మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో శతక్కొట్టిన స్కై.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీల (4) ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఈ రికార్డును మ్యాక్స్‌వెల్, రోహిత్ శర్మ సంయుక్తంగా షేర్ చేసుకోగా.. తాజాగా స్కై ఈ ఇద్దరి సరసన చేరాడు.
స్కైకు ఈ రికార్డు సాధించేందుకు కేవలం 57 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరం కాగా.. మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్‌ల్లో, రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు (29/2) బరిలోకి దిగిన స్కై.. తొలి 25 బంతుల్లో కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. ఆతర్వాత పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయిన సూర్యకుమార్.. ఆతర్వాతి 31 బంతుల్లో ఏకంగా 73 పరుగులు పిండుకుని సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కై తన కెరీర్‌లో చేసిన నాలుగు సెంచరీలు నాలుగు వేర్వేరు దేశాల్లో (భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా) చేసినవి కావడం విశేషం.
కాగా, సూర్యకుమార్ యాదవ్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. స్కైకు యశస్వి జైస్వాల్ (60) అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో స్కై, యవస్వి మినహా టీమిండియా ఆటగాళ్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment