క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడు, ఎన్నిసార్లు మ్యాచ్ జరిగినా అది కొత్తగానే ఉంటుంది. సుదీర్ఘ విరామం తర్వాతేమీ ఆడటం లేదు, ఇరు జట్ల మధ్య పోరు జరిగి సరిగ్గా 50 రోజులే అయింది. అయినా సరే ఇప్పుడు వరల్డ్‌కప్ వచ్చేసరికి మళ్లీ అభిమానుల్లో అదే ఉత్సాహం, అదే ఉద్వేగం... ఆటగాళ్లపై అదే తరహాలో తప్పని ఒత్తిడి కూడా! ఆసియా కప్‌ను పక్కన పెడితే గత ఏడాది టి20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఎదురైన పరాజయం కోణంలోనే భారత్‌కు ఈ మ్యాచ్ మరింత కీలకం. ‘ప్రతీకారం’ అనే మాటను వాడదల్చుకోలేదని ఎవరు చెప్పినా ఆ పదం విలువ, అర్థమేమిటో భారత అభిమానులకు బాగా తెలుసు!
మెల్‌బోర్న్: ఎప్పుడో 37 ఏళ్ల క్రితం... భారత్, పాకిస్తాన్ జట్లు ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య పోరును ఎవరూ పట్టించుకోని ఆ రోజుల్లో 30 వేల మంది కూడా మ్యాచ్‌కు రాలేదు. కానీ ఇప్పుడు... ఈ మ్యాచ్ రాబట్టే ఆదాయం ఏమిటో బాగా తెలిసిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంసీజీని వేదికగా మార్చింది. 90 వేల సామర్థ్యం గల మైదానంలో చాలా కాలం క్రితమే అన్ని టికెట్లు నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల అభిమానుల హోరు మధ్య నేడు భారత్, పాకిస్తాన్ తమ తొలి లీగ్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. దీంతో అభిమానులందరికీ ఆదివారం మధ్యాహ్నం నుంచి వినోదానికి ఫుల్ గ్యారంటీ.
రెండో స్పిన్నర్ ఎవరు?
భారత జట్టుకు బ్యాటింగ్‌కు సంబంధించి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆసియా కప్‌తో పాటు ఆ తర్వాత స్వదేశంలో జరిగిన సిరీస్‌లను బట్టి చూస్తే చాలా వరకు తుది జట్టు ఏమిటో స్పష్టమవుతుంది. టాపార్డర్‌లో రోహిత్, రాహుల్, కోహ్లిలు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. గత వరల్డ్ కప్‌లో ఈ ముగ్గురి వికెట్లు తీసి షాహిన్ అఫ్రిది ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఈసారి అతని బౌలింగ్‌పై చెలరేగితే ప్రత్యర్థి ఆత్మరక్షణలో పడిపోతుంది. ప్రస్తుతం టి20 క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడగల సమర్థుడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ఫినిషింగ్ బాధ్యతలు చేపడతారు. ఎడంచేతి వాటం ప్రయోజనం ఉన్నా, ప్రస్తుత ఫామ్ ప్రకారం కార్తీక్‌కే తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఎక్కువ. పేస్ బౌలింగ్‌లో షమీ, భువనేశ్వర్, అర్‡్షదీప్‌లు ఖాయం కాగా... రెండో స్పిన్నర్ విషయంలో అశ్విన్, చహల్‌లలో ఒకరే ఆడే అవకాశముంది.
రవూఫ్ కీలకం!
పాకిస్తాన్ బ్యాటింగ్‌లో కూడా తడబాటు ఉంది. అంకెలపరంగా చూస్తే మొహమ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజమ్ పెద్ద సంఖ్యలో పరుగులు చేస్తున్నట్లు కనిపిస్తున్నా, వారి స్ట్రయిక్‌రేట్ పేలవం. షాన్ మసూద్ పేలవ ఫామ్‌లో ఉండగా, గాయంతో ఫఖర్ జమాన్ దూరమయ్యాడు. మిడిలార్డర్‌లో హైదర్ అలీ, ఆసిఫ్ అలీ, ఇఫ్తికార్‌లు అంతంత మాత్రం బ్యాటర్లే! ఆసియా కప్‌లోనే వీరి వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఆసీస్ గడ్డపై వీరు ఏమాత్రం ఆడతారనేది చెప్పలేం.
దాంతో పాకిస్తాన్ తమ బౌలింగ్‌నే ప్రధానంగా నమ్ముకుంటోంది. గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన షాహిన్ తమ రాత మార్చగలడని పాక్ భావిస్తోంది. షాహిన్ బౌలింగ్‌లో శుభారంభం అందిస్తే ఆ జట్టుపై ఒత్తిడి తగ్గుతుంది. మరో పేసర్‌గా నసీమ్ షా ఉంటాడు. అయితే వాస్తవానికి అఫ్రిదికంటే కూడా హారిస్ రవూఫ్ కీలకం కానున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున చెలరేగిన అతనికి ఒక రకంగా ఇది సొంత మైదానంలాంటిది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లి, సూర్యకుమార్, హార్దిక్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, షమీ, చహల్/అశ్విన్, భువనేశ్వర్, అర్‡్షదీప్ సింగ్.
పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, షాన్ మసూద్, హైదర్ అలీ, ఇఫ్తికార్, ఆసిఫ్ అలీ, నవాజ్, షాదాబ్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్.
Comments
Please login to add a commentAdd a comment