WC 2023: సూపర్‌ సెవెన్‌తో సెమీస్‌కి భారత్‌ | India entered into semis with seven wins | Sakshi
Sakshi News home page

WC 2023: సూపర్‌ సెవెన్‌తో సెమీస్‌కి భారత్‌

Published Fri, Nov 3 2023 1:22 AM | Last Updated on Fri, Nov 3 2023 8:27 AM

India entered into semis with seven wins - Sakshi

మన టాప్‌ స్టార్లు పరుగు పెడితే... పేసర్లు పడగొడితే... ఏ ప్రత్యర్థి అయినా ఏం చేస్తుంది... చిత్తుగా ఓడటం తప్ప! మాజీ విశ్వవిజేత శ్రీలంకది కూడా అదే పరిస్థితి. మొదట... శుబ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ల ధాటికి సింహళ  బౌలింగ్‌ కళ తప్పింది. తర్వాత కొండంత లక్ష్యం ఛేదించబోతే మన పేస్‌ దళం నిప్పులు చెరిగింది. అంతే నాలుగో ఓవర్‌ అయినా ముగియకముందే శ్రీలంక 3/4 స్కోరుతో పరాభవానికి వికెట్ల గేట్లెత్తి కేవలం 55  పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడిపోయింది.   

ముంబై: ఈ వన్డే వరల్డ్‌కప్‌లో 10 జట్లు తలపడుతున్నాయి. నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లాంటి చిన్న జట్లు... న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలాంటి మేటి టీమ్‌లు... ఐదుసార్లు జగజ్జేత ఆ్రస్టేలియా, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ బరిలో ఉన్నా... ఒకే ఒక్క జట్టు, నంబర్‌వన్‌ భారత్‌ అప్రతిహత జైత్రయాత్ర ముందు ఏ ఒక్కటీ నిలువలేకపోతున్నాయి. తాజాగా భారత్‌ బల ప్రదర్శనకు 1996 ప్రపంచ చాంపియన్‌ శ్రీలంక కుదేలైంది.

టీమిండియా ఆల్‌రౌండ్‌ ఆటతీరుకు  లంక అతలాకుతలమైంది. బ్యాటింగ్‌ ధాటికి తట్టుకోలేక, బౌలింగ్‌ దాడిని ఎదుర్కోలేక శ్రీలంక 302 పరుగుల భారీ తేడాతో భారత్‌ చేతిలో ఓడింది. వరుసగా ఏడో విజయంతో రోహిత్‌ శర్మ బృందం 14 పాయింట్లతో ఈ మెగా ఈవెంట్‌లో సెమీఫైనల్‌ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 5న కోల్‌కతాలో దక్షిణాఫ్రికా జట్టుతో ఆడుతుంది.  

అంతకుముందు శ్రీలంక కెప్టెన్ కుశాల్‌ 
మెండిస్‌ టాస్‌ నెగ్గి ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ బృందం 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీస్కోరు చేసింది. గిల్‌ (92 బంతుల్లో 92; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), కోహ్లి (94 బంతుల్లో 88; 11 ఫోర్లు), అయ్యర్‌ (56 బంతుల్లో 82; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగారు. మదుషంకకు 5 వికెట్లు దక్కాయి. తర్వాత శ్రీలంక కనీసం టి20 ఫార్మాట్‌కు తగ్గ ఓవర్లయినా ఆడలేకపోయింది.

19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలి ప్రపంచకప్‌ చరిత్రలో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. పదో స్థానంలో దిగిన కసున్‌ రజిత (14) టాప్‌స్కోరర్‌ అంటే భారత బౌలింగ్‌ ప్రత్యర్థి బ్యాటర్లను ఎంతగా బయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా ఇన్నింగ్స్‌ తొలి బంతికే శ్రీలంక పతనానికి నాంది పలికితే... మరుసటి ఓవర్లలో సిరాజ్‌ (3/16) చావుదెబ్బ తీశాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షమీ (5/18) బంతినందుకున్నాక శ్రీలంక ఆలౌట్‌ కావడానికి ఎంతోసేపు పట్టలేదు.  

శతకం లేకపోయినా చితగ్గొట్టారు... 
మ్యాచ్‌ మొదలవకముందు టాస్‌ నెగ్గిన ఆనందం, భారత ఇన్నింగ్స్‌ ఆరంభించగానే కెప్టెన్ రోహిత్‌ శర్మ (2 బంతుల్లో 4; 1 ఫోర్‌) అవుటైన సంబరం ఈ పోరులో లంకకు లభించిన అల్ప సంతోషాలు. తదనంతరం ఓపెనర్‌ గిల్‌ దూకుడు టాపార్డర్‌ బ్యాటర్‌ కోహ్లి క్లాసిక్‌ ఇన్నింగ్స్‌ వాంఖెడేలో క్రికెట్‌ ప్రియుల్ని ఆనంద పరవశం చేశాయి. ఇద్దరే 29.4 ఓవర్లు బ్యాటింగ్‌ చేశారు. లంక బౌలర్ల పని పట్టి స్కోరు బోర్డును పరుగు పెట్టించారు. దీంతో 16వ ఓవర్లోనే భారత్‌ 100కు చేరింది.

ముందుగా కోహ్లి (50 బంతుల్లో), కాసేపటికే గిల్‌ (55 బంతుల్లో) అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు. ఆ తర్వాత కూడా బ్యాటింగ్‌ ధాటి కొనసాగడం, లంక బౌలింగ్‌ తేలిపోవడంతో సెంచరీల దిశగా సాగారు. కానీ సఫలం కాలేకపోయారు. రెండో వికెట్‌కు 189 పరుగులు జోడించాక గిల్, కోహ్లి మూడు  పరుగుల వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీల చేసిన ప్లేయర్‌గా సచిన్‌ టెండూల్కర్‌ (49) పేరిట ఉన్న రికార్డును కోహ్లి సమం చేయలేకపోయాడు.  

అయ్యర్‌ సూపర్‌ 
నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ వాళ్లిద్దరి ఇన్నింగ్స్‌లను తలపించేలా బ్యాటింగ్‌ చేశాడు. అది కూడా దూకుడు జతచేసి! భారీ సిక్సర్లతో అయ్యర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. వేగంగా 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. రాహుల్‌ (21; 2 ఫోర్లు), సూర్యకుమార్‌ (12) చేసింది తక్కువే అయినా అయ్యర్‌ మెరుపులతో 45వ ఓవర్లోనే భారత్‌ 300 మార్కు దాటింది. శ్రేయస్‌ చితగ్గొట్టాడు... కానీ గిల్, కోహ్లిలలాగే శతకం మాత్రం కొట్టలేకపోయాడు. జడేజా (24 బంతుల్లో 35; 1 ఫోర్, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. 

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) మదుషంక 4; గిల్‌ (సి) మెండిస్‌ (బి) మదుషంక 92; కోహ్లి (సి) నిసాంక (బి) మదుషంక 88; అయ్యర్‌ (సి) తీక్షణ (బి) మదుషంక 82; రాహుల్‌ (సి) హేమంత (బి) చమీర 21; సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) మెండిస్‌ (బి) మదుషంక 12; జడేజా (రనౌట్‌) 35; షమీ (రనౌట్‌) 2; బుమ్రా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 357. వికెట్ల పతనం: 1–4, 2–193, 3–196, 4–256, 5–276, 6–333, 7–355, 8–357. 
బౌలింగ్‌: మదుషంక 10–0–80–5, చమీర 10–2–71–1, కసున్‌ రజిత 9–0–65–0, ఎంజెలో మాథ్యూస్‌  3–0–11–0, తీక్షణ 10–0– 67–0, హేమంత 8–0–52–0. 

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసాంక (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0; కరుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్‌ 0; కుశాల్‌ మెండిస్‌ (బి) సిరాజ్‌ 1; సమరవిక్రమ (సి) అయ్యర్‌ (బి) సిరాజ్‌ 0; అసలంక (సి) జడేజా (బి) షమీ 1; మాథ్యూస్‌ (బి) షమీ 0; హేమంత (సి) రాహుల్‌ (బి) షమీ 0; చమీర (సి) రాహుల్‌ (బి) షమీ 0; తీక్షణ (నాటౌట్‌) 12; రజిత (సి) గిల్‌ (బి) షమీ 14; మదుషంక (సి) అయ్యర్‌ (బి) జడేజా 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 55. వికెట్ల పతనం: 1–0, 2–2, 3–2, 4–3, 5–14, 6–14, 7–22, 8–29, 9–49, 10–55. బౌలింగ్‌: బుమ్రా 5–1–8–1, సిరాజ్‌ 7–2–16–3, షమీ 5–1–18–5, కుల్దీప్‌ యాదవ్‌ 2–0–3–0, జడేజా 0.4–0–4–1. 

ప్రపంచకప్‌లో నేడు
అఫ్గానిస్తాన్‌ X నెదర్లాండ్స్‌
వేదిక: లక్నో

మధ్యాహ్నం 2 గంటల  నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ యాప్‌లో  ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement