'గంభీర్ ఒక చిన్న పిల్లాడు.. ఓటమిని అస్సలు జీర్ణించు​కోలేడు' | Gautam Gambhir Childhood Coach Makes Stunning Relevation | Sakshi
Sakshi News home page

'గంభీర్ ఒక చిన్న పిల్లాడు.. ఓటమిని అస్సలు జీర్ణించు​కోలేడు'

Published Tue, Aug 6 2024 9:48 AM | Last Updated on Tue, Aug 6 2024 11:16 AM

Gautam Gambhir Childhood Coach Makes Stunning Relevation

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ తన ప్రయణాన్ని విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే.  శ్రీలంకతో గంభీర్‌ నేతృత్వంలోని భారత జట్టు టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అయితే లంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన టీమిండియా వన్డే సిరీస్‌లో మాత్రం తడబడుతోంది.

తొలి వన్డేను టైగా ముగించిన భారత జట్టు.. రెండో వన్డేలో మాత్రం 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా రెండో వన్డేలో గంభీర్ తీసుకున్న నిర్ణయాల వల్లే భారత్ పరాజయం పాలైందని అభిమానులు విమర్శిస్తున్నారు. కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాడిని ఏడో స్ధానంలో బ్యాటింగ్ పంప‌డాన్ని చాలా మంది మాజీలు త‌ప్ప‌బడుతున్నారు.

గంభీర్‌కు అహంకారం ఎక్కువని, తను అనుకున్నదే చేస్తాడని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్‌ను ఉద్దేశించి తన చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. గౌతీ ఇప్ప‌ట‌కి చిన్న‌పిల్ల‌వాడేన‌ని, అంద‌ర‌ని అభిమానిస్తాడ‌ని భరద్వాజ్ తెలిపాడు.

"గంభీర్ ఒక అహంకారి, దూకుడెక్కువని అంద‌రూ అనుకుంటారు. నిజానికి గంభీర్ చాలా మంచివాడు. అందరని గౌరవిస్తాడు. ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటాడు. ఎంతో మంది యువ క్రికెటర్‌ల కెరీర్‌ను తీర్చిదిద్దాడు. పేసర్ నవదీప్ సైనీ వంటి వాళ్లు గంభీర్ సాయంతోనే క్రికెట్ ప్రపంచానికి పరిచమయ్యారు. 

అతడు గెలవడం కోసమే కొన్నిసార్లు దూకుడుగా, సీరియస్‌గా ఉంటాడు. ఎందుకంటే అతడికి ఓడిపోవడం ఇష్టముండదు. చాలా సందర్భాల్లో ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అతడు రాణించలేకపోయినా ఏడ్చేవాడు. ఎవరైనా సీరియస్‌గా ఉన్నంత మాత్రాన వారు మంచి వారు కాదని అనుకోకూడదు. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటే ఎవరైనా విజయం సాధిస్తారా?

ఎలా గెలవాలో అర్థం చేసుకున్న వారు.. ఓటమి నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా  తెలుసుకోవాలి. గంభీర్ ఆటగాళ్ల టెక్నికల్ అంశాల జోలికి వెళ్లడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపి.. వారి నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టడమే గంభీర్ పని. కోచ్‌గా గంభీర్ విజయవంతమవుతాడని నేను భావిస్తున్నాను. ఇప్పటికీ నా దృష్టిలో గంభీర్ ఒక 12 ఏళ్ల చిన్న పిల్లవాడని" భారత మాజీ క్రికెటర్‌ మంజోత్ కల్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ భరద్వాజ్ పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement