ఆక్లాండ్: భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు మరో ఏడాదికంటే తక్కువ సమయం ఉంది. వచ్చే అక్టోబర్–నవంబర్‌లలో ఈ టోర్నీ జరగనుంది. దాంతో ఇప్పటినుంచి జరిగే ప్రతీ మ్యాచ్‌ను టీమిండియా సన్నాహకాల్లో భాగంగానే చెప్పవచ్చు. రెగ్యులర్ ఆటగాళ్లతో పాటు జట్టులో అవకాశం సాధించే సత్తా ఉన్న కుర్రాళ్లను కూడా పరీక్షించేందుకు ఈ వరుస ద్వైపాక్షిక సిరీస్‌లు ఉపయోగపడనున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే తొలి పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. టి20 సిరీస్‌ను గెలుచుకొని భారత బృందం జోరు మీదుంది.
తుది జట్టులో చోటు కోసం...
శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు ఈ వన్డే సిరీస్ బరిలోకి దిగుతోంది. అయితే అతని బ్యాటింగ్ ఫామ్ అంత గొప్పగా లేదు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లోనూ విఫలమైన ధావన్...చెప్పుకోదగ్గ స్కోరు సాధించిన మ్యాచ్‌లలోనూ బాగా నెమ్మదిగా ఆడుతూ పేలవ స్ట్రైక్‌రేట్‌తో నమోదు చేశాడు. వచ్చే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగాలని భావిస్తున్న అతను ప్రస్తుతం ఉన్న పోటీ నేపథ్యంలో బ్యాట్ ఝళిపించాల్సిందే. రెండో ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ ఖాయం. ఈ ఏడాది అతను 75.71 సగటుతో 9 మ్యాచ్‌లలోనే 530 పరుగులు సాధించిన తన సత్తాను ప్రదర్శించాడు.
కోహ్లి లేకపోవడంతో మూడో స్థానంలో ఆడే శ్రేయస్ అయ్యర్‌కు ఇది మరో మంచి చాన్స్. టి20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన అయ్యర్ ఇక్కడైనా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత మిడిలార్డర్‌లో సూర్యకుమార్, పంత్‌లు దూకుడు ప్రదర్శించగలరు. అదనపు బౌలింగ్ ప్రత్యామ్నాయంగా ఉన్న దీపక్ హుడాను ఆడిస్తారా లేక టి20 సిరీస్‌లో అవకాశం దక్కని సామ్సన్‌ను ఎంపిక చేస్తారా చూడాలి. సుందర్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కీలకం కానున్నాడు. దీపక్ చహర్, శార్దుల్, అర్‡్షదీప్‌లు పేస్ బౌలింగ్ భారం మోస్తారు. కుల్దీప్ యాదవ్, చహల్‌లలో ఒకరికే రెండో స్పిన్నర్‌గా చాన్స్ లభిస్తుంది.
విలియమ్సన్ ఫామ్‌లోకి వస్తాడా...
టి20లతో పోలిస్తే వన్డేలకు కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ శైలి సరిగ్గా సరిపోతుంది. కాబట్టి ఈ సిరీస్‌లో తమ కెప్టెన్ రాణించాలని జట్టు కోరుకుంటోంది. టి20 సిరీస్‌తో పోలిస్తే కాన్వే కేవలం బ్యాటర్ పాత్రమే పరిమితం కానుండగా, లాథమ్ కీపింగ్ బాధ్యతలు చూస్తాడు. ఓపెనర్ అలెన్‌పై కివీస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మిడిలార్డర్‌లో లాథమ్, మిచెల్, ఫిలిప్స్ జట్టుకు భారీ స్కోరు అందించగలరు. నీషమ్, సాన్‌ట్నర్ రూపంలో ఆల్‌రౌండ్‌ర్లు అందుబాటులో ఉండగా...ముగ్గురు పేసర్లు సౌతీ, హెన్రీ, ఫెర్గూసన్‌లకు సొంత గడ్డపై ఘనమైన రికార్డు ఉంది.
పిచ్, వాతావరణం
ఈడెన్ పార్క్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. పిచ్‌కు నేరుగా ఉండే బౌండరీలు మరీ చిన్నవి కాబట్టి భారీ స్కోర్లను ఆశించవచ్చు. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు.
Comments
Please login to add a commentAdd a comment