దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీ తొలి రెండు మ్యాచ్‌లలో భారత్ జోరు చూస్తే పాకిస్తాన్‌పై మళ్లీ గెలవడం ఖాయమనిపించింది. అయితే ఆదివారం పాక్ చేతిలో ఎదురైన పరాజయం ‘సూపర్–4’ దశను ఆసక్తికరంగా మార్చింది. ఫైనల్ చేరాలంటే మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు గెలవాల్సి ఉండగా, తొలి మ్యాచ్‌లో ఓటమి టీమిండియాపై ఒత్తి డి పెంచింది.
మిగిలిన రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిలో నేడు శ్రీలంకతో భారత్ తలపడనుంది. అనుభవం, రికార్డులపరంగా ప్రత్యర్థిపై అన్ని రకాలుగా భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... గత రెండు మ్యాచ్‌లలో లంక అనూహ్య విజయాలు చూస్తే అంత సులువు కాదని అనిపిస్తోంది.
అశ్విన్‌కు చాన్స్ ఉందా!
టి20 ప్రపంచకప్‌కు ఈ వారంలోనే భారత జట్టును ప్రకటించనున్నారు. ఇలాంటి స్థితిలో ఆసియా కప్‌లో సాధ్యమైనంత ఎక్కువ మందికి అవకాశం ఇస్తూ అన్ని రకాల ప్రత్యామ్నాయాలను భారత్ పరీక్షిస్తోంది. అయితే పాకిస్తాన్ చేతిలో ఓడటంతో మరోసారి తుది జట్టు విషయంలో సందిగ్ధత నెలకొంది. ఓపెనర్లుగా రోహిత్, రాహుల్ గత మ్యాచ్‌లో శుభారంభం అందించడం సానుకూలాంశం. టోర్నీలో రెండో అర్ధ సెంచరీతో కోహ్లి ఫామ్‌లోకి రాగా, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్‌గా
హార్దిక్ పాండ్యా మరోసారి చెలరేగాల్సి ఉంది. పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ రెండు విభాగాల్లోనూ నిరాశపర్చాడు. కీపర్ రిçషభ్ పంత్, దినేశ్ కార్తీక్ మధ్య టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకా తేల్చుకోలేకపోతోంది. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో ఇద్దరూ ఆడగా, గత పోరులో కార్తీక్ స్థానంలో బ్యాటర్‌గా దీపక్ హుడా జట్టులోకి వచ్చాడు. హుడాకు మరో అవకాశం ఇస్తారా లేక కార్తీక్‌ను మళ్లీ ఆడిస్తారా చూడాలి.
జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లాంటివాళ్లు లేకపోవడంతో బౌలింగ్‌లో తడబాటు కనిపిస్తోంది. ఎంతో నమ్ముకున్న భువనేశ్వర్ పాక్‌తో మ్యాచ్‌లో 19వ ఓవర్లో భారీగా పరుగులు ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు దానిని అతను సరిదిద్దుకోవాల్సి ఉంది. స్పిన్ విభాగంలో ఒక మార్పు జరగవచ్చు. ఆశించిన స్థాయిలో చహల్ రాణించడం లేదు కాబట్టి సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ అశ్విన్‌కు ఒక అవకాశం ఇవ్వవచ్చు. లేదంటే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతను లేడని ఖాయంగా చెప్పవచ్చు.
స్టార్లు లేకపోయినా
లీగ్ దశలో అఫ్గానిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో ఓడగానే శ్రీలంక జట్టును అంతా తేలిగ్గా చూశారు. అయితే తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు చూపిన పోరాటపటిమ, యువ ఆటగాళ్ల పట్టుదల అభినందనీయం. ఈ రెండు మ్యాచ్‌లలోనూ ఓటమికి చేరువై గెలుపునకు ఎలాంటి అవకాశం లేని స్థితి నుంచి లంక మ్యాచ్‌లు గెలవగలిగింది. ముందుగా బంగ్లాదేశ్‌ను ఇంటికి పంపిన ఆ జట్టు ‘సూపర్–4’లో గెలుపుతో అఫ్గానిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది.
బ్యాటర్లు షనక, కుశాల్ మెండిస్, గుణతిలక, రాజపక్స కీలక సమయాల్లో రాణించి జట్టు విజయానికి కారణం కాగా, చివర్లో చమిక కరుణరత్నే కూడా బ్యాటింగ్ చేయగలనని నిరూపించాడు. బౌలింగ్ లో గుర్తింపు ఉన్న పేసర్లు ఎవరూ లేకపోవడం లంక జట్టు బలహీనత. అయితే ఐపీఎల్‌లో ఆడిన స్పిన్నర్లు మహీశ్ తీక్షణ, హసరంగ భారత్‌పై ప్రభావం చూపగలరు.
Comments
Please login to add a commentAdd a comment