భారీ సిక్సర్ బాదిన అయ్యర్ (PC: ICC Video Grab)
ICC WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభం నుంచి స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయాడు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో డకౌట్ అయిన ఈ ముంబై ఆటగాడు.. అఫ్గనిస్తాన్‌పై 25(నాటౌట్) పరుగులు చేయగలిగాడు.
ఆ తర్వాత పాకిస్తాన్‌తో అజేయ అర్ధ శతకం(53)తో ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మరోసారి విఫలమై(19) పాత కథ పునరావృతం చేశాడు. అనంతరం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 33 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 4 పరుగులకే పెవిలియన్ చేరి మళ్లీ నిరాశ పరిచాడు.
తప్పించాలంటూ డిమాండ్లు
దీంతో నిలకడలేని ఫామ్‌తో సతమవుతున్న అయ్యర్‌పై వేటు వెయ్యాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో.. సొంతమైదానం వాంఖడేలో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.
ఒక్క ఇన్నింగ్స్‌తో దిమ్మతిరిగేలా సమాధానం
పూర్తి ఆత్మవిశ్వాసం కనబరుస్తూ 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. సెంచరీ దిశగా పయనిస్తున్నాననే జాగ్రత్త పడకుండా నిస్వార్థ ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. శుబ్‌మన్ గిల్ (92), విరాట్ కోహ్లి (88)లు అవుటైన తర్వాత వేగవంతమైన ఆట తీరుతో టీమిండియా 357 పరుగుల భారీ లక్ష్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
భారీ సిక్సర్‌తో రికార్డు
ఈ క్రమంలో విమర్శించిన వారే అయ్యర్‌ను ప్రశంసిస్తూ అద్భుత ఇన్నింగ్స్ అంటూ కొనియాడుతుండటం విశేషం. ఇదిలా ఉంటే.. లంకతో మ్యాచ్ సందర్భంగా ఈ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అతి భారీ సిక్సర్‌ను నమోదు చేశాడు. కసున్ రజిత బౌలింగ్‌లో 106 మీటర్ల సిక్స్‌ను బాది చరిత్ర సృష్టించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక.. ఓవైపు అయ్యర్ షాట్ ఆడిన తీరుపై ప్రశంసలు కురుస్తుండగా.. మరోవైపు కొంతమంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
చహల్- ధనశ్రీలపైకి బంతి
విషయమేమిటంటే.. వన్డే వరల్డ్‌కప్-2023లో చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్.. తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి గురువారం వాంఖడే మైదానానికి వచ్చాడు. అయితే, అయ్యర్ బాదిన భారీ సిక్సర్ ఈ దంపతులు కూర్చున్న స్టాండ్స్‌లో ల్యాండ్ అవడం విశేషం.
శ్రుతిమించిన ట్రోల్స్
దీంతో.. ‘‘పాపం చహల్‌పై అంత కోపమెందుకు అయ్యర్.. ఏదేమైనా ధనశ్రీ రావడంతో అయ్యర్‌కు లక్ కలిసివచ్చినట్లుంది’’ అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కాగా ధనశ్రీతో కలిసి అయ్యర్ డ్యాన్స్ చేసిన వీడియోలు, వీరిద్దరు కలిసి పార్టీలకు హాజరైన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ధనశ్రీ తన ఇన్‌స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును తీసేసినపుడు.. అయ్యర్ పేరుతో ఆమె పేరును జతచేసి దారుణంగా ట్రోల్ చేశారు. అంతటితో ఆగక చహల్‌తో ధనశ్రీ విడిపోబోతుందంటూ వదంతులు వ్యాప్తి చేయగా.. చహల్ స్వయంగా వీటిని ఖండించాడు.
చదవండి: డేగ కళ్లు’! ఒకటి నిజమని తేలింది.. ఇంకోటి వేస్ట్.. ఇకపై వాళ్లే బాధ్యులు: రోహిత్ శర్మ
ఇదిగో మళ్లీ ఇప్పుడిలా ఈ సిక్సర్ కారణంగా వాళ్లిద్దరిని ట్రోల్ చేస్తూ మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. అయితే, అయ్యర్ ఫ్యాన్స్ మాత్రం వీటిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతిభను గుర్తించకుండా అనవసరపు విషయాల్లోకి లాగి అయ్యర్ ఆటను తక్కువ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment