చెలరేగిన హర్షల్‌, చహల్‌.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం | India Vs South Africa 3rd T20 Match Live Updates And Highligts | Sakshi
Sakshi News home page

చెలరేగిన హర్షల్‌, చహల్‌.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం

Published Tue, Jun 14 2022 6:50 PM | Last Updated on Tue, Jun 14 2022 10:31 PM

India Vs South Africa 3rd T20 Match Live Updates And Highligts - Sakshi

సత్తా చాటిన భారత బౌలర్లు.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం
భారత బౌలర్లు హర్షల్‌ పటేల్‌ (4/25), చహల్‌ (3/20) సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఓపెనర్లు ఇషాన్‌ కిషన్ (54)‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ (57) అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో సఫారీలు భారత బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లాసెస్‌ (29) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. 

ఓటమి దిశగా పయనిస్తున్న దక్షిణాఫ్రికా
వరుస క్రమంలో వికెట్లు కోల్పోతున్న దక్షిణాఫ్రికా ఓటమి దిశగా పయనిస్తుంది. 9 వికెట్‌ కోల్పోయే సమయానికి జట్టు 7 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉంది.

71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
భారత బౌలర్లు వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. 9వ ఓవర్‌లో చహల్‌ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ప్రిటోరియస్‌ (20) ఔట్‌ కాగా.. 11వ ఓవర్‌లో హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో గైక్వాడ్‌కు క్యాచ్‌ ఇచ్చి మిల్లర్‌ (3) వెనుదిరిగాడు. 11 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్‌ 71/5. క్రీజ్‌లో క్లాసెన్‌, పార్నెల్‌ ఉన్నారు. 

డస్సెన్‌ ఔట్‌
వరుస ఓవర్లలో దక్షిణాఫ్రికా వికెట్లు కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి డస్సెన్‌ (1) ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్‌ 40/3. క్రీజ్‌లో ప్రిటోరియస్‌, క్లాసెన్‌ ఉన్నారు. 

రెండో వికెట్‌ డౌన్‌
ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌లో దక్షిణాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో చహల్‌కు క్యాచ్‌ ఇచ్చి హెండ్రిక్స్‌ (23) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్‌ 38/2. క్రీజ్‌లో ప్రిటోరియస్‌, డస్సెన్‌ ఉన్నారు.  

తొలి వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా
180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీ జట్టు ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో తొలి వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఆవేశ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి బవుమా(8) ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్‌ 23/1. క్రీజ్‌లో హెండ్రిక్స్‌, ప్రిటోరియస్‌ ఉన్నారు.  

సౌతాఫ్రికా టార్గెట్‌ 180
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు రుతురాజ్‌, ఇషాన్‌ కిషన్‌లు అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆఖర్లో హార్ధిక్‌ పాండ్యా (21 బంతుల్లో 31 నాటౌట్‌) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోర్‌ సాధించగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్‌ 2, రబాడ, షంషి, కేశవ్‌ మహారాజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
రబాడ​ వేసిన 19వ ఓవర్‌లో దినేశ్‌ కార్తీక్‌ ఔటయ్యాడు. 8 బంతుల్లో 6 పరుగులు చేసిన డీకే పార్నెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 167/4. క్రీజ్‌లో హార్ధిక్‌ (20), అక్షర్‌ ఉన్నారు.

పంత్‌ ఔట్‌
ప్రస్తుత సిరీస్‌లో రిషబ్‌ పంత్‌ పేలవ ఫామ్‌ కొనసాగుతుంది. తొలి రెండు టీ20ల్లో నిరాశపరిచిన పంత్‌ ఈ మ్యాచ్‌లోనూ విఫలయ్యాడు. 8 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసిన పంత్‌ ప్రిటోరియస్‌ బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 148/4. క్రీజ్‌లో హార్ధిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌ ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
3 పరుగుల వ్యవధిలో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 128 పరుగుల వద్ద శ్రేయస్‌ వికెట్‌ కోల్పోయిన భారత్‌ 131 పరుగుల వద్ద ఇషాన్‌ కిషన్‌ (35 బంతుల్లో 54) వికెట్‌ను చేజార్చుకుంది. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 133/3. క్రీజ్‌లో పంత్‌, హార్ధిక్‌ పాండ్యా ఉన్నారు.

మరోసారి నిరాశపరిచిన శ్రేయస్‌ 
వన్‌డౌన్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మరోసారి నిరాశపరిచాడు. 11 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 14 పరుగులు చేసిన అతను.. షంషి బౌలింగ్‌లో నోర్జేకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 128/2. క్రీజ్‌లో ఇషాన్‌ కిషన్‌ (53), పంత్‌ ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
ధాటిగా ఆడుతున్న రుతురాజ్‌ గైక్వాడ్‌ 57 పరుగులు వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన రుతురాజ్‌ కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 97/1. క్రీజ్‌లో ఇషాన్‌ కిషన్‌ (36), శేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. 

30 బంతుల్లో హాఫ్‌ సెంచరీ బాదిన రుతురాజ్‌
ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ధాటిగా ఆడుతున్న రుతురాజ్‌.. కేవలం 30 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ధనాధన్‌ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన రుతురాజ్‌.. కెరీర్‌లో తొలి హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. 9 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 89/0గా ఉంది. రుతురాజ్‌ (54), ఇషాన్‌ కిషన్‌ (35) క్రీజ్‌లో ఉన్నారు.

ధాటిగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు రుతురాజ్‌ (16), ఇషాన్‌ కిషన్‌ (6) మెరుపు వేగంతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఫలితంగా టీమిండియా 3 ఓవర్లలో వికెట్‌ నష్టాపోకుండా 22 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా
విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన దక్షిణాఫ్రికా సైతం ఈ మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆతృతగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులేకుండా బరిలోకి దిగుతున్నాయి. 

భారత్ తుదిజట్టు: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్

దక్షిణాఫ్రికా తుదిజట్టు: టెంబా బావుమా(కెప్టెన్‌), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌ కీపర్‌), డ్వైన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement