తొలి టి20లో భారత్‌ అలవోక విజయం | India beat Bangladesh by 7 wickets in the first T20I | Sakshi
Sakshi News home page

తొలి టి20లో భారత్‌ అలవోక విజయం

Published Mon, Oct 7 2024 3:57 AM | Last Updated on Mon, Oct 7 2024 7:05 AM

India beat Bangladesh by 7 wickets in the first T20I

7 వికెట్లతో బంగ్లాదేశ్‌ చిత్తు

రాణించిన అర్ష్ దీప్  , వరుణ్‌

బుధవారం న్యూఢిల్లీలో రెండో టి20   

భారత యువ జట్టు సత్తా ముందు బంగ్లాదేశ్‌ తేలిపోయింది. ముందుగా అర్ష్ దీప్  ‌ పేస్‌ను, వరుణ్‌ స్పిన్‌ను ఎదుర్కోలేక బంగ్లాదేశ్‌ బ్యాటర్లు చేతులెత్తేయగా ... ఆపై స్వల్ప లక్ష్యాన్ని భారత బృందం సునాయాసంగా ఛేదించింది. పాండ్యా, సూర్య, సంజూ సామ్సన్‌ సులువుగా పరుగులు రాబట్టడంతో మరో 49 బంతులు మిగిలి ఉండగా ఘనవిజయం భారత్‌ సొంతమైంది.   

గ్వాలియర్‌: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఘన విజయం సాధించిన భారత్‌ అంతే జోరుగా టి20 సిరీస్‌ను కూడా మొదలు పెట్టింది. టెస్టులతో పోలిస్తే టి20ల్లో టీమిండియా బృందం మొత్తం మారినా... ఫలితంలో మాత్రం తేడా రాలేదు. ఆదివారం జరిగిన తొలి టి20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. 

ముందుగా బంగ్లాదేశ్‌ 19.5 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. మిరాజ్‌ (32 బంతుల్లో 35 నాటౌట్‌; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా, నజు్మల్‌ హుస్సేన్‌ (25 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అర్ష్ దీప్  , వరుణ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం టీమిండియా లక్ష్య ఛేదనకు 71 బంతులే సరిపోయాయి. 

భారత్‌ 11.5 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసి గెలిచింది. హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 39 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్‌ (14 బంతుల్లో 29; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజు సామ్సన్‌ (19 బంతుల్లో 29; 6 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. భారత్‌కు 1–0తో ఆధిక్యం లభించగా, రెండో మ్యాచ్‌ బుధవారం న్యూఢిల్లీలో జరుగుతుంది.  

పేలవ బ్యాటింగ్‌... 
అర్ష్ దీప్  ‌ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికే లిటన్‌ దాస్‌ (4) వెనుదిరగ్గా, అతని తర్వాతి ఓవర్లో పర్వేజ్‌ (8) అవుటయ్యాడు. వరుణ్‌ తొలి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 15 పరుగులు రాబట్టిన బంగ్లా 5 ఓవర్లు ముగిసేసరికి 39 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో జట్టుకు ఒక్క పరుగూ రాలేదు. ఈ ఓవర్‌తో అంతర్జాతీయ కెరీర్‌ మొదలు పెట్టిన మయాంక్‌ చక్కటి బంతులతో తౌహీద్‌ (12)ను కట్టడి చేసి తన మొదటి ఓవర్‌ను ‘మెయిడిన్‌’గా ముగించడం విశేషం. 

గతంలో అగార్కర్, అర్ష్ దీప్  ‌ మాత్రమే తమ అరంగేట్ర మ్యాచ్‌ను మెయిడిన్‌ ఓవర్‌తో మొదలు పెట్టారు. తర్వాతి ఓవర్లో తౌహీద్‌ను వరుణ్‌ అవుట్‌ చేయగా... మహ్ముదుల్లా (1)ను వెనక్కి పంపి మయాంక్‌ తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

కెప్టెన్ నజ్ముల్‌ తడబడుతూనే ఆడగా... జాకీర్‌ (8) కూడా విఫలం కావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి బంగ్లా 64/5 వద్ద నిలిచింది. తర్వాతి 59 బంతుల్లో జట్టు మరో 63 పరుగులు రాబట్టింది. ఇందులో మిరాజ్‌ ఒక్కడే 29 బంతులు ఆడి 29 పరుగులు సాధించగా... మిగిలిన వారు ప్రభావం చూపలేదు.    

