కివీస్ కు మరోసారి భారీ లక్ష్యం
కోల్ కతా: న్యూజిలాండ్తో ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌట్ కావడంతో న్యూజిలాండ్ ముందు 376 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 227/8 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు మరో 36 పరుగులు చేసి మిగతా రెండు వికెట్లను కోల్పోయింది.
ఈ రోజు ఆటలో ఓవర్ నైట్ బ్యాట్స్ మన్ వృద్ధిమాన్ సాహా(58నాటౌట్;120 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు.మరో ఓవర్ నైట్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ (23) బాధ్యతాయుతంగా ఆడాడు. అయితే భువీ తొమ్మిదో వికెట్ గా అవుటైన తరువాత మహ్మద్ షమీ(1) ఎంతో సేపు క్రీజ్ లో నిలబడలేకపోవడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. ఈ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ హాఫ్ సెంచరీ సాధించిన సాహా అజేయంగా నిలవడం విశేషం. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, హెన్రీ, సాంట్నార్ లు తలో మూడు వికెట్లు సాధించగా, వాగ్నర్ కు ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 316 పరుగులు చేయగా, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 204 పరుగులకు ఆలౌటైంది. తొలి టెస్టులో న్యూజిలాండ్ కు 434 పరుగుల భారీ లక్ష్యాన్నినిర్దేశించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 236 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ కు 197 పరుగుల భారీ విజయం దక్కింది.