‘శ్రేయస్‌ను నిందించొద్దు.. అదే అసలు సమస్య’ | India Assistant-Coach-Ryan-Doeschate-Says-Stop Blaming-Shreyas | Sakshi
Sakshi News home page

‘శ్రేయస్‌ను నిందించొద్దు.. అదే అసలు సమస్య’

Jul 10 2026 1:07 PM | Updated on Jul 10 2026 1:22 PM

India Assistant-Coach-Ryan-Doeschate-Says-Stop Blaming-Shreyas

ఐర్లాండ్ గ‌డ్డ‌పై సిరీస్ ఓటమితో ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న టీమిండియా ఇంగ్లండ్ గ‌డ్డ‌పై అదే దారుణ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తోంది. తొలి టీ20 వ‌ర్షార్ప‌ణం కాగా, ఆ త‌ర్వాత జరిగిన మూడు టీ20ల్లోనూ ప‌రాజ‌యం చ‌విచూసిన టీమిండియా 0-3తో ఇంగ్లండ్‌కు సిరీస్‌ను కోల్పోయింది. క‌నీసం చివ‌రి టీ20లోనైనా విజ‌యం సాధించి గౌర‌వ‌ప్ర‌దంగా సిరీస్‌ను ముగించాల‌ని టీమిండియా భావిస్తోంది. 

ఇక కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ఏదీ క‌లిసిరావ‌డం లేదు. బ్యాట‌ర్‌గా రాణిస్తున్న‌ప్ప‌టికీ కెప్టెన్‌గా వ‌రుస ఓట‌ములు అత‌డిని ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. అత‌డి కెప్టెన్సీలో టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట ఓట‌మి (ఒక మ్యాచ్ ర‌ద్దు) పాల‌య్యింది. దీంతో శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్‌గా టీ20ల్లో ఇప్ప‌టిదాకా గెలుపు రుచి చూడలేదు. 

అటు టీమిండియా కూడా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన త‌ర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెల‌వ‌క‌పోవడం గ‌మ‌నార్హం. దీంతో అయ్య‌ర్ కెప్టెన్సీపై అప్పుడే నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ఈసారి అయ్య‌ర్‌తో పాటు కోచ్ గంభీర్‌పై కూడా క‌త్తి వేలాడుతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అదీగాక జింబాబ్వే టూర్‌తో పాటు ఆసియా గేమ్స్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అత‌డి స్థానంలో మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌ను టీమిండియా వెంట పంపించాల‌ని బీసీసీఐ చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

ఈ నేప‌థ్యంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ రెయాన్ టెన్‌డెస్క‌టే శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్సీ భ‌వితవ్యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. బ్రిస్ట‌ల్ వేదిక‌గా నాలుగో టీ20లో టీమిండియా ఓట‌మి పాలైన త‌ర్వాత ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో టెన్ డ‌స్క‌టే మాట్లాడాడు. 'టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇప్పుడే బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. అత‌డి కెప్టెన్సీలో టీమిండియాకు వెంట‌నే విజ‌యాలు రావాలంటే ఎలా? కాస్త ఓపిక ప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంటుంది. మ్యాచ్ ఓట‌ముల‌కు శ్రేయ‌స్‌ను నిందించ‌డం ఆపండి. 

అత‌డు కెప్టెన్‌గా నిలుదొక్కుకోవ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. ఇప్పుడు వ‌చ్చే ఓటములే త‌ర్వాత గెలుపుకు బాట‌లు వేస్తాయి. నిజానికి శ్రేయ‌స్ త‌న నాయ‌కత్వాన్ని బాధ్య‌త‌గా నిర్వ‌హిస్తున్నాడు. బ్యాటింగ్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాడు. కేవ‌లం కొన్ని మ్యాచ్‌ల‌కే అత‌డు కెప్టెన్‌గా వైఫ‌ల్యం చెందాడ‌ని పేర్కొన‌డం స‌రికాదు. అంత‌క‌ముందు సూర్య‌కుమార్ కూడా ఆరంభంలో ఇలాంటి ప‌రిస్థితుల‌నే ఎదుర్కొన్నాడు.  

కానీ ఆ త‌ర్వాత సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఎలాంటి విజ‌యాలు సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇంత‌కాలం ఒక కెప్టెన్సీలో ఆడి ఇప్పుడు మ‌రో కొత్త కెప్టెన్‌తో ఆడుతుండ‌డంతో జ‌ట్టులో స‌మ‌తుల్యం లోపించింది. రాబోయే రోజుల్లో అది చ‌క్క‌బడి మ‌ళ్లీ అంతా స‌వ్యంగా సాగుతుంది. ఇక జ‌ట్టులో పాండ్యా, బుమ్రా లోటు కూడా స్ప‌ష్టంగా తెలుస్తోంది. 

ఇక బ్యాట‌ర్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ బాగా రాణిస్తున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 190 ప‌రుగులు సాధించ‌డ‌మే గాక కోహ్లీ రికార్డును కూడా స‌మం చేశాడు. టీమిండియా మ్యాచ్‌లు ఓడుతున్న‌ప్ప‌టికీ అయ్య‌ర్ మాత్రం బ్యాట‌ర్‌గా విఫ‌లం కాలేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లండ్‌, టీమిండియా మ‌ధ్య చివ‌రి టీ20 మ్యాచ్ సౌతాంప్టన్ వేదిక‌గా ఆడ‌నున్నాయి.

 

Read: అరుదైన ఫీట్‌తో ఫిఫా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన ఎంబాపె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement