బ్యాటర్లు బాధ్యతగా ఆడారు. సీమర్లు నిప్పులు చెరిగారు. స్పిన్నర్లు బంతిని గింగిరాలు తిప్పేశారు. కీలకమైన మ్యాచ్‌లో కుమ్మేసిన కుర్రాళ్లు.. అచ్చొచ్చిన స్టేడియంలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించారు. విశాఖలోనే సిరీస్ గెలిచేద్దామనుకున్న దక్షిణాఫ్రికా ఆశలు నెరవేర్చకుండా.. సిరీస్‌పై పట్టు సాధించారు. చాలా రోజుల విరామం తర్వాత విశాఖ.. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడంతో.. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం పరిసర ప్రాంతాలు క్రికెట్ అభిమానులతో కిక్కిరిశాయి.
యువత మన జట్టు టీ షర్టులు ధరించి తరలివచ్చారు. దీంతో స్టేడియానికి వెళ్లే దారుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా అభిమానుల కేరింతలతో కోలాహలం కనిపించింది. జాతీయ జెండా రెపరెపలు దర్శనమిచ్చాయి. భారత్– దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.
సైడ్‌లైట్స్
►మధ్యాహ్నం రెండు గంటల నుంచి క్రీడాభిమానులు వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియానికి తరలివచ్చారు.
►ఎక్కడ చూసినా క్రీడా సందడి, పండగ వాతావరణం కనిపించింది.
►క్రీడాభిమానుల చేతుల్లో జాతీయ జెండా రెపరెపలాడింది.
►సాయంత్రం 5 గంటలకే స్టేడియం నిండిపోయింది. 27,251 సీట్లు ఫుల్ అయిపోయాయి.
►స్టేడియం అంతా రెట్టించిన వెలుగులు. అవన్నీ అభిమానుల సెల్‌ఫోన్ లైట్లు.
►మ్యాచ్ ప్రారంభం అయిన గంటన్నర తర్వాత వరకు కూడా క్రీడాభిమానులను అదుపు చేయడానికి పోలీసులు చాలా కష్టపడ్డారు.
►రాత్రి 8.30 గంటల సమయంలో సీపీ శ్రీకాంత్ వచ్చి పరిస్థితి సమీక్షించారు.
►సచిన్ వీరాభిమాని సుధీర్‌కుమార్, ధోని వీరాభిమాని రాంబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
►ఈ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ నమోదైంది.
►ఇక్కడ జరిగిన గత టీ–20ల్లో 127 పరుగులే అత్యధికం.
►ఇక్కడ టాస్ గెలిచి ఛేజింగ్ చేసిన జట్టుదే విజయం. ఆ సెంటిమెంట్ కంటే అచ్చివచ్చిన స్టేడియం సెంటిమెంటే పైచేయి సాధించింది.
►విజయం అనంతరం ఓ అభిమాని స్టేడియంలోకి చొచ్చుకెళ్లాడు.
►రిషబ్ పంత్ కాలు పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
►కీలకమైన మ్యాచ్ గెలుపుతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
–విశాఖ స్పోర్ట్స్/ మధురవాడ/ పీఎంపాలెం
Comments
Please login to add a commentAdd a comment