చైనాలోని హాంగ్‌ఝౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023 పురుషుల ఫుట్‌బాల్ ఈవెంట్‌లో భారత్ బోణీ కొట్టింది. రౌండ్ ఆఫ్ 16కు (నాకౌట్) చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌పై 1-0 గోల్స్ తేడాతో గెలుపొందింది.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ 85వ నిమిషంలో పెనాల్టీ షూటౌట్‌లో గోల్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య చైనా చేతిలో 1-5 గోల్స్ తేడాతో ఓడి, నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శక్తివంచన లేకుండా పోరాడి బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో చైనా, మయన్మార్‌లతో సమానంగా 3 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 24న మయన్మార్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే భారత్ నేరుగా రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధిస్తుంది.
రౌండ్ ఆఫ్ 16కు ఎలా..?
ఏషియన్ గేమ్స్ పురుషుల ఫుట్‌బాల్‌లో భారత్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్‌లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఈ పోటీల్లో గ్రూప్‌కు నాలుగు జట్ల చొప్పున మొత్తం 6 గ్రూప్‌లు ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2లో ఉన్న జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచే మరో నాలుగు అత్యుత్తమ జట్లు రౌండ్ ఆఫ్ 16కు చేరతాయి.
భారత్ అవకాశాలు ఎలా..?
గ్రూప్-ఏలో చైనా, మయన్మార్ జట్లు ఇప్పటివరకు ఆడిన ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించి, తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో చైనా చేతిలో ఓడి, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచిన భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్ గ్రూప్-ఏలో ఆఖరి స్థానంలో నిలిచి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ తదుపరి మయన్మార్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే, గ్రూప్‌లో రెండో స్థానానికి ఎగబాకి నేరుగా రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment