మన స్పిన్ తిరగట్లేదు. పేస్‌లో పదును లేదు. బ్యాటింగ్‌లో నిలకడ లేదు. రిషభ్ పంత్ కెప్టెన్ గా, బ్యాటర్‌గా ఏమాత్రం ప్రభావం చూపట్లేదు. సొంతగడ్డపై ఇన్ని ప్రతికూలతల తో తల్లడిల్లుతున్న టీమిండియా చావోరేవో తేల్చుకునేందుకు విశాఖపట్నంలో సిద్ధమైంది.
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో నేడు జరిగే మూడో టి20లో తప్పక గెలవాల్సిన పోరులో జోరుమీదున్న దక్షిణాఫ్రికాను ఢీ కొట్టబోతోంది. ఇక్కడా ఓడితే... ఇక ముందు జరిగే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా లాభముండదు. భారత్ లక్ష్యం సిరీసే అయితే వైజాగ్ నుంచే అంతా మార్చుకోవాలి. సీమర్లు నిప్పులు చెరగాలి. స్పిన్నర్లు తిప్పేయాలి. బ్యాటర్స్ బాధ్యతగా ఆడాలి. ఇవన్నీ ఈ మ్యాచ్‌లో కనిపిస్తే ఆఖరి దాకా సిరీస్ వేటలో ఉంటాం.
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది టి20 ప్రపంచకప్ కోసం గట్టి ప్రత్యర్థితో ఏర్పాటు చేసిన సిరీస్ ఇది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి కుర్రాళ్లను పరిశీలిస్తున్నారు. ఓ రకంగా కోచ్ ద్రవిడ్‌కే పరీక్షలాంటింది ఈ సిరీస్! గతంలో ఐపీఎల్, యువ జట్ల (అండర్ –19, భారత్ ‘ఎ’)ను తీర్చిదిద్దడంలో, కుర్రాళ్ల ప్రతిభను సానబెట్టడంలో సఫలమైన హెడ్ కోచ్‌ను సీనియర్ జట్టు ఫలితాలు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ద్రవిడ్ పంథా మార్చాలి. ఫలితంపై కాకుండా ఆటగాళ్లలో పట్టుదల పెరిగేలా అతను స్ఫూర్తి నింపాలి.
అప్పుడే వరుస ఓటమిల తాలుకు ఒత్తిడి తగ్గుతుంది. బ్యాటర్లు పరుగులపై దృష్టి పెడతారు. బౌలర్లు వైవిధ్యం కనబరుస్తారు. ఓపెనింగ్‌లో రుతురాజ్, ఇషాన్ పవర్ ప్లేను బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఆ తర్వాత పంత్, హార్దిక్ ధాటైన ఇన్నింగ్స్ ఆడితే ఆఖర్లో దినేశ్ కార్తీక్ మెరుపులకు తగిన భారీస్కోరు సాధ్యమవుతుంది. అయితే ఓ పెద్ద స్కోరు చేస్తే పనైపోదని, గెలుపు దక్కదని తొలి మ్యాచ్‌లోనే సఫారీలు నిరూపించారు. కాబట్టి బౌలర్ల పాత్ర కూడా కీలకమే. వికెట్లు తీయడంలో ఏమాత్రం పట్టుసడలించకుండా ఉంటేనే విజయం దక్కుతుంది.
ఆత్మవిశ్వాసంతో దక్షిణాఫ్రికా
తొలి టి20ని బ్యాటింగ్‌తో, రెండో మ్యాచ్‌ను బౌలింగ్ ప్రతాపంతో చేజిక్కించుకున్న సఫారీ జట్టు ఆతిథ్య జట్టుకు కఠినమైన సవాళ్లు విసురుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇప్పుడు వరుసగా మూడో విజయంతో సిరీస్‌పైనే కన్నేసింది. ఈ సిరీస్ ఫలితాలని గమనిస్తే సఫారీ సమష్టి కృష్టితో నెగ్గుకొచ్చింది. కెప్టెన్ బవుమా, డసెన్, మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్ అంతా బ్యాటింగ్‌లో మెరిపిస్తున్నారు. సీమర్లు నోర్జే, ప్రిటోరియస్, పార్నెల్, రబడ, స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌లు రెండో టి20లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌గల ఆతిథ్య జట్టును ఎక్కడికక్కడ కట్టడి చేశారు.
జట్లు (అంచనా)
భారత్: పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్/దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, చహల్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), హెండ్రిక్స్, డసెన్, మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్, పార్నెల్, రబడ, ఇన్‌గిడి/కేశవ్, నోర్జే, షమ్సీ.
పిచ్, వాతావరణం
ఇక్కడ జరిగిన రెండు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లోనూ తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. రెండుసార్లూ చేజింగ్ జట్టే గెలిచింది. సీమర్లు, స్పిన్నర్లకు అనుకూలం. టాస్ నెగ్గిన జట్టు కచ్చితంగా ఫీల్డింగే ఎంచుకుంటుంది. రుతుపవనాల ఆగమనంతో వర్షం కురిసేందుకు 20 శాతం అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment