్టేలియా రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురైనా... 2003 ఫైనల్ బూచీ వెంబడిస్తున్నా... టీమిండియా అజేయ జైత్రయాత్రపైనే అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు.
మూడు రోజుల క్రితం న్యూజిలాండ్ జట్టుపై గత ప్రపంచ కప్ సెమీఫైనల్ ప్రతీకారాన్ని తీర్చుకున్న భారత్... 20 ఏళ్ల క్రితం ఆ్రస్టేలియా చేతిలో ఎదురైన ఫైనల్ ఓటమి ప్రతీకారాన్ని కూడా తీర్చుకుంటుందని సగటు అభిమానులంతా ఆశిస్తున్నారు.
విమానం ఎక్కితే...
అహ్మదాబాద్ వెళ్లే విమానం ఎక్కితే దేశంలో ఎక్కడి నుంచైనా దాదాపు రూ. 5 వేల నుంచి 9 వేల లోపే ఉంటుంది. నెలముందు బుక్ చేసుకుంటే సగం రూ. 3 వేల లోపే అందుబాటులో ఉంటాయి. కొన్ని సంస్థ ప్రొమో కోడ్‌లతో 500 వందలైనా తగ్గేవి.
కానీ అలా చూసుకుంటే రూ. 2500 టిక్కెట్ ధర ఇప్పుడు ఏకంగా రూ. 25 నుంచి 35 వేల మధ్యకు పెరిగింది. ఇది నిన్నటి (శుక్రవారం) ధరలు. శనివారం బుక్ చేసుకుంటే మాత్రం అర లక్షయినా ఆశ్చర్యం కలుగక మానదు. పలు విమానయాన సంస్థలు ఆ రూట్లో ప్రత్యేకంగా ఫ్లైట్లు అందుబాటు లో పెడుతున్నా అవేవీ ప్రయాణికుల రద్దీని తట్టుకో లేకపోతున్నాయని టికెట్ ఏజెంట్స్ చెబుతున్నారు.
విన్యాసాలకు రిహార్సల్స్
భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఫైనల్‌కు ముందు పది నిమిషాల పాటు ఎయిర్ షోతో కనువిందు చేయనుంది. ఇందుకోసం శుక్రవారం ఈ టీమ్ స్టేడియంపై వైమానిక విన్యాసాలను రిహార్సల్స్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment