ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అవుటైనట్టు థర్డ్ అంపైర్ ప్రకటించాక భారత ఆటగాళ్ల ఆనందం
భారత బౌలర్లు మళ్లీ మాయ చేశారు. అనుభవజ్ఞుడు షమీ లేకపోయినా, మరో సీనియర్ ఉమేశ్ మూడున్నర ఓవర్లకే గాయంతో తప్పుకున్నా... సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని కుప్పకూల్చి విజయానికి బాటలు వేశారు. బుమ్రా చూపిన దారిలో సిరాజ్ రాణించగా, ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్, జడేజా సత్తా చాటడంతో మెల్‌బోర్న్ వేదికలో వరుసగా రెండో సిరీస్‌లో భారత్‌కు గెలుపు పిలుపు వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ సాధించిన 131 పరుగుల భారీ ఆధిక్యాన్ని తీసివేస్తే ఇప్పుడు ఆస్ట్రేలియా స్కోరు 6 వికెట్ల నష్టానికి 2 పరుగులు మాత్రమే! నాలుగో రోజు చివరి నాలుగు వికెట్లు మరికొన్ని పరుగులు జోడించగలిగినా విజయలక్ష్యం భారత్‌కు అందనంత దూరంలో ఉండకపోవచ్చు. వేగంగా ఆ కొన్ని పరుగులు ఛేదించేస్తే సంతోషంగా సిడ్నీ టెస్టుకు టీమిండియా సిద్ధం కావచ్చు.
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను 1–1తో సమం చేసేందుకు భారత్ చేరువైంది. రెండో రోజు బ్యాటింగ్‌లో జోరు కనబర్చిన రహానే సేన సోమవారం బౌలింగ్‌లో సత్తా చాటి ఆసీస్‌ను పడగొట్టింది. ఫలితంగా ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (17 బ్యాటింగ్), కమిన్స్ (15 బ్యాటింగ్) పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం 2 పరుగులు మాత్రమే. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 277/5తో ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటై 131 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రహానే (223 బంతుల్లో 112; 12 ఫోర్లు), రవీంద్ర జడేజా (159 బంతుల్లో 57; 3 ఫోర్లు) తమ స్కోరుకు మరికొన్ని పరుగులు జోడించగలిగారు. 32 పరుగుల వ్యవధిలో భారత్ చివరి 5 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో లయన్, స్టార్క్ చెరో 3 వికెట్లు తీశారు.
రహానే రనౌట్...
మూడోరోజు మరో 23.4 ఓవర్లు ఆడిన అనంతరం భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. లయన్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా ఆడిన జడేజా సింగిల్ కోసం ప్రయత్నించగా... మరోవైపు నుంచి వచ్చిన రహానే సరైన సమయంలో క్రీజ్‌లోకి చేరలేకపోయాడు. దాంతో 121 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెర పడగా, తర్వాతి ఓవర్లోనే జడేజా అర్ధ సెంచరీ పూర్తయింది. ఇదే సింగిల్‌తో భారత్ ఆధిక్యం కూడా సరిగ్గా 100 పరుగులకు చేరింది. ఈ దశలో వరుసగా షార్ట్ పించ్ బంతులతో జడేజాను ఇబ్బంది పెట్టిన ఆసీస్ పేసర్లు చివరకు ఫలితం సాధించారు. స్టార్క్ బౌన్సర్‌ను పుల్ షాట్ ఆడబోయిన జడేజా డీప్ మిడ్ వికెట్‌లో కమిన్స్‌కు చిక్కాడు. ఆ తర్వాత ఒకే స్కోరు వద్ద ఉమేశ్ (9), అశ్విన్ (14) వెనుదిరగ్గా, తర్వాతి ఓవర్లో బుమ్రా (0) అవుటయ్యాడు.
వరుస కట్టి...
భారత్ పదునైన బౌలింగ్ ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మరోసారి తలవంచారు. ఆద్యంతం తడబడటం మినహా ఒక్కరూ సాధికారికంగా, పట్టుదలగా క్రీజ్‌లో నిలబడి పరుగులు సాధించలేకపోయారు. ఘోరమైన ఫామ్‌లో ఉన్న జో బర్న్స్ (4) దానిని కొనసాగిస్తూ ఆరంభంలోనే వెనుదిరగ్గా, వేడ్, లబ్‌షేన్ (49 బంతుల్లో 28; 1 ఫోర్) కలిసి కొద్దిసేపు ప్రతిఘటించారు. అయితే ఈ జోడీని విడదీసేందుకు భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అశ్విన్ బంతులను ఎదుర్కొనేందుకు పదే పదే ఇబ్బంది పడిన లబ్‌షేన్ చివరకు ఒక చక్కటి బంతికి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు.
రెండో సెషన్ ముగిసేసరికి ఆసీస్ 65/2 స్కోరుతో నిలిచింది. అయితే టీ విరామం తర్వాత ఆసీస్ పతనం వేగంగా సాగింది. స్మిత్ (8) వికెట్‌తో భారత్‌కు పట్టు చిక్కగా... ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్న వేడ్‌ను జడేజా వెనక్కి పంపాడు. ఎల్బీగా అవుట్ ఇవ్వడంపై వేడ్ రివ్యూ కోరినా లాభం లేకపోయింది. పేలవ షాట్‌తో హెడ్ (17) పెవిలియన్ చేరగా, కెప్టెన్ పైన్ (1) కూడా ఏమీ చేయలేకపోయాడు. ఇలాంటి స్థితిలో గ్రీన్, కమిన్స్ కలిసి మ్యాచ్ మూడో రోజే ముగిసిపోకుండా అడ్డుకున్నారు. చివర్లో అశ్విన్ బౌలింగ్‌లో కమిన్స్ (11 వద్ద) ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ పంత్ అందుకోలేకపోయాడు.
పాపం స్మిత్!
భారత్‌పై అత్యద్భుత రికార్డు ఉండి (71.95 సగటు) ఈసారి ఆస్ట్రేలియా రాత మారుస్తాడని భావించిన ప్రపంచ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ పేలవ ప్రదర్శన కొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన అతను ఈసారి బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. బుమ్రా వేసిన బంతి అతని కాళ్ల వెనుకవైపు నుంచి వచ్చి లెగ్‌స్టంప్ బెయిల్స్‌ను మెల్లగా ముద్దాడింది! తాను సరైన లైన్‌లోనే నిలబడ్డానని పొరబడిన స్మిత్‌కు లెగ్‌స్టంప్‌ను వదిలేసిన విషయం అర్థం కాలేదు. అసలు తాను బౌల్డ్ అయిన విషయాన్నే అతను గుర్తించలేకపోయాడు. బెయిల్ పడిన తర్వాత కీపర్ బంతిని అందుకోకపోవడంతో స్మిత్ పరుగు కోసం కూడా ప్రయత్నించడం గమనార్హం! దానిని గుర్తించేసరికి భారత్ సంబరాల్లో మునిగిపోవడం, అతను నిరాశతో వెనుదిరగడం చకచకా జరిగిపోయాయి.
పైన్ అవుట్‌పై వివాదం!
తొలి ఇన్నింగ్స్‌లో రనౌట్ విషయంలో బ్యాట్ లైన్‌పైనే కనిపిస్తున్నా ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’తో బయటపడిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ వివాదానికి కేంద్రంగా నిలిచాడు. జడేజా వేసిన బంతిని కట్ చేయడానికి ప్రయత్నించగా అది బ్యాట్ అంచును తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. భారత్ అప్పీల్‌కు అంపైర్ స్పందించకపోవడంతో రహానే రివ్యూ కోరాడు. మూడో అంపైర్ పాల్ విల్సన్ పదే పదే రీప్లేలు చూడాల్సి వచ్చింది.
