తిలక్‌ తుఫాన్‌.. మూడో టీ20లో భారత్‌ గెలుపు | India beat South Africa by 11 runs in 3rd t20 | Sakshi
Sakshi News home page

తిలక్‌ తుఫాన్‌.. మూడో టీ20లో భారత్‌ గెలుపు

Published Thu, Nov 14 2024 1:36 AM | Last Updated on Thu, Nov 14 2024 6:55 AM

India beat South Africa by 11 runs in 3rd t20

56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 107 నాటౌట్‌

మూడో టీ20లో భారత్‌ గెలుపు

మెరిపించిన అభిషేక్‌ శర్మ

11 పరుగులతో ఓడిన దక్షిణాఫ్రికా

వణికించిన జాన్సెన్, క్లాసెన్‌

గతేడాది విండీస్‌ గడ్డపై టి20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హైదరాబాదీ స్టార్‌ తిలక్‌ వర్మ ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు (18 టి20లు, 4 వన్డేలు) ఆడాడు. అడపాదడపా రాణించినా... తాజాగా తన 19వ టి20 మ్యాచ్‌లో చేసిన తుఫాన్‌ సెంచరీ కెరీర్‌లో కలకాలం గుర్తుండిపోతుంది. ఇన్నింగ్స్‌ మూడో బంతికి క్రీజులోకి వచ్చిన తిలక్‌ ఆఖరి బంతిదాకా అజేయంగా నిలిచాడు. 

సఫారీ గడ్డపై తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీని సాఫల్యం చేసుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో టీమిండియాను ఓడిపోకుండా నిలబెట్టాడు. వన్డే కెరీర్‌ను కూడా విదేశీ గడ్డపై (శ్రీలంక) మొదలుపెట్టిన ఈ టాపార్డర్‌ బ్యాటర్‌ ఇప్పుడు తొలి శతకాన్ని విదేశంలోనే నమోదు చేయడం విశేషం.  

సెంచూరియన్‌: హైదరాబాదీ సంచలనం ఠాకూర్‌ తిలక్‌ వర్మ అజేయ సెంచరీతో భారత్‌కు విజయ తిలకం దిద్దడంతో పర్యాటక జట్టు ఇక ఈ సిరీస్‌ గెలిచే స్థితిలో తప్ప ఓడే అవకాశం లేదు. మూడో టి20లో 11 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో పైచేయి సాధించింది. 

భారత్‌ 2–1తో ఆధిక్యంలో ఉండగా, శుక్రవారం (15న) జొహన్నెస్‌బర్గ్‌లో ఆఖరి నాలుగో టి20 మ్యాచ్‌ జరుగనుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీస్కోరు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (56 బంతుల్లో 107 నాటౌట్‌; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతక్కొట్టగా, ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (25 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచేశాడు. 

సిమ్‌లేన్, కేశవ్‌ మహరాజ్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం కష్టమైన లక్ష్యఛేదనకు దిగిన సఫారీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి ఓడింది. మార్కొ జాన్సెన్‌ (17 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), క్లాసెన్‌ (22 బంతుల్లో 41; 1 ఫోర్, 4 సిక్స్‌లు) విరుచుకుపడ్డారు.    

51 బంతుల్లోనే సెంచరీ 
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సంజూ సామ్సన్‌ (0) డకౌటయ్యాడు. మూడో బంతికి క్రీజులోకి వచ్చిన తిలక్‌... ఓపెనర్‌ అభిషేక్‌తో ధనాధన్‌ ఆటకు శ్రీకారం చుట్టాడు. ఇద్దరి జోరుతో  8.1 ఓవర్లో జట్టు స్కోరు 100కు చేరింది. అదే ఓవర్లో అభిషేక్‌ 24 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకొని అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 

కెప్టెన్ సూర్యకుమార్‌ (1), హార్దిక్‌ పాండ్యా (18; 3 ఫోర్లు) మెరిపించలేదు. 32 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాక తిలక్‌ విశ్వరూపం చూపించాడు. కేశవ్‌ వేసిన 15వ ఓవర్లో వరుసగా 4, 6, 4 కొట్టిన తిలక్‌... కొయెట్జీ 16వ ఓవర్లో 2 సిక్స్‌లు, ఒక బౌండరీ బాదడంతో ఈ రెండు ఓవర్ల వ్యవధిలోనే 55 స్కోరు నుంచి అనూహ్యంగా 87కు చేరాడు. 

19వ ఓవర్లో ఫోర్‌ కొట్టి 51 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. రమణ్‌దీప్‌ (6 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్‌) ధాటిగా ఆడటంతో భారత్‌ 200 పైచిలుకు స్కోరు చేసింది. 

క్లాసెన్, జాన్సెన్‌ మెరుపులు 
దూకుడుగా మొదలైన దక్షిణాఫ్రికా లక్ష్యఛేదనకు మూడో ఓవర్‌ నుంచే ముకుతాడు పడింది. రికెల్టన్‌ (20), హెండ్రిక్స్‌ (21), స్టబ్స్‌ (12), కెపె్టన్‌ మార్క్‌రమ్‌ (18 బంతుల్లో 29; 2 సిక్స్‌లు) ధాటిగా ఆడే క్రమంలో వికెట్లను పారేసుకున్నారు. దీంతో సగం ఓవర్లు ముగిసేసరికి టాప్‌–4 బ్యాటర్లను కోల్పోయిన సఫారీ 84 పరుగులు చేసింది. 

మిగతా సగం ఓవర్లలో 136 పరుగుల సమీకరణం ఆతిథ్య జట్టుకు కష్టమైంది. అయితే హిట్టర్‌ క్లాసెన్‌ భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. వరుణ్‌ వేసిన 14వ ఓవర్లో క్లాసెన్‌ 6, 6, 6, 0, 4, 1లతో 23 పరుగుల్ని పిండుకున్నాడు. అతని జోరుకు అర్ష్ దీప్ కళ్లెం వేయగా, తర్వాత జాన్సెన్‌ ధనాధన్‌ షోతో భారత శిబిరాన్ని వణికించాడు. 

చివరి 2 ఓవర్లలో దక్షిణాఫ్రికా విజయానికి 51 పరుగులు కావాలి. హార్దిక్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో జాన్సెన్‌ 26 పరుగులు సాధించాడు. విజయం కోసం దక్షిణాఫ్రికా 6బంతుల్లో 25 పరుగులు చేయాల్సి ఉండగా, ఆఖరి ఓవర్లో అర్ష్ దీప్ అతన్ని అవుట్‌ చేయడంతో భారత్‌ విజయం సాధించింది. 

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (బి) జాన్సెన్‌ 0; అభిషేక్‌ (స్టంప్డ్‌) క్లాసెన్‌ (బి) కేశవ్‌ 50; తిలక్‌ వర్మ (నాటౌట్‌) 107; సూర్యకుమార్‌ (సి) జాన్సెన్‌ (బి) సిమ్‌లేన్‌ 1; హార్దిక్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కేశవ్‌ 18; రింకూ సింగ్‌ (బి) సిమ్‌లేన్‌ 8; రమణ్‌దీప్‌ (రనౌట్‌) 15; అక్షర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–0, 2–107, 3–110, 4–132, 5–190, 6–218. బౌలింగ్‌: జాన్సెన్‌ 4–0–28–1, కొయెట్జీ 3–0–51–0, సిపామ్లా 4–0–45–0, సిమ్‌లేన్‌ 3–0–34–2, మార్క్‌రమ్‌ 2–0–19–0, కేశవ్‌ 4–0–36–2.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (బి) అర్ష్ దీప్ 20; హెండ్రిక్స్‌ (స్టంప్డ్‌) (బి) వరుణ్‌ 21; మార్క్‌రమ్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) వరుణ్‌ 29; స్టబ్స్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్‌ 12; క్లాసెన్‌ (సి) తిలక్‌ (బి) అర్ష్ దీప్ 41; మిల్లర్‌ (సి) అక్షర్‌ (బి) హార్దిక్‌ 18; జాన్సెన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 54; కొయెట్జీ (నాటౌట్‌) 2; సిమ్‌లేన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–27, 2–47, 3–68, 4–84, 5–142, 6–167, 7–202. బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–37–3, హార్దిక్‌ 4–0–50–1, అక్షర్‌ 4–0–29–1, వరుణ్‌ 4–0–54–2, రవి బిష్ణోయ్‌ 4–0–33–0.

8 ఈ ఏడాది భారత జట్టు టి20ల్లో 8 సార్లు 200 పైచిలుకు పరుగులు సాధించింది. గత ఏడాది భారత జట్టు ఏడుసార్లు ఈ మైలురాయిని దాటింది.

12 అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ సాధించిన 12వ భారతీయ క్రికెటర్‌గా తిలక్‌ వర్మ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో రోహిత్‌ శర్మ (5), సూర్యకుమార్‌ యాదవ్‌ (4), కేఎల్‌ రాహుల్‌ (2), సంజూ సామ్సన్‌ (2), సురేశ్‌ రైనా (1), దీపక్‌ హుడా (1), విరాట్‌ కోహ్లి (1), శుబ్‌మన్‌ గిల్‌ (1), యశస్వి జైస్వాల్‌ (1), రుతురాజ్‌ గైక్వాడ్‌ (1), అభిషేక్‌ శర్మ (1) ఉన్నారు. అంతర్జాతీయ టి20ల్లో ఓవరాల్‌గా భారత క్రికెటర్లు 21 సెంచరీలు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement