ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడోరోజు ఆట ముగిసింది. తొలి రెండు రోజులు ఆసీస్ ఆధిపత్యం ప్రదర్శించగా.. మూడోరోజు ఆటలో మాత్రం టీమిండియా రెండు సెషన్లలో ఆసీస్‌పై చేయి సాధించింది. తొలి సెషన్‌లో అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్ అద్భుత పోరాటంతో టీమిండియా ఫాలోఆన్ గండం నుంచి బయటపడింది. మూడోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే 5 పరుగులు చేసిన కేఎస్ భరత్ ఔట్ అయ్యాడు.
దీంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. అప్పటికి టీమిండియా స్కోరు 151 మాత్రమే. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే మరో 100 పరుగులు చేయాల్సిన దశలో రహానే, శార్దూల్ అద్బుతం చేశారు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరు ఔటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ ఎక్కువసేపు నిలబడలేదు. దీంతో ఆసీస్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయావకాశాలు ఎక్కువగా ఆసీస్‌కే ఉన్నట్లు తెలుస్తోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ కలుపుకొని ఇప్పటివరకు ఆస్ట్రేలియా 296 పరుగుల ఆధిక్యం సాధించింది. ఒకవేళ నాలుగు రోజు ఆటలో లంచ్‌లోపే ఆసీస్ ఆలౌట్ చేయకపోతే వారి ఆధిక్యం 350 నుంచి 400 వరకు ఉండే అవకాశం ఉంటుంది.
ఆటకు ఇంకా రెండు రోజులు ఉండడంతో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నాలుగు, ఐదు రోజుల్లో బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇది టీమిండియాకు ప్రతికూలంగా మారనుంది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ నిలదొక్కుకునే ప్రయత్నం చేయకపోతే మాత్రం ఓటమి తప్పకపోవచ్చు.
గబ్బా రిపీట్ అయ్యేనా?
అయితే 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో రహానే నేతృత్వంలో గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఇలాంటి పరిస్థితిలోనే చారిత్రక విజయాన్ని సాధించింది. ఆసీస్ విధించిన 329 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి అందుకుంది. అప్పటి మ్యాచ్‌లో రిషబ్ పంత్ 89 నాటౌట్, శుబ్‌మన్ గిల్ 91 పరుగులు, పుజారా 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రస్తుతం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగు రోజు ఆటలో టీమిండియా బౌలర్లు విజృంభించి తొలి సెషన్‌లో తక్కువ వ్యవధిలో(అంటే మరో 40 పరుగులు) ఆసీస్‌ను ఆలౌట్ చేయగలిగితే టీమిండియా లక్ష్యం 330 నుంచి 340 మధ్య ఉంటుంది.
ఆటకు రోజున్నర సమయం ఉండడంతో కాస్త నిలకడగా ఆడితే టీమిండియా విజయం అందుకోవడంతో పాటు టైటిల్ నెగ్గే అవకాశం ఉంది. మరి టీమిండియా ఆసీస్‌ను ఆలౌట్ చేసి చేధనలో టార్గెట్‌ను అందుకుంటుందా లేక మరోసారి రన్నరప్‌గా నిలుస్తుందా అనేది రేపటితో తేలిపోనుంది.
చదవండి: #ShubmanGill: లవ్ ప్రపోజ్‌కు పడిపోయాడు.. రనౌట్ మిస్ చేశాడు!
Comments
Please login to add a commentAdd a comment