పల్లెకెలె: ఆసియా కప్‌లో టీమిండియా నేడు క్రికెట్ కూన నేపాల్‌తో ఏకపక్ష పోటీకి సిద్ధమైంది. ఏ ఫార్మాట్‌లోనైనా నేపాల్ జట్టుతో భారత్‌కిది తొలి మ్యాచ్ కానుంది. భారత్‌లాంటి మేటి జట్టుకు ఈ మ్యాచ్ ఓ లెక్కేకాదు. అయితే ఎవరెంతగా చెలరేగుతారనేదే ఇక్కడ ఆసక్తికరం. కానీ ఇదంతా కూడా మ్యాచ్ జరిగితేనే! ఎందుకంటే వరుసగా భారత్ ఆడే ఈ రెండో మ్యాచ్‌పై కూడా వరుణ ప్రతాపం ఉంది.
సోమవారం రోజు కూడా వర్షం పడే అవకాశాలే ఎక్కువని వాతావరణ కేంద్రం సమాచారమిచ్చింది. ఈ ఆసియా కప్‌కే హైలైట్‌గా నిలవాల్సిన భారత్, పాక్ మ్యాచ్ వర్షార్పణమైంది. దాయాదుల మధ్య ‘ప్రి ప్రపంచకప్’ హోరాహోరీని వీకెండ్‌లో అస్వాదించకుండా వరుణుడు అడ్డుపడ్డాడు. ఇప్పుడు భారత ఆటగాళ్లకు ధనాధన్ ప్రాక్టీస్‌ను ఇచ్చే నేపాల్‌తో మ్యాచ్‌కు ఇదే పునరావృతమైతే భారత అభిమానులకు నిరాశ తప్పదు.
బుమ్రా స్వదేశానికి...
వరుణుడు కరుణించి మ్యాచ్ జరిగితే మాత్రం భారత్ ప్రధాన బలగం బరిలోకి దిగుతుంది. టీమిండియా స్థాయికి సరిపోని ప్రత్యర్థి ఎదురవుతున్నప్పటికీ ఇన్నాళ్లు విశ్రాంతిలో ఉన్న ఆటగాళ్లు తప్పకుండా మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఆడతారు. పైగా గత మ్యాచ్‌లో రోహిత్, శుబ్‌మన్, కోహ్లిలతో కూడిన టాపార్డర్ క్లీన్‌బౌల్డయ్యింది. ఇప్పుడు ఏ చాన్స్ తీసుకోకుండా స్టార్ ఆటగాళ్లంతా నేపాల్‌తో ఆడతారని జట్టు వర్గాల ద్వారా తెలిసింది. తన భార్య సంజన ప్రసవ తేదీ దగ్గరకు రావడంతో పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా స్వదేశానికి చేరుకున్నాడు. భారత్ సూపర్–4 మ్యాచ్‌లకల్లా బుమ్రా తిరిగి లంక చేరుకుంటాడు.
రద్దయినా నష్టం లేదు
గ్రూప్ ‘ఎ’లో నేపాల్‌పై గెలిచిన పాక్... భారత్‌తో మ్యాచ్ రద్దవడంతో వచ్చిన ఒక పాయింట్‌తో ఇదివరకే సూపర్–4కు అర్హత సాధించింది. పాక్ ఖాతాలో 3 పాయింట్లున్నాయి. అయితే 1 పాయింట్ మాత్రమే ఉన్న టీమిండియా లాంఛనమైన మ్యాచ్ జరిగితే గెలుస్తుంది. తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఇదీ రద్దయినా భారత్ 2 పాయింట్లతో రెండో స్థానంతో సూపర్–4 ఎంచక్కా వెళుతుంది. దాంతో వర్షంవల్ల మ్యాచ్ జరగకపోతే టీమిండియాకు పెద్దగా నష్టమైతే లేదు.
Comments
Please login to add a commentAdd a comment