ముంబై: మూడున్నర నెలల ఇంగ్లండ్ పర్యటన కోసం బయల్దేరనున్న భారత క్రికెట్ జట్టు ప్రయాణం మొదటి మజిలీ ముంబైకి చేరుకుంది. జూన్ 2న ఇంగ్లండ్ ఫ్లయిట్ ఎక్కడానికి రెండు వారాల ముందునుంచే ముంబైలోని ఒక హోటల్‌లో జట్టు సభ్యులంతా హార్డ్ క్వారంటైన్‌లో గడపనున్నారు. కరోనా నేపథ్యంలో బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం వీరంతా తమ హోటల్ గదులు దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదు. కరోనా కారణంగానే ఐపీఎల్‌ను వాయిదా వేయాల్సి రావడంతో ఈ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు బోర్డు సన్నద్ధమైంది. ఆటగాళ్ల క్వారంటైన్ బుధవారం నుంచే ప్రారంభమైంది. ముంబైలో క్వారంటైన్‌లోకి అడుగు పెట్టే ముందు క్రికెటర్లు కనీసం మూడుసార్లు కరోనా నెగెటివ్‌గా తేలిన రిపోర్టులతో రావాలి. క్వారంటైన్ సమయంలో కూడా కనీసం మరో మూడుసార్లు ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ టూర్‌లో భాగంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్లండ్‌తో భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతుంది. మరోవైపు పురుషుల జట్టుతో పాటే ఇంగ్లండ్ వెళ్లనున్న భారత మహిళల జట్టుకు కూడా క్వారంటైన్ విషయంలో ఇవే ప్రొటోకాల్ వర్తింపజేస్తున్నారు. ఈ పర్యటనలో మహిళల టీమ్ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
రెండు ప్రత్యేక విమానాల్లో...
టీమిండియా జట్టు సభ్యులు సురక్షితంగా ముంబైకి చేరుకునేందుకు బీసీసీఐ రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. ఢిల్లీ, చెన్నైల నుంచి ఈ విమానాలు బయలుదేరాయి. ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, ఉమేశ్ యాదవ్, అవేశ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ ఢిల్లీ నుంచి ముంబైకి చేరారు. చెన్నై నుంచి బయలుదేరిన విమానంలో అశ్విన్, వాషింగ్టన్ సుందర్ ఎక్కగా... రోడ్డు మార్గాన బెంగళూరు నుంచి చెన్నై వెళ్లిన మయాంక్ అగర్వాల్ కూడా వీరితో జత కలిశాడు. ఇదే ఫ్లయిట్ హైదరాబాద్‌కు వెళ్లింది. మహిళల టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్, మీడియం పేస్ బౌలర్ అరుంధతి రెడ్డిలతోపాటు సిరాజ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ దీంట్లో ప్రయాణించి ముంబై చేరారు. ఇతర ప్రాంతాలకు చెందిన క్రికెటర్లు పుజారా, జడేజా, అక్షర్, షమీ మాత్రం తమ ‘నెగెటివ్ రిపోర్ట్’లతో కమర్షియల్ ఫ్లయిట్‌ల ద్వారా విడిగా ముంబై చేరారు.
అలా అయితే ఎలా...
తొలిసారి నిర్వహిస్తున్న డబ్ల్యూటీసీ ఫెనల్‌కు సంబంధించిన నిబంధనలపై ఐసీసీ ఇంకా పూర్తి స్పష్టతనివ్వలేదు. టెస్టులో ఇరు జట్ల ఒక్క ఇన్నింగ్స్ కూడా పూర్తికాని సమయంలో వర్షం కారణంగా ఆట రద్దయిపోతే ఎలా... మ్యాచ్ ‘డ్రా’ లేదా ‘టై’ అయితే ఎలా... వీటిపై ఇంకా ఐసీసీ మరిన్ని వివరాలు ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు 4 వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని ఐసీసీ భావిస్తోంది.
వారికి కాస్త సడలింపు...
ముంబై, సమీప ప్రాంతాల్లో ఉంటున్న క్రికెటర్లకు మాత్రం బీసీసీఐ కాస్త సడలింపు ఇచ్చింది. వారంతా క్వారంటైన్‌లో చేరేందుకు మే 24 వరకు అవకాశం ఇచ్చింది. ఇందులో కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు అజింక్య రహానే, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, కోచ్ రవిశాస్త్రి ఉన్నారు. అపెండిసైటిస్‌కు చికిత్స అనంతరం రాహుల్ కూడా ముంబైలోనే ఉంటున్నాడు. అయితే వీరు కూడా బుధవారం నుంచే తమ ఇళ్ల వద్ద హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. ఐపీఎల్ సమయంలో కరోనా బారిన పడి కోలుకున్న పేసర్ ప్రసిధ్ కృష్ణ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాలకు కూడా బోర్డు మరి కొంత సమయం ఇచ్చింది. వీరిద్దరు కూడా కాస్త ఆలస్యంగా ముంబైలో జట్టుతో కలుస్తారు. మరోవైపు ఐపీఎల్‌లోనే కరోనా పాజిటివ్‌గా తేలిన సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (ఢిల్లీ క్యాపిటల్స్) కూడా కోలుకున్నాడు.
స్టేడియం పక్కనే...
లండన్ చేరిన తర్వాత భారత జట్టు నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక అయిన సౌతాంప్టన్‌కు వెళ్లిపోతుంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ సిరీస్ కొనసాగుతుండగానే టీమిం డియా క్వారంటైన్ మొదలవుతుంది. అయితే మ్యాచ్ జరిగే ఏజియస్ బౌల్ మైదానానికి ఆనుకునే ఉన్న హోటల్‌లోనే ఉండాల్సి రావడం కొంత వెసులుబాటు. ఇక్కడ భారత్ 10 రోజుల పాటు సాఫ్ట్ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంగ్లండ్ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే బయో బబుల్ నిబంధనల ప్రకారం భారత క్రికెటర్లు తమ సహచరులతో కలిసి ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం ఉం టుంది. హోటల్, గ్రౌండ్, ప్రాక్టీస్ నెట్స్ పరిధి దాటకుండా ఈ 10 రోజులు ఆటగాళ్లు గడపాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్‌లో అమ ల్లో ఉన్న ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో ఈ సిరీస్ సందర్భంగా క్రికెటర్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి ముంబై క్వారంటైన్ వరకైతే భార్యా, పిల్లలను అనుమతించింది.
రెండు వారాలు ముంబైలో... పది రోజులు సౌతాంప్టన్‌లో...
Published Thu, May 20 2021 4:56 AM | Last Updated on Thu, May 20 2021 6:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment