పాకిస్తాన్ షహీన్స్‌పై 7 పరుగులతో విజయం
ఎమర్జింగ్ కప్ ఆసియా టి20 టోర్నమెంట్
అల్ అమ్రత్: ఎమర్జింగ్ కప్ ఆసియా టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత ‘ఎ’ జట్టు శుభారంభం చేసింది. ఒమన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో దాయాది పాకిస్తాన్‌పై భారత్ విజయాన్ని అందుకుంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ‘ఎ’జట్టు 7 పరుగుల తేడాతో పాకిస్తాన్ షహీన్స్ జట్టుపై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
యువ భారత జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ (35 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... ఓపెనర్లు అభిషేక్ శర్మ (22 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఓపెనర్లు ఆకట్టుకోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి భారత జట్టు వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగుల రాక మందగించినా... చివర్లో తిలిక్ వర్మ ధాటిగా ఆడి జట్టుకు మంచి స్కోరు అందించాడు.
నేహల్ వధేరా (25; 2 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. పాకిస్తాన్ షహీన్స్ బౌలర్లలో సూఫియన్ ముఖీమ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అరాఫత్ మిన్హాస్ (29 బంతుల్లో 41; 5 ఫోర్లు, ఒక సిక్సర్), యాసిర్ ఖాన్ (22 బంతుల్లో 33; ఒక ఫోర్, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఖాసిమ్ అక్రమ్ (27), అబ్దుల్ సమద్ (25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు.
విజయానికి చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు అవసరమైన దశలో పాకిస్తాన్ షహీన్స్ జట్టు 16 పరుగులకే పరిమితమై పరాజయం వైపు నిలిచింది. భారత బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టగా... రసిఖ్ సలామ్, నిషాంత్ సలామ్ చెరో రెండు వికెట్లు తీశారు. అన్షుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో యూఏఈ జట్టు 4 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచింది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ తదుపరి మ్యాచ్‌లో భారత్ ‘ఎ’జట్టు సోమవారం యూఏఈతో తలపడనుంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ ‘ఎ’ఇన్నింగ్స్: 183/8 (తిలక్ వర్మ 44, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 36, అభిషేక్ శర్మ 35; సూఫియాన్ ముఖీమ్ 2/28),
పాకిస్తాన్ షహీన్స్ ఇన్నింగ్స్: 176/7 (అరాఫత్ మిన్హాస్ 41, యాసిర్ ఖాన్ 33; అన్షుల్ కంబోజ్ 3/33, నిషాంత్ సింధు 2/15).
Comments
Please login to add a commentAdd a comment