‘హాట్‌స్పాట్’లో బంతి బ్యాట్‌కు తగిలినట్లుగా ఎలాంటి ముద్ర కనిపించలేదు. అయితే తర్వాత ‘స్నికో’లో మాత్రం బంతి బ్యాట్‌ను దాటుతున్న సమయంలో మీటర్‌లో మార్పు స్పష్టంగా కనిపించింది. దాంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించగా, తీవ్ర అసంతృప్తితో పైన్ మైదానం వీడాడు. ఆట ముగిసిన అనంతరం ఆసీస్ ఆటగాడు వేడ్ ప్రశ్నించాడు. డీఆర్‌ఎస్ నిర్ణయాల్లో నిలకడ లేదని అతను విమర్శించాడు. ‘రెండో రోజు తొలి బంతి ఆడిన పుజారాకు కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. స్నికోలో ఇదే తరహాలో కనిపించింది. కానీ అతడిని నాటౌట్‌గా ప్రకటించి పైన్‌కు మాత్రం అవుట్ ఇచ్చారు. అవుటైనా, నాటౌట్ అయినా అంపైర్ల నిర్ణయాలు ఒకేలా ఉండాలి’ అని వేడ్ అన్నాడు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఐదుసార్లు ఐసీసీ ‘అంపైర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన దిగ్గజ అంపైర్ సైమన్ టఫెల్ దీనిపై మరింత స్పష్టతనిచ్చారు. పైన్ అవుట్ విషయంలో మూడో అంపైర్ సరిగ్గా వ్యవహరించారన్నారు. ‘నిబంధనల ప్రకారం బంతి దిశ మార్చుకుందా అనేది ముందుగా అంపైర్ చూస్తారు. దీనిపై స్పష్టత లేకపోతే హాట్ స్పాట్‌ను ఆశ్రయిస్తారు. అప్పటికీ తేలకపోతే ప్రొటోకాల్ ప్రకారం రియల్ టైమ్ స్నికోను పరిశీలించాలి. బంతి బ్యాట్‌ను తాకే సమయంలో మీటర్‌లో అసాధారణ మార్పు కనిపిస్తే దానినే తుది నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది.
సాధారణంగా స్నికోలో చూసినప్పుడు బంతి బ్యాట్‌ను దాటిన తర్వాత శబ్దం వినిపిస్తుంది. అప్పుడే మీటర్‌లో కదలిక వస్తుంది. ఇదేమీ తప్పు కాదు. శబ్దంకంటే కాంతి వేగం ఎక్కువ కావడమే దీనికి కారణం. ఐసీసీ రూల్స్ ప్రకారం హాట్ స్పాట్‌లో ముద్ర కనిపించకపోతేనే స్నికో వరకు వెళ్లాలి. అంతకుముందు జో బర్న్స్ అప్పీల్ చేసినప్పుడు బ్యాట్‌కు బంతి తగిలిన విషయం హాట్‌స్పాట్‌లోనే స్పష్టంగా తేలిపోయింది కాబట్టి స్నికో చూడాల్సిన అవసరమే రాలేదు’ అని టఫెల్ వివరించారు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 195;
భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0, గిల్ (సి) పైన్ (బి) కమిన్స్ 45, పుజారా (సి) పైన్ (బి) కమిన్స్ 17, రహానే (రనౌట్) 112, విహారి (సి) స్మిత్ (బి) లయన్ 21, పంత్ (సి) పైన్ (బి) స్టార్క్ 29, జడేజా (సి) కమిన్స్ (బి) స్టార్క్ 57, అశ్విన్ (సి) లయన్ (బి) హాజల్‌వుడ్ 14, ఉమేశ్ (సి) స్మిత్ (బి) లయన్ 9, బుమ్రా (సి) హెడ్ (బి) లయన్ 0, సిరాజ్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 22, మొత్తం (115.1 ఓవర్లలో ఆలౌట్) 326.
వికెట్ల పతనం: 1–0, 2–61, 3–64, 4–116, 5–173, 6–294, 7–306, 8–325, 9–325, 10–326.
బౌలింగ్: స్టార్క్ 26–5–78–3, కమిన్స్ 27–9–80–2, హాజల్‌వుడ్ 23–6–47–1, లయన్ 27.1–4–72–3, గ్రీన్ 12–1–31–0.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వేడ్ (ఎల్బీ) (బి) జడేజా 40, బర్న్స్ (సి) పంత్ (బి) ఉమేశ్ 4, లబ్‌షేన్ (సి) రహానే (బి) అశ్విన్ 28, స్మిత్ (బి) బుమ్రా 8, హెడ్ (సి) మయాంక్ (బి) సిరాజ్ 17, గ్రీన్ (బ్యాటింగ్) 17, పైన్ (సి) పంత్ (బి) జడేజా 1, కమిన్స్ (బ్యాటింగ్) 15, ఎక్స్‌ట్రాలు 3,
మొత్తం (66 ఓవర్లలో 6 వికెట్లకు) 133.
వికెట్ల పతనం: 1–4, 2–42, 3–71, 4–98, 5–98, 6–99.
బౌలింగ్: బుమ్రా 17–4–34–1, ఉమేశ్ 3.3–0–5–1, సిరాజ్ 12.3–1–23–1, అశ్విన్ 23–4–46–1, జడేజా 10–3–25–2.
Comments
Please login to add a commentAdd a comment