వాషింగ్టన్ సుందర్‌కు 7 వికెట్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 ఆలౌట్
కాన్వే, రచిన్ అర్ధ సెంచరీలు
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 16/1
వాషింగ్టన్ సుందర్ టెస్టు మ్యాచ్ ఆడి మూడున్నరేళ్లు దాటింది. ఈ సిరీస్ తొలి టెస్టులో అతనికి చోటే లేదు. అయితే రంజీ ట్రోఫీలో ప్రదర్శన కారణంగా జట్టులో నలుగురు రెగ్యులర్ స్పిన్నర్లు ఉన్నా రెండో టెస్టు కోసం 16వ సభ్యుడిగా అతడిని అదనంగా ఎంపిక చేశారు. ఆఫ్ స్పిన్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతనికి ఈ అవకాశం కల్పించింది.
తొలి రోజు సుందర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఏకంగా ఏడు వికెట్లతో న్యూజిలాండ్‌ను పడగొట్టాడు. సహచర తమిళనాడు సీనియర్ అశ్విన్ తొలి మూడు వికెట్లతో మొదలు పెడితే సుందర్ దానిని కొనసాగించాడు. కివీస్‌ను 259 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా... రోహిత్ శర్మ వికెట్ చేజార్చుకొని రోజును కాస్త నిరాశగా ముగించింది.
పుణే: భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టులో ఊహించినట్లుగానే తొలి రోజు నుంచే స్పిన్నర్ల జోరు మొదలైంది. ఆఫ్‌స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ (7/59), రవిచంద్రన్ అశ్విన్ (3/64) ధాటికి న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 79.1 ఓవర్లలో 259 పరుగులకే ఆలౌటైంది. డెవాన్ కాన్వే (141 బంతుల్లో 76; 11 ఫోర్లు), రచిన్ రవీంద్ర (105 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు.
అనంతరం ఆట ముగిసేసరికి భారత్ 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా... యశస్వి జైస్వాల్ (6 బ్యాటింగ్), శుబ్‌మన్ గిల్ (10 బ్యాటింగ్) తమ దూకుడును కట్టిపెట్టి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, సిరాజ్, కుల్దీప్ యాదవ్ స్థానాల్లో గిల్, ఆకాశ్‌దీప్, సుందర్ జట్టులోకి వచ్చారు.
ఈసారీ వారిద్దరే...
గత టెస్టు తరహాలోనే ఈ సారి కూడా కివీస్ టాప్–7లో కాన్వే, రచిన్ మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడగా... మిగతా వారంతా విఫలమయ్యారు. పేసర్లు వేసిన తొలి 7 ఓవర్లలో కివీస్ 5 ఫోర్లతో చకచకా 30 పరుగులు రాబట్టింది. అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్లోనే అశ్విన్‌ను బౌలింగ్‌కు దించడం ఫలితాన్ని అందించింది.
తన ఐదో బంతికే టామ్ లాథమ్ (15)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతను కొద్ది సేపటికే విల్ యంగ్ (18)ను పెవిలియన్ పంపించాడు. ఈ దశలో కాన్వే, రచిన్ కలిసి జట్టును ఆదుకున్నారు. లంచ్ తర్వాత బుమ్రా వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన కాన్వే 109 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఎట్టకేలకు 62 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం తర్వాత కాన్వేను అవుట్ చేసి అశ్విన్ ఈ జోడీని విడగొట్టాడు. అయితే రచిన్ మాత్రం చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆకాశ్‌దీప్ ఓవర్లో రెండు వరుస ఫోర్లతో అతను 93 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగా... ఒకదశలో కివీస్ 197/3 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది.
టపటపా...
స్పిన్నర్ సుందర్ కొత్త స్పెల్‌తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చక్కటి బంతితో రచిన్‌ను క్లీన్»ౌల్డ్ చేసి కివీస్ పతనానికి శ్రీకారం చుట్టిన అతను తర్వాతి ఓవర్లో బ్లన్‌డెల్ (3) పని పట్టాడు. టీ విరామం తర్వాత చివరి సెషన్‌లో మిగిలిన ఐదు వికెట్లు తీసేందుకు సుందర్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అతని బంతులను ఆడలేక బ్యాటర్లంతా వికెట్లు సమర్పించుకున్నారు.
ఒక్క మిచెల్ సాన్‌ట్నర్ (51 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే కొద్దిసేపు పోరాడగలిగాడు. తన తొలి 13 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయని సుందర్ తర్వాత 61 బంతుల వ్యవధిలో 7 వికెట్లు పడగొట్టడం విశేషం. ప్రత్యర్థి 10 వికెట్లను ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లే కలిసి పడగొట్టడం భారత్ తరఫున ఇదే తొలిసారి. 62 పరుగుల వ్యవధిలో కివీస్ చివరి 7 వికెట్లు కోల్పోయింది.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 15; కాన్వే (సి) పంత్ (బి) అశ్విన్ 76; యంగ్ (సి) పంత్ (బి) అశ్విన్ 18; రచిన్ (బి) సుందర్ 65; మిచెల్ (ఎల్బీ) (బి) సుందర్ 18; బ్లన్‌డెల్ (బి) సుందర్ 3; ఫిలిప్స్ (సి) అశ్విన్ (బి) సుందర్ 9; సాన్‌ట్నర్ (బి) సుందర్ 33; సౌతీ (బి) సుందర్ 5; ఎజాజ్ (బి) సుందర్ 4; రూర్కే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (79.1 ఓవర్లలో ఆలౌట్) 259. వికెట్ల పతనం: 1–32, 2–76, 3–138, 4–197, 5–201, 6–204, 7–236, 8–242, 9–252, 10–259. బౌలింగ్: బుమ్రా 8–2–32–0, ఆకాశ్‌దీప్ 6–0–41–0, అశ్విన్ 24–2–64–3, వాషింగ్టన్ సుందర్ 23.1–4–59–7, జడేజా 18–0–53–0.
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బ్యాటింగ్) 6; రోహిత్ (బి) సౌతీ 0; గిల్ (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టానికి) 16. వికెట్ల పతనం: 1–1. బౌలింగ్: సౌతీ 3–1–4–1, రూర్కే 3–2–5–0, ఎజాజ్ 3–1–5–0, సాన్‌ట్నర్ 2–0–2–0.
Comments
Please login to add a commentAdd a comment