
సూర్యకుమార్ విధ్వంసకర శతకం.. కివీస్‌పై టీమిండియా ఘన విజయం
సూర్యకుమార్ విధ్వంసకర శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వర్షం కారణంగా తొలి టీ20 పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. సూర్యకుమార్ (51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఛేదనలో ఆది నుంచే తడబడిన కివీస్.. దీపక్ హుడా (4/10), చహల్ (2/26), సిరాజ్ (2/24), సుందర్ (1/24), భువనేశ్వర్ (1/12) ధాటికి 18.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది.
19వ ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టిన హుడా
19వ ఓవర్‌లో దీపక్ హుడా మాయ చేశాడు. ఏకంగా 3 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ఓటమిని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్‌లో హుడా 4 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ వెన్నువిరిచాడు.
ఏడో వికెట్ డౌన్
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓటమి అంచుల్లో నిలిచింది. సిరాజ్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ ఔట్ కావడంతో కివీస్ కథ దాదాపుగా సమాప్తమైంది. హాఫ్ సెంచరీ సాధించిన విలియమ్సన్‌ను (61) సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 18 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 125/7.
ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
99 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో సాంట్నర్ (2) అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 99/6.
89 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. 89 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకుంది. చహల్ బౌలింగ్‌లో నీషమ్ (0) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 14 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 91/5.
నాలుగో వికెట్ డౌన్
ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. దీపక్ హుడా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి డారిల్ మిచెల్ (10) ఔటయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. డేంజరెస్ ఫిలిప్స్ ఔట్
డేంజరెస్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్‌ను (12) చహల్ బోల్తా కొట్టించాడు. 10వ ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాది జోరుమీద ఉండిన ఫిలిప్స్‌ను చహల్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
తొలి ఓవర్‌లో 17 పరుగులు సమర్పించుకున్న తర్వాత, ఆమరుసటి ఓవర్ తొలి బంతికే వికెట్ పడగొట్టాడు వాషింగ్టన్ సుందర్. సుందర్ బౌలింగ్‌లో అర్షదీప్‌కు క్యాచ్ ఇచ్చి కాన్వే (25) ఔటయ్యాడు. 8.1 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 56/2.
7 ఓవర్ల తర్వాత కివీస్ స్కోర్ ఎంతంటే..?
192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో బంతికే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. ఆతర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. 7 ఓవర్ల తర్వాత కివీస్ స్కోర్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. కాన్వే (20), విలియమ్సన్ (24) క్రీజ్‌లో ఉన్నారు.
తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రెండో బంతికే ఫిన్ అలెన్ (0)ను భవనేశ్వర్ కుమార్ పెవిలియన్‌కు పంపాడు, అర్షదీప్ క్యాచ్ అందుకోవడంతో అలెన్ ఔటయ్యాడు.
సూర్యకుమార్ సుడిగాలి శతకం. టీమిండియా భారీ స్కోర్
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో రెండో సెంచరీ బాదాడు. సూర్యకుమార్ ధాటికి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్‌లో సౌథీ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు.
శతక్కొట్టిన సూర్యకుమార్
టీమిండియా నయా సంచలనం సూర్యకుమార్ యాదవ్ అద్బుత సెంచరీతో మెరిశాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టి20లో చెలరేగిన సూర్యకుమార్ 49 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సూర్య ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ టీమిండియా తరపున రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా అదే జోరును న్యూజిలాండ్ గడ్డమీద కూడా చూపించాడు.
దంచుతున్న సూర్య.. భారీ స్కోరు దిశగా టీమిండియా
►సూర్యకుమార్ యాదవ్ దాటిగా ఆడుతుండడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం టీమిండియా 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సూర్యకుమార్ 72, పాండ్యా 8 పరుగులతో ఆడుతున్నారు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సూర్యకుమార్
►సూర్యకుమార్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టీ20ల్లో మరో హాఫ్ సెంచరీని బాదాడు. సూర్య.. 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో 13వ హాఫ్ సెంచరీ బాదాడు.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
12.4వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ (13) హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో కాలు వికెట్లకు తగిలి అయ్యర్ పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 110/3. క్రీజ్ సూర్యకుమార్ (43), హార్ధిక్ పాండ్యా ఉన్నారు.
ఆట మళ్లీ మొదలు, రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
►వరుణుడు శాంతించాడు. ఆట మళ్లీ మొదలైంది. అప్పటి దాకా ధాటిగా ఆడుతున్న ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 36) ఆటకు బ్రేక్ పడటంతో లయ తప్పి ఔటయ్యాడు. 9.1వ ఓవర్లో సోధి బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇషాన్ ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 69/2. సూర్యకుమార్ (17), శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు.
అనుకున్నదే అయ్యింది.. వర్షం స్టార్ట్ అయ్యింది
►వాతావరణ శాఖ హెచ్చరికలే నిజమయ్యాయి. రెండో టీ20కి వరుణుడు ఆటంకం కలిగించాడు. టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తుండగా, 6.4 ఓవర్లు ముగిశాక వర్షం మొదలైంది. ఆ సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. పంత్ (6) మరోసారి నిరాశపర్చగా.. ఇషాన్ కిషన్ (28),సూర్యకుమార్ యాదవ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. పంత్ మళ్లీ విఫలం
►టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 6వ ఓవర్ తొలి బంతికే రిషబ్ పంత్ (6) ఔటయ్యాడు. ఓపెనర్‌గా అవకాశం ఇచ్చినా పంత్ మరోసారి విఫలమయ్యాడు. 5.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 36/1. క్రీజ్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ ఉన్నారు.
2 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 14/0
► 2 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. పంత్ 4, ఇషాన్ కిషన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ వేదికగా ఇవాళ (నవంబర్ 20) జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు..
టీమిండియా : హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్
న్యూజిలాండ్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోది, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్
Comments
Please login to add a commentAdd a comment