IND vs ENG 4th Test: ముగిసిన తొలి రోజు ఆట.. హైలైట్స్‌ ఇవే | India vs England 4th Test Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND vs ENG 4th Test: ముగిసిన తొలి రోజు ఆట.. హైలైట్స్‌ ఇవే

Published Fri, Feb 23 2024 8:49 AM | Last Updated on Fri, Feb 23 2024 4:45 PM

India vs england 4th test live updates and Highlights - Sakshi

India vs England, 4th Test Ranchi Day 1 Updates: టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌ సందర్భంగా భారత్‌ తరఫున బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ అరంగేట్రం చేశాడు.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆదిలోనే చుక్కలు చూపించాడు. ఓపెనర్లు జాక్‌ క్రాలే(42), బెన్‌ డకెట్‌(11), ఒలీ పోప్‌(0)లను పెవిలియన్‌కు పంపి టాపార్డర్‌ను కుదేలు చేశాడు.

ఆకాశ్‌ దెబ్బకు 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను జో రూట్‌ తన అద్భుత ఇన్నింగ్స్‌తో గట్టెక్కించాడు. వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి అజేయ సెంచరీతో మెరిశాడు.

మిగతా వాళ్లలో జానీ బెయిర్‌స్టో(38), బెన్‌ ఫోక్స్‌(47) మాత్రమే రాణించారు. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్‌ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జో రూ రూట్‌ 106(226 బంతుల్లో), ఓలీ రాబిన్సన్‌ 31(60 బంతుల్లో) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్‌ దీప్‌ మూడు, మహ్మద్‌ సిరాజ్‌ రెండు, అశ్విన్‌, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్‌ పడగొట్టారు. మొత్తానికి.. టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆరంభంలో తడబడ్డా రూట్‌  ఇన్నింగ్స్‌ కారణంగా ఇంగ్లండ్‌ తిరిగి పుంజుకుంది.

83.6: సెంచరీ కొట్టిన జో రూట్‌
బజ్‌బాల్‌ అంటూ దూకుడుగా ఆడకుండా తనదైన సహజ శైలిలో ఆడిన జో రూట్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్న రూట్‌.. ఆచితూచి నిలకడగా ఆడుతూ 219 బంతుల్లో 103 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 279-7(84)

ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
245 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. టామ్‌ హార్ట్లీని (13) సిరాజ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. రూట్‌తో (82) పాటు రాబిన్సన్‌ క్రీజ్‌లో ఉన్నాడు. 

ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
225 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్‌ ఇచ్చి బెన్‌ ఫోక్స్‌ (47) ఔటయ్యాడు. జో రూట్‌ (75), టామ్‌ హార్ట్లీ క్రీజ్‌లో ఉన్నారు. 

62.2: 200 పరుగులు పూర్తి చేసిన ఇంగ్లండ్‌
టీ బ్రేక్‌ సమయానికి ఇంగ్లండ్‌ స్కోరు: 198/5 (61)
జో రూట్‌ 67, ఫోక్స్‌ 28 పరుగులతో ఆచితూచి ఆడుతున్నారు.

ఇంగ్లండ్‌ స్కోరు: 184/5 (54)
ఎట్టకేలకు రూట్‌ ఫిఫ్టీ
48.5: టీమిండియాతో తాజా టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ సీనియర్‌ బ్యాటర్‌ జో రూట్‌ ఎట్టకేలకు అర్ధ శతకం సాధించాడు. 

నిలకడగా రూట్‌ ఇన్నింగ్స్‌
రూట్‌ 86 బంతుల్లో 40, ఫోక్స్‌ 56 బంతుల్లో 14 పరుగులతో ఆచితూచి ఆడుతున్నారు. ఇంగ్లండ్‌ స్కోరు:  150-5(41)

ఇంగ్లండ్‌ స్కోరు: 137/5 (36) 
రూట్‌ 32, ఫోక్స్‌ 9 పరుగులతో ఆడుతున్నారు.

లంచ్‌ తర్వాత ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌.. స్కోరు: 129-5. రూట్‌ 27, ఫోక్స్‌ ఆరు పరుగులతో ఆడుతున్నారు.

కష్టాల్లో ఇంగ్లండ్‌.. లంచ్‌ విరామానికి స్కోర్‌: 112/5
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ రూపంలో ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

నాలుగో వికెట్‌ డౌన్‌..
జానీ బెయిర్‌ స్టో రూపంలో ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 38 పరుగులు చేసిన జానీ బెయిర్‌ స్టో.. అశ్విన్‌ బౌలింగ్‌లలో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులో కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ వచ్చాడు. 23 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 111/4 

19 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 89/3
తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో జానీ బెయిర్‌ స్టో(23), జో రూట్‌(11) పరుగులతో ఉన్నారు.

మూడో వికెట్‌ డౌన్‌
11.5: అరంగేట్ర పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు వికెట్లు తీసిన  ఈ బెంగాల్‌ బౌలర్‌.. జాక్‌ క్రాలే(42) రూపంలో మూడో వికెట్‌ దక్కించుకున్నాడు. తొలుత నో బాల్‌ కారణంగా మిస్సయిన క్రాలేను ఈసారి బౌల్డ్‌ చేయడంలో ఆకాశ్‌ ఎలాంటి పొరపాటు చేయలేదు. ఇంగ్లండ్‌ స్కోరు: 57-3. బెయిర్‌ స్టో, జో రూట్‌ క్రీజులో ఉన్నారు.

ఒకే ఓవర్లో ఆకాశ్‌ దీప్‌నకు రెండు వికెట్లు
9.4: రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌. ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒలీ పోప్‌ డకౌట్‌ అయ్యాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. జో రూట్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 47/2 (9.4)

 తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
9.2: అరంగేట్ర పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌(11) వికెట్‌ కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఒలీ పోప్‌ క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లండ్‌ స్కోరు: 47/1 (9.2). జాక్‌ క్రాలే 35 పరుగులతో ఆడుతున్నాడు.

7 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 31/0
7 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. క్రీజులో క్రాలే(32), బెన్‌ డకెట్‌(4) పరుగులతో ఉన్నారు.

4 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 9/0
4 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. 

టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌
రాంచి వేదికగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో పేసర్‌ ఆకాష్‌ దీప్‌ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా స్ధానంలో ఆకాష్‌ దీప్‌ జట్టులోకి వచ్చాడు.

మరోవైపు ఇంగ్లండ్‌ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. మార్క్‌ వుడ్‌ స్ధానంలో పేసర్‌ ఓలీ రాబిన్సన్‌ తుది జట్టులోకి రాగా..  రెహాన్‌ ఆహ్మద్‌ స్ధానంలో యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.

తుది జట్లు
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), బెన్ ఫోక్స్(వికెట్‌ కీపర్‌), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement