నేటి నుంచి భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు
తప్పక గెలవాల్సిన ఒత్తిడిలో టీమిండియా
కొత్త ఉత్సాహంతో కివీస్
ఉదయం గం.9:30 నుంచి స్పోర్ట్ 18, జియో సినిమాలలో ప్రత్యక్ష ప్రసారం
సొంతగడ్డపై తొలి టెస్టులో ప్రత్యర్థి చేతిలో ఓడి వెనుకబడటం, ఆ తర్వాత కోలుకొని వరుస విజయాలతో సిరీస్ గెలుచుకోవడం భారత జట్టుకు కొత్త కాదు. ఇటీవల ఆస్ట్రేలియా ఒకసారి, ఇంగ్లండ్ రెండుసార్లు ఇలాగే ముందంజ వేసినా మన టీమ్ మళ్లీ సత్తా చాటి తామేంటో చూపించింది.
ఇప్పుడు ఈ విషయంలో న్యూజిలాండ్ వంతు! ప్రతికూల పిచ్ దెబ్బకు అనూహ్యంగా కివీస్ చేతిలో తొలి టెస్టులో ఓడిన టీమిండియా ప్రతీకారానికి సిద్ధమైంది. తమ స్థాయిని ప్రదర్శిస్తూ రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా రోహిత్ శర్మ బృందం బరిలోకి దిగుతోంది. మరోవైపు గత విజయం ఇచ్చిన ఉత్సాహంతో న్యూజిలాండ్ కూడా ఎక్కడా తగ్గరాదని పట్టుదలగా ఉంది.
పుణే: ‘రెండు గంటలు మినహా మిగతా మ్యాచ్ మొత్తం మేం బాగా ఆడాం’... బెంగళూరు టెస్టులో ప్రదర్శనపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్య ఇది. పిచ్‌పై అంచనా తప్పడంతో 0–1తో సిరీస్‌లో వెనుకబడిన భారత్ ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వ రాదని భావిస్తోంది.
అందుకే తమ టీమ్ బలగంతో పాటు స్పిన్ బలాన్ని కూడా నమ్ముకుంటోంది. పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ను రూపొందించి ప్రత్యర్థికి సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సిరీస్‌లో 1–1తో సమంగా నిలుస్తుంది.
బరిలోకి గిల్...
గత టెస్టు మ్యాచ్ ఆడిన జట్టులోంచి భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి కోలుకున్న టాపార్డర్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నాడని మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అయితే గిల్ వస్తే ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరం. రాహుల్‌పై విమర్శలు వస్తున్నా... అతను మిడిలార్డర్‌కు మారిన తర్వాత 1 సెంచరీ, 2 అర్ధసెంచరీలతో మెరుగైన ప్రదర్శనే చేశాడు.
కానీ గత టెస్టులో ఆటను బట్టి సర్ఫరాజ్‌కే మొగ్గు చూపవచ్చు. ఈ యువ ఆటగాడు తన బ్యాటింగ్ జోరు కొనసాగించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. మరోవైపు సిరాజ్ ఫామ్‌లో లేకపోవడంతో అతనికి బదులుగా ఆకాశ్‌దీప్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఎలాగూ స్పిన్‌తో యుద్ధానికి సిద్ధం అవుతున్నారు కాబట్టి నాలుగో స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదు.
రోహిత్, యశస్వి, గిల్, కోహ్లిలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. పంత్ కూడా పూర్తిగా కోలుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఆడిన తరహాలో అశ్విన్, జడేజా కూడా ఒక చేయి వేస్తే తిరుగుండదు. బౌలింగ్‌లో వీరిద్దరితో పాటు కుల్దీప్ కివీస్‌ను కుప్పకూల్చాలని టీమ్ కోరుకుంటోంది.
సాన్‌ట్నర్‌కు చోటు...
తొలి టెస్టులో గెలిచినా... వాస్తవ పరిస్థితి ఏమిటో న్యూజిలాండ్‌కు తెలుసు. గత మ్యాచ్ విజయం తమలో స్ఫూర్తి నింపేందుకు పనికొస్తుందే తప్ప వరుసగా రెండో టెస్టులో భారత్‌ను ఇక్కడ ఓడించడం అంత సులువు కాదనేది నిజం. అందుకే టీమ్ అన్ని రకాలుగా సన్నద్ధమై ఉంది.
పూర్తిగా స్పిన్ పిచ్ అయినా సరే ముందే బెదిరిపోమని, దానికి అనుగుణంగా తమ ఆటను మార్చుకుంటామని కెపె్టన్ లాథమ్ చెబుతున్నాడు. తొలి టెస్టులో కీలక బ్యాటింగ్ ప్రదర్శన చేసిన రచిన్, కాన్వే, యంగ్ మరోసారి జట్టుకు భారీ స్కోరు అందించగల సమర్థులు. వీరితో పాటు లాథమ్, మిచెల్, బ్లన్‌డెల్ కూడా రాణించాలని జట్టు ఆశిస్తోంది.
దూకుడైన బ్యాటింగ్ చేయగల సమర్థుడైన ఫిలిప్స్ ఇటీవల పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా రాణిస్తుండటం ఆ జట్టుకు సానుకూలాంశం. అయితే బెంగళూరు తరహాలో ముగ్గురు పేసర్లు ప్రభావం చూపించే అవకాశం లేదు కాబట్టి ఒకరిని తప్పించి మరో రెగ్యులర్ స్పిన్నర్ సాన్‌ట్నర్‌ను జట్టు బరిలోకి దించనుంది.
2 పుణేలో భారత జట్టు ఇప్పటి వరకు రెండు టెస్టులు ఆడింది. ఒక మ్యాచ్‌లో ఓడి, మరో మ్యాచ్‌లో గెలిచింది. 2017లో ఆ్రస్టేలియా చేతిలో ఓడిన భారత్... 2019లో దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
పిచ్, వాతావరణం
తొలి టెస్టు ముగిసిన దగ్గరి నుంచి చెబుతున్నట్లుగా పూర్తిగా పొడిగా ఉండే స్పిన్ వికెట్‌ను సిద్ధం చేశారు. ఆట సాగుతున్నకొద్దీ స్పిన్నర్లు మరింత ప్రభావం చూపగలరు. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్షసూచన ఏమాత్రం లేదు. అయితే 2017లో ఇదే మైదానంలో పూర్తిగా స్పిన్ పిచ్‌ను తయారు చేసిన భారత్... ఆసీస్ స్పిన్ దెబ్బకు 333 పరుగులతో ఓడి భంగపడిన విషయం గమనార్హం.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్, జైస్వాల్, గిల్, కోహ్లి, సర్ఫరాజ్/రాహుల్, పంత్, జడేజా, అశ్విన్, కుల్దీప్, బుమ్రా, ఆకాశ్‌దీప్/సుందర్.
న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్ ), కాన్వే, యంగ్, రచిన్, మిచెల్, బ్లన్‌డెల్, ఫిలిప్స్, హెన్రీ, ఎజాజ్, సాన్‌ట్నర్, సౌతీ/రూర్కే.
Comments
Please login to add a commentAdd a comment