ధనాధన్‌... 
షరీఫుల్‌ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లతో సామ్సన్‌ ఛేదన మొదలు పెట్టగా... తస్కీన్‌ వేసిన తర్వాతి ఓవర్లో అభిõÙక్‌ శర్మ (16) ఒక సిక్స్, 2 ఫోర్లతో జోరు చూపించాడు. అయితే దురదృష్టవశాత్తూ అదే ఓవర్లో అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి అభిõÙక్‌ రనౌటయ్యాడు. 

అనంతరం వచ్చీ రాగానే ధనాధన్‌ బ్యాటింగ్‌ చూపించిన సూర్య ఆరు బంతుల వ్యవధిలో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. ఆ తర్వాత ఇలాగే ధాటిగా ఆడబోయి సూర్య, సామ్సన్‌ తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అయితే 73 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. 

నితీశ్‌ కుమార్‌ రెడ్డి (15 బంతుల్లో 16 నాటౌట్‌; 1 సిక్స్‌) అండగా నిలవగా... పాండ్యా ఒక్కడే 39 పరుగులు బాదడం విశేషం. తస్కీన్‌ వేసిన 12వ ఓవర్లో వరుసగా మూడు బంతులను 4, 4, 6గా మలచి పాండ్యా మ్యాచ్‌ ముగించాడు. 

స్కోరు వివరాలు  
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: పర్వేజ్‌ (బి) అర్ష్ దీప్  ‌ 8; లిటన్‌ దాస్‌ (సి) రింకూ (బి) అర్ష్ దీప్  ‌ 4; నజు్మల్‌ (సి అండ్‌ బి) సుందర్‌ 27; తౌహీద్‌ (సి) పాండ్యా (బి) వరుణ్‌ 12; మహ్ముదుల్లా (సి) సుందర్‌ (బి) మయాంక్‌ 1; జాకీర్‌ (బి) వరుణ్‌ 8; మిరాజ్‌ (నాటౌట్‌) 35; రిషాద్‌ (సి) పాండ్యా (బి) వరుణ్‌ 11; తస్కీన్‌ (రనౌట్‌) 12; షరీఫుల్‌ (బి) పాండ్యా 0; ముస్తఫిజుర్‌ (బి) అర్ష్ దీప్  ‌ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 127. వికెట్ల పతనం: 1–5, 2–14, 3–40, 4–43, 5–57, 6–75, 7–93, 8–116, 9–117, 10–127.  బౌలింగ్‌: అర్ష్ దీప్  ‌ సింగ్‌ 3.5–0–14–3, హార్దిక్‌ పాండ్యా 4–0–26–1, వరుణ్‌ చక్రవర్తి 4–0–31–3, మయాంక్‌ యాదవ్‌ 4–1–21–1, నితీశ్‌ రెడ్డి 2–0–17–0, వాషింగ్టన్‌ సుందర్‌ 2–0–12–1. 

భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) రిషాద్‌ (బి) మిరాజ్‌ 29; అభిõÙక్‌ శర్మ (రనౌట్‌) 16; సూర్యకుమార్‌ (సి) జాకీర్‌ (బి) ముస్తఫిజుర్‌ 29; నితీశ్‌ రెడ్డి (నాటౌట్‌) 16; పాండ్యా (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (11.5 ఓవర్లలో 3 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–25, 2–65, 3–80.  బౌలింగ్‌: షరీఫుల్‌ 2–0–17–0, తస్కీన్‌ 2.5–0–44–0, ముస్తఫిజుర్‌ 3–0–36–1, రిషాద్‌ 3–0–26–0, మిరాజ్‌ 1–0–7–1.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement