రోహిత్ శర్మ- అజిత్ అగార్కర్ (ఫైల్ ఫొటో)
చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్టును ప్రకటించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్ధమైంది. ఈ ఐసీసీ టోర్నీకి శనివారం టీమిండియాను ప్రకటించనుంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి మీడియా ముఖంగా జట్టు వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.
కాగా వన్డే ఫార్మాట్‌లో నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) చివరగా 2017లో జరిగింది. నాడు ఫైనల్లో టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈసారి ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.
దుబాయ్‌లో
ఇక మెగా ఈవెంట్‌కు వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై కాగా.. ఆతిథ్య జట్టు హోదాలో పాక్ నేరుగా అర్హత సాధించింది.
అయితే, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు నిరాకరించిన బీసీసీఐ(BCCI).. హైబ్రిడ్ విధానాన్ని ప్రతిపాదించింది. ఇందుకు అంగీకరించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ను కూడా ఒప్పించింది. ఈ క్రమంలో టీమిండియా దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.
ఇక ఈ మెగా టోర్నీకి ప్రొవిజనల్ జట్లను ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 13ను డెడ్‌లైన్‌గా విధించగా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ ఇప్పటికే తమ టీమ్‌ల వివరాలు వెల్లడించాయి. అయితే, పాకిస్తాన్, భారత్, ఇంగ్లండ్ మాత్రం గడువు పొడిగించాల్సిందిగా కోరినట్లు సమాచారం.
అదే రోజు ఇంగ్లండ్‌తో వన్డేలకు జట్టు ప్రకటన
ఈ నేపథ్యంలో శనివారం(జనవరి 18)న తమ జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇక అదే రోజు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు కూడా టీమ్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా ఘోర పరాభవం చవిచూసింది.
ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తో ఓడి దశాబ్ద కాలం తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఇక తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు కాగా.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి.
ఇక ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగిసిన తర్వాత టీమిండియా చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుండగా.. దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. క్రికెట్ ప్రపంచానికి ఎంతో ఇష్టమైన దాయాదుల పోరు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరుగనుంది.
చాంపియన్స్ ట్రోఫీ-2025 భారత జట్టు (అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా(ఫిట్‌నెస్ సాధిస్తే), మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment