లాహోర్: భారత్ క్రికెట్ జట్టు రిజర్వ్ బెంచ్ బలంపై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హాక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాకు ఆడేందుకు కనీసం 50 మంది ఆటగాళ్లు రెడీగా ఉన్నారని, ఈ పరిస్థితి 1990, 2000 దశకాల్లో ఆస్ట్రేలియా కూడా లేదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్‌ను శాశిస్తున్న రోజుల్లో ఆ దేశం తరఫున రెండు బలమైన జట్లు(రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లతో) సాధ్యపడలేదని, భారత్ మాత్రం ఆ దిశగా దూసుకుపోతుందని తెలిపాడు.
కోహ్లి నేతృత్వంలో 23 మంది సభ్యులతో కూడిన భారత జంబో జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంటే, అంతే బలమైన మరో భారత జట్టు (భారత్ బి) శ్రీలంక పర్యటనకు సిద్దమవడం బట్టి చూస్తే భారత్ క్రికెట్ ఏ స్థాయిలో ఉందో సుస్పష్టమవుతుందని అన్నాడు. నాలుగుకు పైగా బలమైన జట్లను వివిధ అంతర్జాతీయ స్థాయి జట్లతో తలపడేందుకు సిద్ధం చేయగల సత్తా భారత్‌కు ఉందని కొనియాడాడు. అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లతో పాటు ప్రతిభగల యువ ఆటగాళ్లతో భారత్ క్రికెట్ నిండు కుండని తలపిస్తుందని ఆకాశానికెత్తాడు.
ఇటువంటి పరిస్థితుల్లో భారత్ రెండు జట్లను కలిగి ఉండటం సహజమేనని అభిప్రాయపడ్డాడు. ఓ దేశం తరఫున రెండు జాతీయ జట్లు వివిధ దేశాలతో ఒకేసారి తలపడటం క్రికెట్ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి కావచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. కాగా, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడేందుకు కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు జూన్ 2న లండన్‌కు బయల్దేరనుంది. ఈ పర్యటనలో తొలుత(జూన్ 18-22) న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్న భారత్.. అనంతరం ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది.
అయితే డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్ మధ్య వచ్చే గ్యాప్‌లో బీసీసీఐ ఓ పరిమిత ఓవర్ల సిరీస్‌ను ప్లాన్ చేసింది. అక్టోబర్‌లో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. లంకలో పర్యటించనున్న భారత బి జట్టుకు శిఖర్ ధవన్ నాయకత్వం వహించే అవకాశాలుండగా, జట్టు సభ్యులుగా పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, రాహుల్ తెవాటియాలు ఉండే అవకాశం ఉంది.
చదవండి: కరోనా బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్
Comments
Please login to add a commentAdd a comment